ఆ రెండు దేశాలకు టెస్టు హోదా
లండన్: గత కొంతకాలంగా అంచనాలు మించి రాణిస్తున్న అఫ్ఘానిస్తాన్, ఐర్లాండ్ జట్లకు టెస్టు హోదా దక్కింది. ఈ మేరకు లండన్ లో జరిగిన ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎమ్)లో ఆ రెండు జట్లకు టెస్టు హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఐసీసీలో పూర్తి సభ్యత్వం కల్గిన దేశాలుగా అఫ్ఘాన్, ఐర్లాండ్లు చోటు దక్కించుకున్నాయి. ఈ రెండు దేశాలకు టెస్టు హోదా దక్కడంతో టెస్టు మ్యాచ్లు ఆడే దేశాల సంఖ్య 12కు చేరింది.
అఫ్ఘాన్, ఐర్లాండ్లకు టెస్టు హోదా కల్పించే విషయంలో ఏకగీవ్ర ఆమోదం లభించింది. దీనిలో భాగంగా నిర్వహించిన ఓటింగ్ లో ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో ఆ రెండు దేశాలకు టెస్టు హోదా సులభంగానే దక్కింది. తమకు టెస్టు హోదా కల్పించాలని గతంలో అఫ్ఘాన్, ఐర్లాండ్ లు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వారి విజ్ఞప్తికి ఎట్టకేలకు ఆమోద ముద్ర లభించడంతో ఆయా దేశాల క్రికెట్ బోర్డులో ఆనందం వెల్లివిరిస్తోంది. ఐర్లాండ్ కు 2005లో వన్డే హోదా లభించగా, అఫ్ఘాన్ కు 2009లో వన్డే హోదా దక్కింది.