బంగ్లాకు ‘వంద’నం
తమ 100వ టెస్టులో లంకపై చిరస్మరణీయ విజయం
కొలంబో: టెస్టు హోదా పొందినప్పటి నుంచి 99 మ్యాచ్‌లాడినా... కూనలుగానే ముద్రపడిన బంగ్లాదేశ్ వందో టెస్టులో మాత్రం సమష్టి ఆటతీరుతో చారిత్రక విజయం సాధించింది. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. లంక తమ ముందుంచిన 191 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా 57.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (82; 7 ఫోర్లు, 1 సిక్స్) చక్కని పోరాటం చేశాడు. షబ్బీర్ (41; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. జట్టు స్కోరు 131 పరుగుల వద్ద లక్ష్యానికి ఇంకా 60 పరుగుల దూరంలో తమీమ్ మూడో వికెట్‌గా నిష్క్రమించడం, కాసేపటికే షబ్బీర్ కూడా ఔట్ కావడంతో బంగ్లా శిబిరంలో కలవరం మొదలైంది.
కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (22 నాటౌట్), షకీబుల్ హసన్ (15) కుదురుగా ఆడటంతో బంగ్లా గట్టెక్కింది. లంక బౌలర్లు పెరీరా, హెరాత్‌లు చెరో 3 వికెట్లు తీశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 268/8తో ఆదివారం చివరి రోజు ఆట కొనసాగించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 319 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి టెస్టులో లంక గెలవడంతో రెండు టెస్టుల ఈ సిరీస్ 1–1తో ముగిసింది. తమీమ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... షకీబుల్ కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు లభించాయి. విదేశీ గడ్డపై బంగ్లాకిది నాలుగో విజయంకాగా... శ్రీలంకపై తొలి గెలుపు. ఆస్ట్రేలియా, పాక్, విండీస్ తర్వాత తమ వందో టెస్టులో విజయాన్ని అందుకున్న నాలుగో జట్టు బంగ్లాదేశ్ కావడం విశేషం.