విజయానికి 7 వికెట్లు | India need 7 wickets on final day for victory | Sakshi
Sakshi News home page

విజయానికి 7 వికెట్లు

Published Mon, Feb 13 2017 12:24 AM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM

విజయానికి 7 వికెట్లు

విజయానికి 7 వికెట్లు

గెలుపు బాటలో భారత్‌
బంగ్లాదేశ్‌ విజయలక్ష్యం 459 ప్రస్తుతం 103/3
 స్పిన్నర్ల జోరు మొదలు


సొంతగడ్డపై భారత్‌ విజయ యాత్రలో మరో మ్యాచ్‌ చేరడానికి రంగం సిద్ధమైంది. పది వికెట్లు కూల్చే లక్ష్యంలో ఇప్పటికే ముగ్గురిని పెవిలియన్‌ పంపించిన టీమిండియా ప్రత్యర్థి పతనానికి శ్రీకారం చుట్టింది. పిచ్‌ స్పిన్‌కు అనుకూలించడం ప్రారంభమైపోయింది, వాతావరణం సమస్యా లేదు... మన విజయాన్ని అడ్డుకోగలిగే సామర్థ్యం ఉన్న ఆటగాడూ అటు వైపు లేడు. మిగిలిన ఏడు వికెట్ల లాంఛనాన్ని ఎంత త్వరగా ముగిస్తారన్నదే తేలాల్సి ఉంది.

భారత గడ్డపై తొలిసారి టెస్టు ఆడే అవకాశం దక్కించుకున్న బంగ్లాదేశ్‌కు టెస్టు చరిత్రలో ఎవరూ అందుకోలేని లక్ష్యం ఎదురుగా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చూపినా... రెండో సారి అదే తరహాలో ఆడటం అంత సులువు కాదు. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ నిష్క్రమించిన నేపథ్యంలో మరో 90 ఓవర్లు ఆడి మ్యాచ్‌ను కాపాడుకోవడం వారికి శక్తికి మించిన పనే కానుంది. వెరసి బంగ్లాదేశ్‌కు
ఈ టెస్టు ఒక పాఠంగా మిగిలిపోవచ్చు.  

హైదరాబాద్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్‌ గెలుపు దిశగా సాగుతోంది. 459 పరుగుల అతి భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ నాలుగో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. షకీబుల్‌ హసన్‌ (21 బ్యాటింగ్‌), మహ్ముదుల్లా (9 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లా విజయం కోసం మరో 356 పరుగులు చేయాల్సి ఉంది. చివరి రోజు ఇది దాదాపు అసాధ్యం కాబట్టి ఆ జట్టు ‘డ్రా’ కోసం ప్రయత్నించవచ్చు. కానీ ఇప్పటికే అశ్విన్, జడేజాలకు పట్టు చిక్కిన నేపథ్యంలో భారత్‌ విజయానికి చేరువైనట్లే.

అంతకుముందు ఉదయం బంగ్లాదేశ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 388 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ (262 బంతుల్లో 127; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్‌కు 299 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. బౌలర్లకు కాస్త విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో కోహ్లి సేన ఫాలోఆన్‌ ఇవ్వకుండా మళ్లీ బ్యాటింగ్‌ చేయడానికే ఆసక్తి చూపించింది. తమ రెండో ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడుతూ 29 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. చతేశ్వర్‌ పుజారా (58 బంతుల్లో 54 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ సాధించాడు.

సెషన్‌–1: ముగిసిన బంగ్లా ఆట
ఓవర్‌నైట్‌ స్కోరు 322/6తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన బంగ్లాదేశ్‌కు మొదటి ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. భువనేశ్వర్‌ వేసిన నాలుగో బంతిని ఆడలేక మెహదీ హసన్‌ (51) క్లీన్‌బౌల్డయ్యాడు. కొద్ది సేపటికే తైజుల్‌ (10) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో 87 పరుగుల వద్ద ఉన్న ముష్ఫికర్‌కు తస్కీన్‌ (8) కాసేపు అండగా నిలిచి సెంచరీ చేయడానికి సహకరించాడు. ఇషాంత్‌ బౌలింగ్‌లో భారీ సిక్స్‌ కొట్టిన తర్వాత అదే ఓవర్లో ముష్ఫికర్‌ ఎల్బీడబ్ల్యూ కోసం భారత్‌ రివ్యూ చేసినా ఫలితం ప్రతికూలంగానే వచ్చింది. ఆ వెంటనే ఉమేశ్‌ బౌలింగ్‌లో ఫైన్‌లెగ్‌ దిశగా ఫోర్‌ కొట్టి శతకం అందుకున్న ముష్ఫికర్‌... అశ్విన్‌ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్‌ బాదాడు. అయితే తస్కీన్‌ను జడేజా అవుట్‌ చేయగా, ముష్ఫికర్‌ను అవుట్‌ చేసి అశ్విన్‌ 250వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. విరామానికి ముందు భారత్‌ ఒక ఓవర్‌ ఆడింది.
ఓవర్లు: 23.5, పరుగులు: 66,వికెట్లు: 4 (బంగ్లాదేశ్‌)
ఓవర్లు: 1, పరుగులు: 1, వికెట్లు: 0 (భారత్‌)


సెషన్‌–2: భారత్‌ దూకుడు
భారీ ఆధిక్యం ఉన్నా, ఫాలోఆన్‌ ఇవ్వకుండా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఊహించినట్లుగానే ఆరంభం నుంచి ధాటిగా ఆడింది. తస్కీన్‌ బౌలింగ్‌లో విజయ్‌ (7), రాహుల్‌ (10) తొందరగానే నిష్క్రమించినా, భారత్‌ ఎక్కడా జోరు తగ్గించలేదు. పుజారా, కోహ్లి (40 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా పరుగులు రాబట్టారు. షకీబ్‌ ఓవర్లో భారీ సిక్స్‌ కొట్టిన కోహ్లి, అదే ఓవర్లో మరో షాట్‌కు ప్రయత్నించి షార్ట్‌ మిడ్‌ వికెట్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. 4 పరుగుల వద్ద షకీబ్‌ రిటర్న్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన రహానే (28; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా జోరుగా ఆడాడు. అయితే షకీబ్‌ బౌలింగ్‌లోనే అతను వెనుదిరిగాడు. అదే ఓవర్లో జడేజా (16 నాటౌట్‌) ఇచ్చిన క్యాచ్‌ను మెహదీ వదిలేయగా, భారత్‌కు 11 పరుగులు వచ్చాయి. రెండో సెషన్‌ చివరి ఓవర్లో 57 బంతుల్లో పుజారా అర్ధసెంచరీ పూర్తయింది. టీ విరామం ప్రకటించగానే భారత్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 5.48 రన్‌రేట్‌తో పరుగులు సాధించడం విశేషం.
ఓవర్లు: 28, పరుగులు: 158: వికెట్లు: 4

సెషన్‌–3: స్పిన్‌ తిరిగింది...
టెస్టు మ్యాచ్‌ను కాపాడుకునే లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ జట్టు భారత స్పిన్‌ ఉచ్చులో చిక్కింది. క్రీజ్‌లో ఇద్దరు లెఫ్ట్‌ హ్యాండర్లు ఉండటంతో కొత్త బంతిని అశ్విన్‌ చేతిలో పెట్టి కోహ్లి ఫలితం పొందాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో బంతి తమీమ్‌ ఇక్బాల్‌ (3) బ్యాట్‌ను తాకుతూ గల్లీలో ఉన్న కోహ్లి చేతుల్లో పడింది. అయితే ముందుగా భారత ఆటగాళ్లంతా ఎల్బీ కోసం అప్పీల్‌ చేసినా, ఆ వెంటనే కోహ్లి క్యాచ్‌ కోసం రివ్యూకు వెళ్లాడు. సమీక్షలో భారత్‌కు అనుకూలంగా రావడంతో బంగ్లా తొలి వికెట్‌ కోల్పోయింది. ఈ దశలో సర్కార్, మోమినుల్‌ (63 బంతుల్లో 27; 3 ఫోర్లు) కలిసి  జాగ్రత్తగా ఆడారు. ఈ జోడి రెండో వికెట్‌కు 60 పరుగులు జోడించి నిలదొక్కుకుంటున్న దశలో భారత్‌ మళ్లీ దెబ్బ వేసింది. జడేజా, అశ్విన్‌ల బౌలింగ్‌లో స్లిప్‌లో రహానే రెండు క్యాచ్‌లు అందుకోవడంతో సర్కార్, మోమినుల్‌ నాలుగు పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. ఆ తర్వాత మహ్ముదుల్లా, షకీబ్‌ 10.5 ఓవర్ల పాటు జాగ్రత్తగా ఆడి మరో వికెట్‌ పడకుండా రోజును ముగించారు.
ఓవర్లు: 35, పరుగులు: 103, వికెట్లు: 3


1  అత్యంత వేగంగా 250 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అశ్విన్‌ (45 టెస్టులు) నిలిచాడు. గతంలో ఆస్ట్రేలియా పేసర్‌ డెన్నిస్‌ లిల్లీ (48 టెస్టుల్లో) పేరిట ఉన్న రికార్డును అతను సవరించాడు. భారత్‌ తరఫున 250 వికెట్లు తీసేందుకు కుంబ్లేకు 55 టెస్టులు పట్టా యి. అశ్విన్‌ టెస్టుల్లోకి అడుగు పెట్టిన దగ్గరి నుంచి అతనికంటే ఎక్కువ వికెట్లు కూడా ఎవరూ తీయలేకపోవడం విశేషం. 5 ఏళ్ల 95 రోజుల్లో అతను ఈ ఘనత సాధించాడు.  

1  ఒకే టెస్టులో ఇరు జట్ల కెప్టెన్లు, వికెట్‌ కీపర్లు సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కోహ్లి, సాహా, ముష్ఫికర్‌ ఈ మ్యాచ్‌లో శతకాలు బాదారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement