BAN VS IRE Test Match: బంగ్లాదేశ్ వెటరన్ బ్యాటర్ 35 ఏళ్ల ముష్ఫికర్ రహీం లేటు వయసులో కుర్రాళ్లకు మించి రెచ్చిపోతున్నాడు. ఢాకా వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన రహీం (తొలి ఇన్నింగ్స్‌లో 126) వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించి ఔరా అనిపించాడు.
ఈ మ్యాచ్‌కు ముందు ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో చివరిసారిగా బ్యాటింగ్ (ఐర్లాండ్‌తో మూడో వన్డేలో రహీంకు బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోగా.. ఆ తర్వాత జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రహీం ఆడలేదు) చేసిన రహీం.. ఫలితం తేలకుండా ముగిసిన ఆ మ్యాచ్‌లో 60 బంతుల్లోనే అజేయమైన శతకాన్ని బాది శభాష్ అనిపించకున్నాడు.
తాజా సెంచరీతో టెస్ట్‌ల్లో 10వ సెంచరీ నమోదు చేసిన రహీం.. తన జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు చాపచుట్టేయగా.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగుల భారీ స్కోర్ చేసి 155 పరుగుల ఆధిక్యం సాధించింది.
ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ టెక్టార్ (50) అర్ధసెంచరీతో రాణించగా.. బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లాం 5 వికెట్లతో చెలరేగాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో రహీంతో పాటు షకీబ్ అల్ హసన్ (87), మెహిది హసన్ (55) రాణించగా.. ఐరిష్ బౌలర్ ఆండీ మెక్‌బ్రైన్ 6 వికెట్లతో సత్తా చాటాడు. రెండో రోజు మూడో సెషన్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్.. పరుగులేమీ చేయకుండానే నాలుగో బంతికే వికెట్ కోల్పోయింది. జేమ్స్ మెక్‌కొల్లమ్‌ను షకీబ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment