Rahim musphikar
-
శ్రీలంకకు భారీ ఆధిక్యం
గాలే: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో శ్రీలంకకు 182 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో రోజు 133/2 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 97.2 ఓవర్లలో 312 పరుగుల వద్ద ఆలౌటైంది. ముష్ఫీకర్ రహీమ్ (85), సౌమ్య సర్కార్ (71), హసన్ మిరాజ్ (41) రాణించారు. వర్షం వల్ల ఆటకు అంతరాయం కలగడంతో మూడో రోజు కేవలం 51.2 ఓవర్ల ఆటే సాగింది. -
విజయానికి 7 వికెట్లు
గెలుపు బాటలో భారత్ బంగ్లాదేశ్ విజయలక్ష్యం 459 ప్రస్తుతం 103/3 స్పిన్నర్ల జోరు మొదలు సొంతగడ్డపై భారత్ విజయ యాత్రలో మరో మ్యాచ్ చేరడానికి రంగం సిద్ధమైంది. పది వికెట్లు కూల్చే లక్ష్యంలో ఇప్పటికే ముగ్గురిని పెవిలియన్ పంపించిన టీమిండియా ప్రత్యర్థి పతనానికి శ్రీకారం చుట్టింది. పిచ్ స్పిన్‌కు అనుకూలించడం ప్రారంభమైపోయింది, వాతావరణం సమస్యా లేదు... మన విజయాన్ని అడ్డుకోగలిగే సామర్థ్యం ఉన్న ఆటగాడూ అటు వైపు లేడు. మిగిలిన ఏడు వికెట్ల లాంఛనాన్ని ఎంత త్వరగా ముగిస్తారన్నదే తేలాల్సి ఉంది. భారత గడ్డపై తొలిసారి టెస్టు ఆడే అవకాశం దక్కించుకున్న బంగ్లాదేశ్‌కు టెస్టు చరిత్రలో ఎవరూ అందుకోలేని లక్ష్యం ఎదురుగా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చూపినా... రెండో సారి అదే తరహాలో ఆడటం అంత సులువు కాదు. ప్రధాన బ్యాట్స్‌మెన్ నిష్క్రమించిన నేపథ్యంలో మరో 90 ఓవర్లు ఆడి మ్యాచ్‌ను కాపాడుకోవడం వారికి శక్తికి మించిన పనే కానుంది. వెరసి బంగ్లాదేశ్‌కు ఈ టెస్టు ఒక పాఠంగా మిగిలిపోవచ్చు. హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్ గెలుపు దిశగా సాగుతోంది. 459 పరుగుల అతి భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మ్యాచ్ నాలుగో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. షకీబుల్ హసన్ (21 బ్యాటింగ్), మహ్ముదుల్లా (9 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లా విజయం కోసం మరో 356 పరుగులు చేయాల్సి ఉంది. చివరి రోజు ఇది దాదాపు అసాధ్యం కాబట్టి ఆ జట్టు ‘డ్రా’ కోసం ప్రయత్నించవచ్చు. కానీ ఇప్పటికే అశ్విన్, జడేజాలకు పట్టు చిక్కిన నేపథ్యంలో భారత్ విజయానికి చేరువైనట్లే. అంతకుముందు ఉదయం బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 388 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (262 బంతుల్లో 127; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్‌కు 299 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. బౌలర్లకు కాస్త విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో కోహ్లి సేన ఫాలోఆన్ ఇవ్వకుండా మళ్లీ బ్యాటింగ్ చేయడానికే ఆసక్తి చూపించింది. తమ రెండో ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడుతూ 29 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. చతేశ్వర్ పుజారా (58 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. సెషన్–1: ముగిసిన బంగ్లా ఆట ఓవర్‌నైట్ స్కోరు 322/6తో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్‌కు మొదటి ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. భువనేశ్వర్ వేసిన నాలుగో బంతిని ఆడలేక మెహదీ హసన్ (51) క్లీన్‌బౌల్డయ్యాడు. కొద్ది సేపటికే తైజుల్ (10) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో 87 పరుగుల వద్ద ఉన్న ముష్ఫికర్‌కు తస్కీన్ (8) కాసేపు అండగా నిలిచి సెంచరీ చేయడానికి సహకరించాడు. ఇషాంత్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టిన తర్వాత అదే ఓవర్లో ముష్ఫికర్ ఎల్బీడబ్ల్యూ కోసం భారత్ రివ్యూ చేసినా ఫలితం ప్రతికూలంగానే వచ్చింది. ఆ వెంటనే ఉమేశ్ బౌలింగ్‌లో ఫైన్‌లెగ్ దిశగా ఫోర్ కొట్టి శతకం అందుకున్న ముష్ఫికర్... అశ్విన్ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ బాదాడు. అయితే తస్కీన్‌ను జడేజా అవుట్ చేయగా, ముష్ఫికర్‌ను అవుట్ చేసి అశ్విన్ 250వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. విరామానికి ముందు భారత్ ఒక ఓవర్ ఆడింది. ఓవర్లు: 23.5, పరుగులు: 66,వికెట్లు: 4 (బంగ్లాదేశ్) ఓవర్లు: 1, పరుగులు: 1, వికెట్లు: 0 (భారత్) సెషన్–2: భారత్ దూకుడు భారీ ఆధిక్యం ఉన్నా, ఫాలోఆన్ ఇవ్వకుండా బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఊహించినట్లుగానే ఆరంభం నుంచి ధాటిగా ఆడింది. తస్కీన్ బౌలింగ్‌లో విజయ్ (7), రాహుల్ (10) తొందరగానే నిష్క్రమించినా, భారత్ ఎక్కడా జోరు తగ్గించలేదు. పుజారా, కోహ్లి (40 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా పరుగులు రాబట్టారు. షకీబ్ ఓవర్లో భారీ సిక్స్ కొట్టిన కోహ్లి, అదే ఓవర్లో మరో షాట్‌కు ప్రయత్నించి షార్ట్ మిడ్ వికెట్లో క్యాచ్ ఇచ్చాడు. 4 పరుగుల వద్ద షకీబ్ రిటర్న్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన రహానే (28; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా జోరుగా ఆడాడు. అయితే షకీబ్ బౌలింగ్‌లోనే అతను వెనుదిరిగాడు. అదే ఓవర్లో జడేజా (16 నాటౌట్) ఇచ్చిన క్యాచ్‌ను మెహదీ వదిలేయగా, భారత్‌కు 11 పరుగులు వచ్చాయి. రెండో సెషన్ చివరి ఓవర్లో 57 బంతుల్లో పుజారా అర్ధసెంచరీ పూర్తయింది. టీ విరామం ప్రకటించగానే భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 5.48 రన్‌రేట్‌తో పరుగులు సాధించడం విశేషం. ఓవర్లు: 28, పరుగులు: 158: వికెట్లు: 4 సెషన్–3: స్పిన్ తిరిగింది... టెస్టు మ్యాచ్‌ను కాపాడుకునే లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు భారత స్పిన్ ఉచ్చులో చిక్కింది. క్రీజ్‌లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు ఉండటంతో కొత్త బంతిని అశ్విన్ చేతిలో పెట్టి కోహ్లి ఫలితం పొందాడు. అశ్విన్ బౌలింగ్‌లో బంతి తమీమ్ ఇక్బాల్ (3) బ్యాట్‌ను తాకుతూ గల్లీలో ఉన్న కోహ్లి చేతుల్లో పడింది. అయితే ముందుగా భారత ఆటగాళ్లంతా ఎల్బీ కోసం అప్పీల్ చేసినా, ఆ వెంటనే కోహ్లి క్యాచ్ కోసం రివ్యూకు వెళ్లాడు. సమీక్షలో భారత్‌కు అనుకూలంగా రావడంతో బంగ్లా తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో సర్కార్, మోమినుల్ (63 బంతుల్లో 27; 3 ఫోర్లు) కలిసి జాగ్రత్తగా ఆడారు. ఈ జోడి రెండో వికెట్‌కు 60 పరుగులు జోడించి నిలదొక్కుకుంటున్న దశలో భారత్ మళ్లీ దెబ్బ వేసింది. జడేజా, అశ్విన్‌ల బౌలింగ్‌లో స్లిప్‌లో రహానే రెండు క్యాచ్‌లు అందుకోవడంతో సర్కార్, మోమినుల్ నాలుగు పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. ఆ తర్వాత మహ్ముదుల్లా, షకీబ్ 10.5 ఓవర్ల పాటు జాగ్రత్తగా ఆడి మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. ఓవర్లు: 35, పరుగులు: 103, వికెట్లు: 3 ►1 అత్యంత వేగంగా 250 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అశ్విన్ (45 టెస్టులు) నిలిచాడు. గతంలో ఆస్ట్రేలియా పేసర్ డెన్నిస్ లిల్లీ (48 టెస్టుల్లో) పేరిట ఉన్న రికార్డును అతను సవరించాడు. భారత్ తరఫున 250 వికెట్లు తీసేందుకు కుంబ్లేకు 55 టెస్టులు పట్టా యి. అశ్విన్ టెస్టుల్లోకి అడుగు పెట్టిన దగ్గరి నుంచి అతనికంటే ఎక్కువ వికెట్లు కూడా ఎవరూ తీయలేకపోవడం విశేషం. 5 ఏళ్ల 95 రోజుల్లో అతను ఈ ఘనత సాధించాడు. ► 1 ఒకే టెస్టులో ఇరు జట్ల కెప్టెన్లు, వికెట్ కీపర్లు సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కోహ్లి, సాహా, ముష్ఫికర్ ఈ మ్యాచ్‌లో శతకాలు బాదారు. -
ఎన్ని రోజుల్లో ముగిస్తారో!
మరో టెస్టు విజయంపై భారత్ గురి ► బలహీన ప్రత్యర్థితో పోరుకు సిద్ధం ► నేటి నుంచి బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు ► జోరు మీదున్న టీమిండియా ఒక జట్టేమో తిరుగులేని ప్రదర్శనతో అగ్రస్థానంలో కొనసాగుతూ టెస్టు క్రికెట్‌పై ఆధిపత్యం చలాయిస్తోంది. మరో జట్టేమో 97 టెస్టులు ఆడినా... పెద్ద జట్లపై గెలిచినవి మాత్రం మూడంటే మూడే. ఒక జట్టులో ఆటగాళ్లేమో బ్యాట్ పడితే రికార్డు లు, బంతి చేతుల్లోకి తీసుకుంటే రికార్డులు బద్దలు. మరో జట్టేమో ఐదు రోజుల ఆటలో మూడు రోజులు పోటీ ఇవ్వగలిగినా చాలనే ధోరణితో ఇంకా ఓనమాలు దశలోనే ఉంది. ఇప్పుడు ఈ రెండు టీమ్‌ల మధ్య పోరు చూస్తే ఒకరికి చెలగాటం, మరొకరికి ప్రాణ సంకటం అనేలా పరిస్థితి ఉంది. మరి చివరకు ఫలితం ఎలా రాబోతోంది. దశాబ్దాలుగా అంతర్జాతీయ క్రికెట్ పరిపాలనను శాసించిన భారత్ వేర్వేరు కారణాలతో ఇన్నేళ్లుగా బంగ్లాదేశ్ జట్టుకు ఆతిథ్యం ఇవ్వలేదు. ఏది ఏమైనా ఇప్పుడు ఎట్టకేలకు హైదరాబాద్ వేదికగా ఈ చరిత్రాత్మక టెస్టుకు రంగం సిద్ధమైంది. నంబర్‌వన్ జట్టుగానే కాకుండా ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన ప్రకారం చూసినా ఇటీవలి తమ రికార్డును కొనసాగించాల్సిన స్థితిలో కోహ్లి సేన ఈ టెస్టు కోసం సిద్ధం కాగా... తమకు ఇక్కడ టెస్టు ఆడే అవకాశం ఇవ్వడంలో పొరపాటేమీ లేదని నిరూపించుకోవాల్సిన ఒత్తిడి కూడా బంగ్లాదేశ్‌పై ఉంది. బలాబలాల పరంగా మన జట్టు ఎంతో ముందంజలో కనిపిస్తున్నా, మ్యాచ్ పూర్తిగా ఏకపక్షం మాత్రం కాకపోవచ్చు. హైదరాబాద్: భారత్, బంగ్లాదేశ్ చారిత్రక టెస్టు మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నేటి (గురువారం) నుంచి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతుంది. సొంతగడ్డపై ఈ సీజన్లో ఆడిన 8 టెస్టులలో 7 గెలిచి భారత్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, స్వదేశంలో ఇంగ్లండ్‌పై టెస్టు నెగ్గి... న్యూజిలాండ్‌లో ఘోరంగా ఓడిన తర్వాత బంగ్లాదేశ్ ఇక్కడ అడుగు పెట్టింది. ఇరు జట్ల మధ్య గతంలో 8 టెస్టులు జరగ్గా, భారత్ 6 గెలిచింది, మరో 2 ‘డ్రా’గా ముగిశాయి. తిరుగులేని లైనప్... వరుసగా టెస్టు సిరీస్‌లను అలవోకగా గెలుస్తూ వచ్చిన భారత్‌కు ఈ టెస్టులో కూడా పెద్దగా పోటీ ఎదురు కాకపోవచ్చు. అయితే ఇక్కడి పరిస్థితులు బంగ్లాదేశ్‌కు కూడా కాస్త అనుకూలమైనవి కావడంతో జాగ్రత్త పడక తప్పదు. ఇదే విషయాన్ని కోహ్లి కూడా హెచ్చరించాడు. జట్టులో ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా చక్కటి ఫామ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌తో చివరి టెస్టు ఆడిన భారత జట్టులో కొన్ని మార్పులకు అవకాశం ఉంది. కరుణ్ నాయర్ ఆ మ్యాచ్‌లో చెలరేగి ‘ట్రిపుల్ సెంచరీ’ సాధించినా... తుది జట్టులో అతను ఉండేది అనుమానమే. రహానేకు మద్దతుగా కోచ్ కుంబ్లే, కెప్టెన్ కోహ్లి చెప్పిన మాటలు దీనిని నిర్ధారిస్తున్నాయి. బ్యాటింగ్ కాంబినేషన్ విషయంలో పెద్దగా సందేహాలు ఏమీ లేవు. అయితే వీరిద్దరిని కూడా ఆడించాలనే ఆలోచన కూడా మేనేజ్మెంట్కు ఉంది. అదే జరిగితే నలుగురు బౌలర్లతోనే బరిలోకి దిగాల్సి ఉంటుంది. పేసర్లుగా ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ ఉండటం ఖాయం. అశ్విన్, రవీంద్ర జడేజాలకు తోడుగా మూడో స్పిన్నర్‌గా జయంత్ యాదవ్‌ను ఆడిస్తారా, లేక ఆరో బ్యాట్స్‌మన్‌కు చోటిస్తారా అనేది చూడాలి. న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లతో పోలిస్తే బంగ్లాదేశ్‌లో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు కాబట్టి పూర్తిగా స్పిన్ వికెట్‌ను భారత్ నమ్ముకుంటే లాభం లేదు. అది ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం కూడా ఉంది. కోహ్లి నాయకత్వంలో ఇప్పటి వరకు దూకుడుగా ఆడుతున్న టీమిండియా ఈసారి కూడా దానిని కొనసాగించాలని పట్టుదలగా ఉంది. పోటీ ఇస్తారా? సొంతగడ్డపై బంగ్లాదేశ్ ఇటీవలే ఇంగ్లండ్‌ను ఓడించింది. మరో టెస్టులో కూడా విజయానికి చేరువగా వచ్చింది. న్యూజిలాండ్‌లో కూడా మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చినా చివరకు ఓటమి తప్పలేదు. అయితే గత కొన్నేళ్లలో బంగ్లా క్రికెట్ ఎంతో మెరుగైందనడంలో సందేహం లేదు. వన్డేలు, టి20లతో పోలిస్తే ఆ తరహాలో కాకపోయినా, టెస్టుల్లో కూడా మెలమెల్లగా జట్టు కుదురుకుంటోంది. టెస్టుల్లోకి అడుగు పెట్టిన 18 ఏళ్ల తర్వాత గానీ భారత గడ్డపై ఆడే అవకాశం రాని ఆ జట్టు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని భావిస్తోంది. జట్టు విజయావకాశాలు సీనియర్లు తమీమ్, షకీబ్, ముష్ఫికర్ రహీమ్‌లపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. జట్టు బ్యాటింగ్‌తో పోలిస్తే ఆ జట్టు తమ బౌలింగ్‌పై కూడా మంచి నమ్మకం పెట్టుకుంది. ఇద్దరు రెగ్యులర్ పేసర్లు తస్కీన్, రబ్బానీలు జట్టులో ఉండే అవకాశం ఉండగా... స్పిన్నర్లు మెహదీ హసన్, తైజుల్ కీలకం కానున్నారు. ఐదో రోజు వరకు మ్యాచ్‌ను తీసుకు పోగలమని చెబుతున్న బంగ్లా కెప్టెన్ మాటల్లో పోటీ ఇవ్వగలమన్న ఆత్మవిశ్వాసం ఉంది. అదే విధంగా ఆ మాత్రం ఆడగలిగినా చాలనే భయం కూడా కనిపిస్తోంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), విజయ్, రాహుల్, పుజారా, రహానే, నాయర్/జయంత్, సాహా, అశ్విన్, జడేజా, ఇషాంత్, ఉమేశ్. బంగ్లాదేశ్: ముష్ఫికర్ రహీమ్ (కెప్టెన్), తమీమ్, సర్కార్, మోమినుల్, మహ్ముదుల్లా, షకీబ్, షబ్బీర్, హసన్, తైజుల్, తస్కీన్, కమ్రుల్. పిచ్, వాతావరణం భారత్‌లో సాధారణంగా కనిపించే ఇతర పిచ్‌లలాగే ఉప్పల్‌లోనూ పచ్చిక లేకుండా కాస్త పొడిగా కూడా పిచ్ కనిపిస్తోంది. ఆరంభంలో బ్యాటింగ్‌కు అనుకూలించి ఆ తర్వాత స్పిన్ తిరగడం ఖాయం. మైదానంలో గత మూడు టెస్టుల రికార్డు కూడా ఇదే చెబుతోంది. నగరంలో చాలా రోజులుగా సాధారణ వాతావరణమే ఉంది. మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశం కూడా ఏమాత్రం లేదు. ఇటీవలి మా విజయాల్లో పేసర్లు, స్పిన్నర్లు సమాన పాత్ర పోషించారు. బౌలర్లు 20 వికెట్లు తీస్తేనే టెస్టుల్లో విజయాలు సాధ్యం. అందుకే బౌలర్లపై మనం నమ్మకం ఉంచాలి. ఎలాంటి సమయంలోనైనా ఆటగాళ్లకు మద్దతుగా నిలిస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. నాయర్ ట్రిపుల్ సెంచరీ చేయడం మంచి విషయమే అయినా నా అభిప్రాయం ప్రకారం మరో ఆటగాడి ఒక్క ఇన్నింగ్స్ వల్ల రహానే రెండేళ్ల శ్రమను మరచిపోవద్దు. అతను దాదాపు 50 సగటుతో పరుగులు చేశాడు. కాబట్టి గాయం నుంచి తిరిగొచ్చాక అవకాశం ఇవ్వడమే న్యాయం. ప్రత్యర్థి గురించి, వారి ప్రణాళికల గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఇటీవల బంగ్లాదేశ్ మెరుగైనా, వారు మరిన్ని టెస్టులు ఆడితే మంచిదని నా సూచన. – విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ టెస్టు క్రికెట్ అంటే ఒకరో, ఇద్దరో రాణిస్తే గెలిచేది కాదు. న్యూజిలాండ్‌లో మాకు అదే అనుభవం ఎదురైంది. సమష్టిగా ఆడి మ్యాచ్‌లో పోటీ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాం. మాలో చాలా మంది భారత గడ్డపై తొలిసారి ఆడుతున్నారు. వారు నేర్చుకునేందుకు ఈ టెస్టు అవకాశం కల్పిస్తోంది. భారత్‌లాంటి జట్టుపై వ్యూహాలు పన్నడం కాదు వాటిని సమర్థంగా అమలు చేయడం ముఖ్యం. వన్డేలు, టి20ల్లో మేం చూపిస్తున్న ఆటను ఇక్కడ ప్రదర్శిస్తే టెస్టులో ఏదో ఒక దశలో ఆధిపత్యం ప్రదర్శించగలమని విశ్వాసంతో ఉన్నాం. – ముష్ఫికర్ రహీమ్, బంగ్లాదేశ్ కెప్టెన్ ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
బంగ్లాదేశ్ తడబాటు
ముగ్గురు ప్రధాన బ్యాట్స్‌మెన్ విఫలం తొలి ఇన్నింగ్స్‌లో 224/8 డిక్లేర్డ్ భారత్ ‘ఎ’తో ప్రాక్టీస్ మ్యాచ్ హైదరాబాద్: భారత్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ జట్టు సన్నాహకం గొప్పగా సాగలేదు. భారత్ ‘ఎ’తో జింఖానా మైదానంలో ఆదివారం మొదలైన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. మ్యాచ్ తొలి రోజు తమ మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (106 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్), సౌమ్య సర్కార్ (73 బంతుల్లో 52; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. 67 ఓవర్లు మాత్రమే ఎదుర్కొన్న బంగ్లా, మొదటి రోజును పూర్తిగా బ్యాటింగ్ కోసం ఉపయోగించుకునేందుకు ఆసక్తి చూపించలేదు. అనంతరం బంగ్లాదేశ్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న భారత్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 21 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 91 పరుగులు చేసింది. ప్రియాంక్ పాంచల్ (62 బంతుల్లో 40 బ్యాటింగ్; 6 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (35 బంతుల్లో 29 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ‘ఎ’ మరో 133 పరుగులు వెనుకబడి ఉంది. మొత్తంగా బంగ్లా ఆశించిన విధంగా మ్యాచ్ ప్రాక్టీస్ మాత్రం ఆ జట్టుకు దక్కలేదు. ఏ దశలోనూ జట్టు జోరు కనబర్చలేదు. నంబర్‌వన్ ఆటగాడు షకీబ్ ఈ మ్యాచ్ ఆడకుండా విశ్రాంతి తీసుకున్నాడు. ఆకట్టుకున్న పేసర్లు... టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. చక్కటి బౌన్స్ ఉన్న పిచ్‌పై భారత్ ‘ఎ’ లెఫ్టార్మ్ పేస్ బౌలర్లు అనికేత్, సీవీ మిలింద్ మంచి ప్రభావం చూపించారు. వీరిని ఎదుర్కోవడంలో బంగ్లా ఓపెనర్లు ఇబ్బంది పడ్డారు. తన మూడో ఓవర్లో ఇమ్రుల్ కైస్ (4)ను అవుట్ చేసి హైదరాబాద్ బౌలర్ మిలింద్ భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత అనికేత్ చక్కటి బంతికి తమీమ్ (13) బౌల్డయ్యాడు. మరో ప్రధాన బ్యాట్స్‌మన్ మోమినుల్ (5) కూడా విఫలం కావడంతో బంగ్లా ఇబ్బందుల్లో పడింది. మరో ఎండ్‌లో మాత్రం సౌమ్య సర్కార్ ధాటిగా ఆడాడు. కవర్స్, మిడాన్ దిశగా కొన్ని చూడచక్కటి బౌండరీలు కొట్టిన సర్కార్ 55 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొద్దిసేపటికే నదీమ్ బౌలింగ్‌లో అతను అవుట్ కాగా, మహ్ముదుల్లా (23) ఫర్వాలేదనిపించాడు. కివీస్‌తో జరిగిన గత టెస్టులో గాయపడి కోలుకున్న తర్వాత తొలిసారి మైదానంలోకి దిగిన కెప్టెన్ ముష్ఫికర్ కూడా నిలకడ ప్రదర్శించాడు. షబ్బీర్ (33)తో కలిసి అతను ఆరో వికెట్‌కు 71 పరుగులు జోడించాడు. జయంత్ బౌలిం గ్లో భారీ సిక్సర్ బాదిన ముష్ఫికర్ 91 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. ఇన్నింగ్స్ 61వ ఓవర్లోనే బంతి ఆకారం దెబ్బ తింది. దాంతో అంపైర్లు బంతిని మార్చారు. వెంటనే వరుస బంతుల్లో ముష్ఫి కర్, హసన్ (0)లను అనికేత్ అవుట్ చేశాడు. మరో 6 ఓవర్ల తర్వాత బంగ్లా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రాణించిన పాంచల్... ఇన్నింగ్స్ తొలి బంతికే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అభినవ్ ముకుంద్ (16) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. అయితే రంజీ ట్రోఫీ ఫామ్‌ను కొనసాగిస్తూ పాంచల్ చక్కటి షాట్లు ఆడాడు. మరో ఎండ్‌లో శ్రేయస్ అయ్యర్ కూడా ధాటిని ప్రదర్శించాడు. బంగ్లా బౌలింగ్‌లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.