ఎన్ని రోజుల్లో ముగిస్తారో! | india play the only test from today Bangladesh | Sakshi
Sakshi News home page

ఎన్ని రోజుల్లో ముగిస్తారో!

Published Wed, Feb 8 2017 11:57 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM

ఎన్ని రోజుల్లో  ముగిస్తారో!

ఎన్ని రోజుల్లో ముగిస్తారో!

మరో టెస్టు విజయంపై భారత్‌ గురి
బలహీన ప్రత్యర్థితో పోరుకు సిద్ధం
నేటి నుంచి బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు
►  జోరు మీదున్న టీమిండియా

ఒక జట్టేమో తిరుగులేని ప్రదర్శనతో అగ్రస్థానంలో కొనసాగుతూ టెస్టు క్రికెట్‌పై ఆధిపత్యం చలాయిస్తోంది. మరో జట్టేమో 97 టెస్టులు ఆడినా... పెద్ద జట్లపై గెలిచినవి మాత్రం మూడంటే మూడే. ఒక జట్టులో ఆటగాళ్లేమో బ్యాట్‌ పడితే రికార్డు లు, బంతి చేతుల్లోకి తీసుకుంటే రికార్డులు బద్దలు. మరో జట్టేమో ఐదు రోజుల ఆటలో మూడు రోజులు పోటీ ఇవ్వగలిగినా చాలనే ధోరణితో ఇంకా ఓనమాలు దశలోనే ఉంది. ఇప్పుడు ఈ రెండు టీమ్‌ల మధ్య పోరు చూస్తే ఒకరికి చెలగాటం, మరొకరికి ప్రాణ సంకటం అనేలా పరిస్థితి ఉంది. మరి చివరకు ఫలితం ఎలా రాబోతోంది.

దశాబ్దాలుగా అంతర్జాతీయ క్రికెట్‌ పరిపాలనను శాసించిన భారత్‌ వేర్వేరు కారణాలతో ఇన్నేళ్లుగా బంగ్లాదేశ్‌ జట్టుకు ఆతిథ్యం ఇవ్వలేదు. ఏది ఏమైనా ఇప్పుడు ఎట్టకేలకు హైదరాబాద్‌ వేదికగా ఈ చరిత్రాత్మక టెస్టుకు రంగం సిద్ధమైంది. నంబర్‌వన్‌ జట్టుగానే కాకుండా ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన ప్రకారం చూసినా ఇటీవలి తమ రికార్డును కొనసాగించాల్సిన స్థితిలో కోహ్లి సేన ఈ టెస్టు కోసం సిద్ధం కాగా... తమకు ఇక్కడ టెస్టు ఆడే అవకాశం ఇవ్వడంలో పొరపాటేమీ లేదని నిరూపించుకోవాల్సిన ఒత్తిడి కూడా బంగ్లాదేశ్‌పై ఉంది. బలాబలాల పరంగా మన జట్టు ఎంతో ముందంజలో కనిపిస్తున్నా, మ్యాచ్‌ పూర్తిగా ఏకపక్షం మాత్రం కాకపోవచ్చు.

హైదరాబాద్‌: భారత్, బంగ్లాదేశ్‌ చారిత్రక  టెస్టు మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నేటి (గురువారం) నుంచి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ ఏకైక టెస్టు మ్యాచ్‌ జరుగుతుంది. సొంతగడ్డపై ఈ సీజన్‌లో ఆడిన 8 టెస్టులలో 7 గెలిచి భారత్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, స్వదేశంలో ఇంగ్లండ్‌పై టెస్టు నెగ్గి... న్యూజిలాండ్‌లో ఘోరంగా ఓడిన తర్వాత బంగ్లాదేశ్‌ ఇక్కడ అడుగు పెట్టింది. ఇరు జట్ల మధ్య గతంలో 8 టెస్టులు జరగ్గా, భారత్‌ 6 గెలిచింది, మరో 2 ‘డ్రా’గా ముగిశాయి.

తిరుగులేని లైనప్‌...
వరుసగా టెస్టు సిరీస్‌లను అలవోకగా గెలుస్తూ వచ్చిన భారత్‌కు ఈ టెస్టులో కూడా పెద్దగా పోటీ ఎదురు కాకపోవచ్చు. అయితే ఇక్కడి పరిస్థితులు బంగ్లాదేశ్‌కు కూడా కాస్త అనుకూలమైనవి కావడంతో జాగ్రత్త పడక తప్పదు. ఇదే విషయాన్ని కోహ్లి కూడా హెచ్చరించాడు. జట్టులో ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అంతా చక్కటి ఫామ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌తో చివరి టెస్టు ఆడిన భారత జట్టులో కొన్ని మార్పులకు అవకాశం ఉంది. కరుణ్‌ నాయర్‌ ఆ మ్యాచ్‌లో చెలరేగి ‘ట్రిపుల్‌ సెంచరీ’ సాధించినా... తుది జట్టులో అతను ఉండేది అనుమానమే. రహానేకు మద్దతుగా కోచ్‌ కుంబ్లే, కెప్టెన్‌ కోహ్లి చెప్పిన మాటలు దీనిని నిర్ధారిస్తున్నాయి. బ్యాటింగ్‌ కాంబినేషన్‌ విషయంలో పెద్దగా సందేహాలు ఏమీ లేవు. అయితే వీరిద్దరిని కూడా ఆడించాలనే ఆలోచన కూడా మేనేజ్‌మెంట్‌కు ఉంది. అదే జరిగితే నలుగురు బౌలర్లతోనే బరిలోకి దిగాల్సి ఉంటుంది. పేసర్లుగా ఉమేశ్‌ యాదవ్, ఇషాంత్‌ శర్మ ఉండటం ఖాయం. అశ్విన్, రవీంద్ర జడేజాలకు తోడుగా మూడో స్పిన్నర్‌గా జయంత్‌ యాదవ్‌ను ఆడిస్తారా, లేక ఆరో బ్యాట్స్‌మన్‌కు చోటిస్తారా అనేది చూడాలి. న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ జట్లతో పోలిస్తే బంగ్లాదేశ్‌లో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు కాబట్టి పూర్తిగా స్పిన్‌ వికెట్‌ను భారత్‌ నమ్ముకుంటే లాభం లేదు. అది ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం కూడా ఉంది. కోహ్లి నాయకత్వంలో ఇప్పటి వరకు దూకుడుగా ఆడుతున్న టీమిండియా ఈసారి కూడా దానిని కొనసాగించాలని పట్టుదలగా ఉంది.

పోటీ ఇస్తారా?
సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ ఇటీవలే ఇంగ్లండ్‌ను ఓడించింది. మరో టెస్టులో కూడా విజయానికి చేరువగా వచ్చింది. న్యూజిలాండ్‌లో కూడా మంచి బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చినా చివరకు ఓటమి తప్పలేదు. అయితే గత కొన్నేళ్లలో బంగ్లా క్రికెట్‌ ఎంతో మెరుగైందనడంలో సందేహం లేదు. వన్డేలు, టి20లతో పోలిస్తే ఆ తరహాలో కాకపోయినా, టెస్టుల్లో కూడా మెలమెల్లగా జట్టు కుదురుకుంటోంది. టెస్టుల్లోకి అడుగు పెట్టిన 18 ఏళ్ల తర్వాత గానీ భారత గడ్డపై ఆడే అవకాశం రాని ఆ జట్టు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని భావిస్తోంది. జట్టు విజయావకాశాలు సీనియర్లు తమీమ్, షకీబ్, ముష్ఫికర్‌ రహీమ్‌లపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. జట్టు బ్యాటింగ్‌తో పోలిస్తే ఆ జట్టు తమ బౌలింగ్‌పై కూడా మంచి నమ్మకం పెట్టుకుంది. ఇద్దరు రెగ్యులర్‌ పేసర్లు తస్కీన్, రబ్బానీలు జట్టులో ఉండే అవకాశం ఉండగా... స్పిన్నర్లు మెహదీ హసన్, తైజుల్‌ కీలకం కానున్నారు. ఐదో రోజు వరకు మ్యాచ్‌ను తీసుకు పోగలమని చెబుతున్న బంగ్లా కెప్టెన్‌ మాటల్లో పోటీ ఇవ్వగలమన్న ఆత్మవిశ్వాసం ఉంది. అదే విధంగా ఆ మాత్రం ఆడగలిగినా చాలనే భయం కూడా కనిపిస్తోంది.  

తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), విజయ్, రాహుల్, పుజారా, రహానే, నాయర్‌/జయంత్, సాహా, అశ్విన్, జడేజా, ఇషాంత్, ఉమేశ్‌.
బంగ్లాదేశ్‌: ముష్ఫికర్‌ రహీమ్‌ (కెప్టెన్‌), తమీమ్, సర్కార్, మోమినుల్, మహ్ముదుల్లా, షకీబ్, షబ్బీర్, హసన్, తైజుల్, తస్కీన్, కమ్రుల్‌.

పిచ్, వాతావరణం
భారత్‌లో సాధారణంగా కనిపించే ఇతర పిచ్‌లలాగే ఉప్పల్‌లోనూ పచ్చిక లేకుండా కాస్త పొడిగా కూడా పిచ్‌ కనిపిస్తోంది. ఆరంభంలో బ్యాటింగ్‌కు అనుకూలించి ఆ తర్వాత స్పిన్‌ తిరగడం ఖాయం. మైదానంలో గత మూడు టెస్టుల రికార్డు కూడా ఇదే చెబుతోంది. నగరంలో చాలా రోజులుగా సాధారణ వాతావరణమే ఉంది.  మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశం కూడా ఏమాత్రం లేదు.

ఇటీవలి మా విజయాల్లో పేసర్లు, స్పిన్నర్లు సమాన పాత్ర పోషించారు. బౌలర్లు 20 వికెట్లు తీస్తేనే టెస్టుల్లో విజయాలు సాధ్యం. అందుకే బౌలర్లపై మనం నమ్మకం ఉంచాలి. ఎలాంటి సమయంలోనైనా ఆటగాళ్లకు మద్దతుగా నిలిస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. నాయర్‌ ట్రిపుల్‌ సెంచరీ చేయడం మంచి విషయమే అయినా నా అభిప్రాయం ప్రకారం మరో ఆటగాడి ఒక్క ఇన్నింగ్స్‌ వల్ల రహానే రెండేళ్ల శ్రమను మరచిపోవద్దు. అతను దాదాపు 50 సగటుతో పరుగులు చేశాడు. కాబట్టి గాయం నుంచి తిరిగొచ్చాక అవకాశం ఇవ్వడమే న్యాయం. ప్రత్యర్థి గురించి, వారి ప్రణాళికల గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఇటీవల బంగ్లాదేశ్‌ మెరుగైనా, వారు మరిన్ని టెస్టులు ఆడితే మంచిదని నా సూచన. – విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్‌

టెస్టు క్రికెట్‌ అంటే ఒకరో, ఇద్దరో రాణిస్తే గెలిచేది కాదు. న్యూజిలాండ్‌లో మాకు అదే అనుభవం ఎదురైంది. సమష్టిగా ఆడి మ్యాచ్‌లో పోటీ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాం. మాలో చాలా మంది భారత గడ్డపై తొలిసారి ఆడుతున్నారు. వారు నేర్చుకునేందుకు ఈ టెస్టు అవకాశం కల్పిస్తోంది. భారత్‌లాంటి జట్టుపై వ్యూహాలు పన్నడం కాదు వాటిని సమర్థంగా అమలు చేయడం ముఖ్యం. వన్డేలు, టి20ల్లో మేం చూపిస్తున్న ఆటను ఇక్కడ ప్రదర్శిస్తే టెస్టులో ఏదో ఒక దశలో ఆధిపత్యం ప్రదర్శించగలమని విశ్వాసంతో ఉన్నాం.
ముష్ఫికర్‌ రహీమ్, బంగ్లాదేశ్‌ కెప్టెన్‌
ఉదయం గం. 9.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement