రెండో రోజు ఆట రద్దు
భారత్, బంగ్లాదేశ్ ఏకైక టెస్టు
ఫతుల్లా : భారీ వర్షం కారణంగా భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టులో రెండో రోజు గురువారం ఆట పూర్తిగా రద్దయ్యింది. తొలి రోజు ఒక్క సెషన్‌కే పరిమితమైన వాన రెండో రోజు మాత్రం ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో మైదానం చిత్తడిగా మారడంతో ఒక్క బంతి కూడా సాధ్యపడలేదు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే మూడు రోజులు కూడా వర్షం ప్రభావం ఉండొచ్చని సమాచారం. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ నష్టపోకుండా 239 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (150 బ్యాటిం గ్), మురళీ విజయ్ (89 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
టెస్టు మ్యాచ్ జూన్‌లోనా!
ఇక ఆసక్తికర విషయమేమిటంటే... ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌లో 50 టెస్టులు జరిగితే ఒక్కటి కూడా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో జరగలేదు. ఎందుకంటే ఈ సీజన్‌లో బంగ్లాలో భారీగా వర్షాలు కురుస్తాయి. ప్రతిసారి దీన్ని దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ ఖరారు చేసే బంగ్లా బోర్డు... భారత్‌తో మ్యాచ్‌ను జూన్‌లోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు భారత్.. బంగ్లాలో ఏడు టెస్టులు ఆడింది. అవన్నీ కూడా నవంబర్ (2000), డిసెంబర్ (2004-05), మే (2007), జనవరి (2010)లలో జరిగాయి. మరోవైపు సిరీస్‌కు వర్షం ముప్పు ఉంటుందని ప్రారంభానికి ముందే బంగ్లా వన్డే కెప్టెన్ మొర్తజా అంచనా వేశాడు.