90 ఓవర్లు... 8 వికెట్లు...
► రెండో టెస్టులో భారత విజయ సమీకరణం
► ఇంగ్లండ్ లక్ష్యం 405 ప్రస్తుతం 87/2
టెస్టు క్రికెట్‌లో ఉండే నాటకీయతను, మజాను విశాఖ క్రికెట్ అభిమానులు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఉదయం సెషన్‌లో ఏడు వికెట్లు... తర్వాత రెండు సెషన్ల పాటు ఇంగ్లండ్ ఓపెనర్ల పోరాటం... ఆట చివర్లో రెండు వికెట్లతో భారత్‌కు పట్టు... ఇలా భారత్, ఇంగ్లండ్‌ల మధ్య రెండో టెస్టులో సెషన్ సెషన్‌కూ పరిస్థితి మారిపోరుుంది.మూడు రోజులా? నాలుగు రోజులా? అనుకున్న మ్యాచ్ అనూహ్యంగా ఐదో రోజుకు దారితీసింది. అది కూడా ఆసక్తికర సమీకరణంతో. అందుబాటులో 90 ఓవర్లు...భారత్ గెలవాలంటే 8 వికెట్లు తీయాలి... ఇంగ్లండ్‌కు 318 పరుగులు కావాలి. మిగిలిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ అసాధారణంగా పోరాడితే తప్ప... భారత్‌కే ఈ టెస్టులో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వైజాగ్ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి
భారత్‌లో పిచ్‌లపై ఆఖరి రోజు కూడా బాగా ఆడగల ఒకే ఒక్క విదేశీ జట్టు ఇంగ్లండ్. గతంలో అనేక సందర్భాల్లో ఇది రుజువయింది. తాజాగా మరోసారి ఇంగ్లండ్ అదే ప్రయత్నంతో అద్భుతంగా పోరాడుతోంది. కుక్ గోడలా నిలబడి రెండు సెషన్ల పాటు భారత బౌలర్లను విసిగించినా.... ఆఖరి అరగంటలో భారత్... ఇంగ్లండ్ ఓపెనర్లను అవుట్ చేసి రెండో టెస్టుపై పట్టు తెచ్చుకుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ... ఆదివారం నాలుగో రోజు 405 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్... ఆట ముగిసే సమయానికి 59.2 ఓవర్లలో 2 వికెట్లకు 87 పరుగులు చేసింది. కుక్ (188 బంతుల్లో 54; 4 ఫోర్లు) 221 నిమిషాల పాటు పోరాడి అర్ధ సెంచరీ చేయగా... మరో ఓపెనర్ హమీద్ (144 బంతుల్లో 25; 3 ఫోర్లు) 188 నిమిషాల పాటు పోరాడాడు. రూట్ (23 బంతుల్లో 5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్ లో 63.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటయింది. కోహ్లి (109 బంతుల్లో 81; 8 ఫోర్లు) ఓవర్‌నైట్ పరుగులకు మరో 25 జోడించాడు. రహానే (26) కోహ్లి కలిసి నాలుగో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. భారత్ 162 పరుగులకు 9 వికెట్లు కోల్పోయన దశలో జయంత్ యాదవ్ (59 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు), షమీ (22 బంతుల్లో 19;1 ఫోర్, 2 సిక్సర్లు) కలిసి ఆఖరి వికెట్‌కు 42 పరుగులు జోడించి భారత్ స్కోరును 200 దాటించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, రషీద్ నాలుగేసి వికెట్లు తీసుకున్నారు. తొలి ఇన్నింగ్‌స ఆధిక్యం 200 కలుపుకుని ఇంగ్లండ్‌కు భారత్ 405 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
సెషన్ 1: భారత్ వికెట్ల పతనం
ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ కోహ్లి నిలకడగా ఆడినా రహానే త్వరగా అవుటయ్యాడు. అశ్విన్, సాహా కూడా తొందరగానే వెనుదిరిగారు. రషీద్ బౌలింగ్‌లో కోహ్లి షాట్ ఆడగా... స్లిప్స్‌లో ఉన్న స్టోక్స్ డైవ్ చేసి కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. మరికొద్ది సేపటికే జడేజా భారీ షాట్ ఆడబోయి అవుటయ్యాడు. రషీద్ వేసిన తర్వాతి ఓవర్లో ఉమేశ్ కూడా వెనుదిరిగాడు. జయంత్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే మొయిన్ అలీ బౌలింగ్‌లో షమీ స్టంపౌట్ కావడంతో భారత ఇన్నింగ్స్ కు తెరపడింది. ఓవర్లు: 29.1 పరుగులు: 106 వికెట్లు: 7
సెషన్ 2: ఓపెనర్ల సహనం
లక్ష్యం పెద్దది కాబట్టి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకోవాలి. అంటే కనీసం ఐదు సెషన్లు ఆడాలి. ఇదే లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఓపెనర్లు సహనంతో ఎలా ఆడాలో చూపించారు. హమీద్ తొలి పరుగు చేయడానికి 11 బంతులు తీసుకున్నాడు. కోహ్లి తన బౌలింగ్ వనరులన్నీ ఉపయోగించి, ఎండ్‌లు మార్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా కుక్, హమీద్ అద్భుతంగా డిఫెన్‌స ఆడారు. ఈ మొత్తం సెషన్‌లో కేవలం మూడు బౌండరీలు మాత్రమే రావడం గమనార్హం. ఓవర్లు: 28 పరుగులు: 40 వికెట్లు: 0
సెషన్ 3: అదే తీరు
మూడో సెషన్‌లోనూ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇన్నిగ్స్ 46వ ఓవర్లో జడేజా బౌలింగ్‌లో, తర్వాతి ఓవర్లో అశ్విన్ బౌలింగ్‌లో కుక్ కోసం భారత్ రివ్యూ అడిగినా అదే ఫలితం వచ్చింది. దీంతో భారత్ రెండు రివ్యూలు వృథా అయ్యాయి. అయితే తన తర్వాతి ఓవర్లో అశ్విన్... హమీద్‌ను ఎల్బీగా అవుట్ చేసి భారత్‌కు బ్రేక్ ఇ చ్చాడు. కుక్... రోజులో ఆఖరి ఓవర్లో జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా అవుటయ్యాడు. దీంతో కోహ్లి సేన ఊరట చెందింది. ఓవర్లు: 31.2 పరుగులు: 47 వికెట్లు: 2