ఢాకా వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో బంగ్లాదేశ్ సూపర్ విక్టరీ సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్.. ప్రస్తుత పర్యటనలో ఐర్లాండ్‌ను మూడు ఫార్మాట్లలో మట్టికరిపించి, సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలో జగజ్జేత ఇంగ్లండ్‌ను సైతం ఓ ఆట ఆడుకున్న (3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్) బంగ్లా టైగర్స్.. తాజాగా పసికూన ఐర్లాండ్‌పై అదే స్థాయిలో రెచ్చిపోయారు. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న ఆ జట్టు.. టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో, టెస్ట్ సిరీస్‌ను 1-0 తేడాతో గెలుచుకుంది.
మ్యాచ్ విషయానికొస్తే.. నాలుగు రోజుల్లో ముగిసిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ అద్భుతంగా పోరాడినప్పటికీ, ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. 286/8 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఐర్లాండ్.. మరో 6 పరుగులు మాత్రమే జోడించి మిగతా 2 వికెట్లు కోల్పోయింది.
బంగ్లా ముందు ఫైటింగ్ టార్గెట్ ఉంచుతుందని భావించిన ఐర్లాండ్ ఆఖరి 2 వికెట్లు వెంటవెంటనే కోల్పోయి ఓటమిని అప్పుడే పరోక్షంగా అంగీకరించింది. 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 3 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో శతక్కొట్టిన (126) ముష్ఫికర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ (51 నాటౌట్) అర్ధసెంచరీ సాధించి, తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.
మొమినుల్ హాక్ 20 పరుగులతో అజేయంగా నిలువగా.. తమీమ్ ఇక్బాల్ (31), లిటన్ దాస్ (23) జట్టు విజయంలో తలో చేయి వేశారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ వికెట్‌కీపర్ టకెర్ (108) సెంచరీ పోరాటం వృధా అయ్యింది.
స్కోర్ వివరాలు..
ఐర్లాండ్: 214 & 292
బంగ్లాదేశ్: 369 & 138/3
Comments
Please login to add a commentAdd a comment