బంగ్లాదేశ్ సాధన షురూ
ప్రాక్టీస్‌లో పాల్గొన్న ఆటగాళ్లు
హైదరాబాద్: భారత్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా బంగ్లాదేశ్ జట్టు శుక్రవారం తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో సుదీర్ఘ సమయం పాటు ఆటగాళ్లు సాధన చేశారు. కెప్టెన్ ముష్ఫికర్, తమీమ్, షకీబ్ ఎక్కువ సేపు నెట్స్‌లో శ్రమించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో స్టేడియానికి వచ్చిన క్రికెటర్లు ముందుగా సమీపంలోని మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేశారు. అనంతరం దాదాపు మూడు గంటల పాటు ప్రాక్టీస్ కొనసాగింది. టెస్టు మ్యాచ్ నిర్వహణకు అవకాశం ఉన్న రెండు పిచ్‌లను బంగ్లాదేశ్ టీమ్ మేనేజ్‌మెంట్ పరిశీలించింది. టెస్టుకు ముందు ఆది, సోమవారాల్లో బంగ్లాదేశ్ జట్టు జింఖానా మైదానంలో భారత్ ‘ఎ’తో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది.
గత సిరీస్ ప్రభావం ఉండదు...
ప్రాక్టీస్ అనంతరం బంగ్లా ఆటగాడు మోమినుల్ హక్ మీడియాతో మాట్లాడాడు. పటిష్టమైన భారత్‌ను ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధంగా ఉన్నామని అతను చెప్పాడు. ‘భారత్ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. స్పిన్ గురించి చెప్పనవసరం లేదు. నంబర్‌వన్ టీమ్‌ను సమర్థంగా ఎదుర్కోవాలని మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. భిన్నంగా ప్రయత్నించే సాహసం చేయకుండా మూలాలకు కట్టుబడి ఆడి ఫలితం సాధిస్తాం. ఇటీవల న్యూజిలాండ్ చేతిలో సిరీస్ ఓడినా ఆ ప్రభావం ఇక్కడ ఉండదు. నాకు వ్యక్తిగత లక్ష్యాలు ఏమీ లేకపోయినా, సుదీర్ఘ సమయం క్రీజ్‌లో నిలబడాలని పట్టుదలగా ఉన్నా’ అని హక్ వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లితో సంభాషించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు అతను చెప్పాడు.
మరోవైపు బంగ్లాదేశ్ యువ ఆఫ్ స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ కూడా భారత్‌తో టెస్టు ఆడుతుండటంపై ఉద్వేగానికి లోనవుతున్నాడు. ‘పిచ్ నుంచి సహకారం లభిస్తే మా స్పిన్నర్లు కూడా మంచి ప్రభావం చూపగలరు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలమని నమ్ముతున్నా. అశ్విన్‌లాంటి ప్రపంచ స్థాయి స్పిన్నర్ బౌలింగ్‌ను దగ్గరి నుంచి పరిశీలించే అవకాశం నాకు దక్కుతోంది. ఈ అనుభవం నాకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. వీలుంటే అశ్విన్ నుంచి కొన్ని ఆఫ్ స్పిన్ కిటుకులు కూడా నేర్చుకుంటా’ అని హసన్ పేర్కొన్నాడు.