క్రీడా సంఘాలకు మంత్రిత్వశాఖ ఆదేశం
న్యూఢిల్లీ: టోక్యోలో 2020లో జరిగే ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే సత్తా ఉన్న క్రీడాకారులను గుర్తించాలంటూ క్రీడా మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా సంఘాలను ఆదేశించింది. ‘ఈ నెల 30లోగా అన్ని సంఘాలు తమ క్రీడాంశాలలో పతకాలు సాధించగల అవకాశం ఉన్నవారిని, వారి కోచ్‌లు, సహాయక సి బ్బందిని గుర్తించి జాబితాను అందజేయాలి. తద్వా రా వచ్చే నాలుగేళ్లు వారికి కావలసిన సౌకర్యాలు, ఆర్థిక సహకారం ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా వచ్చే ఒలింపిక్స్‌లో పతకాల సంఖ్య పెరుగుతుంది’ అని క్రీడా మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ఒకసారి జాబితా అందిన తర్వాత ప్రతి ఆరు నెలలకు క్రీడాకారుల ప్రదర్శనను సమీక్షిస్తారు. ఆ తర్వాత కొత్తవారిని చేర్చుకోవడం, సరైన ప్రదర్శన లేనివారిని తొలగించడం లాంటి కార్యక్రమం చేపడతారు.
ఐఓఏలో రాజీ: కొంతకాలంగా భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో ఉన్న విభేదాలన్నీ సమసిపోయారుు. అధ్యక్షుడు రామచంద్రన్, ఉపాధ్యక్షుడు నరిందర్ బాత్రా రాజీపడ్డారు. రామచంద్రన్‌పై చేసిన ఆరోపణలను బాత్రా ఉపసంహరించుకుంటారు. అలాగే హాకీ ఇండియా అధ్యక్షుడు బాత్రాపై వేసిన పది కోట్ల రూపాయల పరువు నష్టం దావాను అధ్యక్షుడు వెనక్కు తీసుకుంటారు. ఈ మేరకు ఈ ఇద్దరూ ఓ ఒప్పందంపై సంతకం చేసి, దానిని మద్రాస్ హైకోర్టుకు సమర్పించారు.