
ఇక్కడ కూర్చోవాలంటేనే చిరాకుగా ఉంది:క్రికెట్ కెప్టెన్
హోబార్ట్:కోపం, చిరాకు, అసహనం, అసంతృప్తి, మనోవేదన.. ఈ లక్షణాలన్నీ ఇప్పుడు ఆసీస్ క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్లో తారాస్థాయికి చేరాయి. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్ను 2-0 తో కోల్పోయిన అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తీవ్రమైన నైరాశ్యంలోకి వెళ్లిపోయాడు. అసలు ఇక్కడ ఎందుకు కూర్చున్నానో తెలియడం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ విశ్లేషణలో భాగంగా ఓ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్య్యూలో స్మిత్ తన అసంతృప్తిని బహిర్గతం చేశాడు.
' క్రికెట్ మ్యాచ్ను గెలవాలనే కసి మాలో లోపించింది. అది ఏ రకమైన క్రికెట్ మ్యాచ్ అయినా కావొచ్చు. మాలో పూర్తిగా నిలకడ లేదు. తొలి ఇన్నింగ్స్ లో 85కు ఆలౌట్ కావడం ఒకటైతే, ఈరోజు ఆటలో సుమారు 30 పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లను కోల్పోయాం. నిజాయితీగా చెబుతున్నా. ఇక్కడ కూర్చుని మాట్లాడాలంటేనే చాలా చిరాకుగా ఉంది. ప్రస్తుతం మా జట్టు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కొన్ని కఠినమైన సవాళ్లను ఎలా అధిగమించాలో తెలియన అయోమయ స్థితిలో మా క్రికెటర్లు ఉన్నారు.గెలుపు కోసం ఎన్ని వ్యూహాలు సిద్ధం చేసి బరిలోకి దిగినా, వాటిని ఫీల్డ్ లో సక్రమంగా అమలు చేయడం లేదు. కనీసం క్రీజ్లో కుదురుకునే ప్రయత్నం కూడా ఎవరూ చేయడం లేదు. ఏవో కొన్ని భాగస్వామ్యాలు నమోదైనా అవి సరిపోవు. మేము మెరుగైన క్రికెట్ ఆడటం లేదు' అని స్మిత్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
తమ ఓటముల్లో కోచ్ డారెన్ లీమన్ ను తప్పుపట్టాల్సిన అవసరం లేదని స్మిత్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. గత కొంతకాలంగా తమ జట్టు సాధించిన అనేక ఘన విజయాల్లో లీమన్ పాత్ర వెలకట్టలేనిదన్నాడు.