♦ త్వరలోనే జీవిత చరిత్రలో బయటపెడతా
బెంగళూరు: తాను క్రికెట్ ఆడే రోజుల్లో సహచర క్రికెటర్ల నుంచి వివక్షను ఎలా ఎదుర్కొన్నానో త్వరలోనే బయటపెడతానని భారత మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ అన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని విషయాలను పొందుపర్చిన తన జీవిత చరిత్రను కొద్ది రోజుల్లో విడుదల చేస్తానన్నారు. ‘నేను కూడా అహం బాధితుడినే. నాతో కలిసి ఆడినవాళ్లు సెలక్టర్లు అయ్యారు. 1986 నుంచి 1993 వరకు నేను దేశవాళీల్లో అద్భుతంగా ఆడాను.
ఫిట్‌నెస్ సమస్యలు, వివాదాలు లేవు. కానీ తీరా చూస్తే నాకు జట్టులో మాత్రం చోటు దక్కకపోయేది. ఎందుకలా జరిగిందో నా పుస్తకంలో వివరిస్తా’ అని కిర్మాణీ పేర్కొన్నారు. 2011 ప్రపంచకప్‌కు ముందే దీన్ని విడుదల చేయాలని భావించినా.. కొన్ని కారణాల వల్ల తీసుకురాలేకపోయానని చెప్పారు. అయితే పుస్తకం పేరును ఇప్పుడు వెల్లడించలేనని, కచ్చితంగా అందర్ని ఆకట్టుకునే విధంగా ఉంటుందన్నారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) డెరైక్టర్‌గా కొనసాగించనందుకు చాలా నిరాశ కలిగిందన్నారు. ‘ఆరేళ్లు డెరైక్టర్‌గా పని చేశా.
తర్వాత ఆ పదవి నుంచి తప్పించారు. నేనేమైనా తప్పు చేశానా? ఏ పద్ధతి ప్రకారం నన్ను తొలగించారు. కేవలం ఇగో వల్లే అది జరిగింది. అలా ఎవరు చేశారో నాకు తెలియదు. నన్ను తీసేయడానికి వాళ్ల అధికారం, డబ్బులు మాత్రమే పని చేశాయి’ అని ఈ మాజీ వికెట్ కీపర్ వ్యాఖ్యానించారు. ఐపీఎల్‌లో భారత ఆటగాళ్లను కాదని విదేశీ క్రికెటర్లను కెప్టెన్లుగా చేయడంపై కిర్మాణీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేనూ వివక్షను ఎదుర్కొన్నా: కిర్మాణీ
Published Thu, Dec 31 2015 3:03 AM | Last Updated on Sun, Sep 3 2017 2:49 PM
Advertisement