Syed Kirmani
-
'టీ20 ప్రపంచకప్ భారత జట్టులో కోహ్లి ఉండాలి.. గేమ్ ఛేంజర్‌గా మారుతాడు'
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ భారత జట్టులో విరాట్ కోహ్లి కచ్చితంగా ఉండాలని టీమిండియా మాజీ ఆటగాడు సయ్యద్ కిర్మాణీ అన్నాడు. ఈ మెగా టోర్నీలో కోహ్లి భారత్‌కు గేమ్ ఛేంజర్‌గా మారుతాడని కిర్మాణి అభిప్రాయపడ్డాడు. కాగా గత కొంత కాలంగా కోహ్లి పేలవ ఫామ్‌ను కనబరుస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలోను కోహ్లి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో విండీస్ టూర్‌కు కోహ్లికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చాడు. ఈ స్టార్ బ్యాటర్ మళ్లీ ఆసియా కప్‌కు తిరిగి భారత జట్టులోకి రానున్నాడు. కాగా కోహ్లి ప్రస్తుతం ఫ్యామిలీతో ప్యారిస్ టూర్లో బిజీగా ఉన్నాడు. "విరాట్ కోహ్లికి చాలా అనుభవం ఉంది. అతడు టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాలి. ఒక్కసారి కోహ్లి ఫామ్‌లోకి వచ్చాడంటే అతడిని ఆపడటం ఎవ్వరితరం కాదు. అనుభవం, అద్భుతమైన స్కిల్స్ ఉన్న కోహ్లి వంటి ఆటగాడు జట్టులో ఉండడం తప్పనిసరి. ఇక భారత జట్టులో చోటు కోసం ఆటగాళ్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. కోహ్లి లాంటి గడ్డు పరిస్థితిని వేరోక ఆటగాడు ఎదుర్కొని ఉంటే.. ఇప్పటికే జట్టు నుంచి తప్పించేవాళ్లు. కోహ్లి అద్భుతమైన ఆటగాడు కాబట్టి అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి" అని దైనిక్ జాగరణ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిర్మాణి పేర్కొన్నాడు. చదవండి: Ben Stokes ODI Retirement: వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తే.. టీ20ల నుంచి కూడా తప్పించారు! ఆ మాట అన్నందుకే ఇలా! -
‘భారత క్రికెట్ జట్టు అత్యుత్తమమైనది’
సాక్షి, విజయవాడ : భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు, 1983 ప్రపంచకప్ విజేత జట్టులోని వికెట్‌కీపర్ సయ్యద్ కిర్మాణి గన్నవరంలో సందడి చేశారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో జరగనున్న మొహరం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన బెంగళూరు నుంచి స్పైస్‌జెట్ విమానంలో మధ్యాహ్నం ఎయిర్‌పోర్టుకు విచ్చేశారు. ఆయనకు ముస్లిం మతగురువు మౌలానా గులాం మసూద్, అభిమానులు ఎం.అబ్బాస్, పాగోలు సురేష్, మహదీ అబ్బాస్, ఎస్కే అజాద్, శంకర్, హసనస్కరీ, ఎస్కే అజాద్, బాఖర్ అబ్బాస్, నాగరాజు తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం గన్నవరంలోని డాక్యుమెంట్ రైటర్ అబ్బాస్ కార్యాలయానికి వచ్చిన ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. భారత క్రికెట్ జట్టులో 15 ఏళ్ల పాటు వికెట్‌కీపర్‌గా కొనసాగిన తాను 88 టెస్టులు, 49 వన్డే మ్యాచ్‌లు ఆడినట్లు తెలిపారు. 1983లో కపిల్‌దేవ్ సారధ్యంలో వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకోవడంలో తాను కీలకపాత్ర పోషించడం జీవితంలో మరిచిపోలేని విషయంగా పేర్కొన్నారు. అంతేకాకుండా తన ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, అర్జున అవార్డులు సత్కారించిందన్నారు. ప్రస్తుతం విరాట్‌కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు అని అన్నారు. జట్టులో సమర్ధులైన, పట్టుదల, దేశభక్తి కలిగిన క్రీడాకారులు ఉన్నారని కితాబిచ్చారు. -
‘గ్లోవ్స్ ధరించిన ప్రతీ ఒక్కరూ కీపర్ కాలేరు’
న్యూఢిల్లీ: వెస్టిండీస్ పర్యటనలో వరుసగా విఫలమవుతున్న భారత యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఒకే తరహా షాట్లు ఆడి వికెట్‌ను సమర్పించుకుంటున్న పంత్‌ను ఇప్పటికే పలువురు విమర్శించగా, తాజాగా భారత మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ కూడా పంత్‌ను సుతిమెత్తగా మందలించాడు. గ్లోవ్స్ ధరించిన ప్రతీ ఒక్కరూ వికెట్ కీపర్ కాలేరంటూ పరోక్షంగా చమత్కరించాడు. అదే సమయంలో వృద్ధిమాన్ సాహాను వెనుకేసుకొచ్చాడు కిర్మాణీ. ఇటీవల కాలంలో పంత్‌కు పదే పదే అవకాశాలిస్తున్న టీమిండియా మేనేజ్మెంట్.. సాహాను అస్సలు పట్టించుకోకపోవడం నిరాశ కల్గిస్తుందన్నాడు. ఒకవైపు పంత్‌ను పరీక్షిస్తూనే మరొకవైపు సాహాకు కూడా అవకాశాలు ఇవ్వాలని సూచించాడు. పంత్‌తో సమానమైన అవకాశాలను సాహాకు కూడా ఇవ్వాలన్నాడు. ‘ పంత్ టాలెంట్ ఉన్న క్రికెటరే. కానీ అతను ఇంకా చాలా నేర్చుకోవాలి. అతనికి నేర్చుకుంటూ ఎదగడానికి సమయం చాలా ఉంది. అటువంటి సందర్భంలో సాహాను నిర్లక్ష్యం చేయడం తగదు. విండీస్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో సాహాకు అవకాశం ఇవ్వకపోవడం నిరాశకు గురి చేసింది. సాహా మంచి వికెట్ కీపరే కాదు.. బ్యాట్స్‌మన్ కూడా. ఆ విషయాన్ని మరిచిపోకండి. ఒక జత కీపింగ్ గ్లోవ్స్ ధరించిన ప్రతీ ఒక్కరూ వికెట్ కీపర్ కాలేరు కదా’ అంటూ కిర్మాణీ చురకలంటించాడు. కనీసం రెండో టెస్టులోనైనా సాహాకు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాడు. దాదాపు ఏడాది పాటు గాయం కారణంగా జట్టుకు దూరమైన సాహా.. ఇటీవల వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే తొలి టెస్టులోనే సాహాకు అవకాశం దక్కుతుందని ఆశించారు. కాకపోతే విండీస్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో విఫలమైన పంత్‌నే తొలి టెస్టులో ఆడించడం విమర్శలకు దారి తీసింది. ఇక్కడ కూడా పంత్ నిరాశ పరచడం విమర్శకుల నోటికి మరింత పని చెప్పింది. -
‘పంత్.. ధోనిని కాపీ కొట్టొద్దు’
న్యూఢిల్లీ: ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా ఆ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్.. వికెట్ల వెనుక మెరుగు కావాల్సింది చాలా ఉందని భారత మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి తెలిపాడు. ప్రస్తుతం రిషబ్ కీపింగ్ టెక్నిక్ అంత మెరుగ్గా లేదన్న కిర్మాణి..ఇంకా అతను నేర్చుకునే దశలోనే ఉన్నాడన్నాడు. ఈ క్రమంలోనే ఎంఎస్ ధోని కీపింగ్ టెక్నిక్‌ను కాపీ కొట్టొద్దని సూచించాడు. వికెట్ల వెనకాల అత్యుత్తమంగా ఉండటం ఎంత అవసరమో ధోని నిరూపించాడన్నారు. యువకులు ధోనిని బ్యాటింగ్, కీపింగ్ విభాగాల్లో ఆదర్శంగా తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నాడు. కాగా, ధోని ఒక అరుదైన, ప్రత్యేకమైన వికెట్ కీపర్‌గా అభివర్ణించిన కిర్మాణి.. ఎట్టిపరిస్థితుల్లోనూ ధోనిని పంత్ అనుసరించకపోవడమే ఉత్తమం అన్నాడు. ‘వికెట్ కీపింగ్‌లో ప్రాథమిక పరిజ్ఞానం చాలా అవసరం. బ్యాటింగ్ పరంగా పంత్ బాగున్నాడు. వికెట్ కీపింగ్‌లో బంతులు అందుకునేందుకు కచ్చితమైన టెక్నిక్, చురుకుదనం, చక్కని చూపు అవసరం. కీపింగ్‌లో పంత్ చాలా మెరుగుపడాలి. స్పిన్ బౌలింగ్‌లో బౌలర్ టర్న్ తీసుకొనే వరకు పంత్ కూర్చొని ఉండాలి. బంతి పిచ్ అయి ఎటువెళ్తుందో చూసే వరకు కూర్చొని ఉండాలి. ఆ తర్వాత స్వింగ్, బౌన్స్‌కు అనుగుణంగా కదలాలి. ప్రధానంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో కీపర్ ఎప్పుడు లేస్తున్నాడన్న దానిపైనే అతడి సామర్థ్యం ఏంటో తెలుస్తుంది’ అని కిర్మాణీ అన్నాడు. అయితే పంత్ ఫీల్డర్లు విసిరిన బంతిని అందుకునేందుకు ధోనిని అనుకరించడాన్ని కిర్మాణి తప్పుబట్టాడు. ‘ఫీల్డర్లు బంతిని విసిరే సమయంలో ధోని వికెట్ల ముందు నిలబడి బంతి అందుకుంటాడు. ధోని అరుదైన వికెట్ కీపర్. అతనిలో ఒక ప్రత్యేకత ఉంది. వికెట్ల వెనకాల అత్యుత్తమంగా ఎలా ఉండాలో ధోని నిరూపించాడు. ఇప్పుడు పంత్ ఫీల్డర్లు విసిరిన బంతిని అందుకొనేందుకు ధోనిని అనుకరిస్తున్నాడు. ఎప్పుడైనా సరే వికెట్ల వెనకాల ఉండి బంతిని అందుకోవడం సరైన పద్ధతి. ఇది టెక్నిక్ కాదు. నియమం. అప్పుడే కీపర్ కంటి స్థాయి బెయిల్స్‌ను చూసేందుకు, బంతి ఎక్కడ పిచ్ అవుతుందో తెలుసుకునేందుకు సులభంగా ఉంటుంది’అని కిర్మాణి తెలిపాడు. -
‘శాస్త్రి, కోహ్లిలకు ఉన్నంత అనుభవం వారికి లేదు’
జట్టు ఎంపిక విషయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిల నిర్ణయాన్ని సవాలు చేసేంత అనుభవం సెలక్షన్ కమిటీకి లేదని మాజీ చీఫ్ సెలక్టర్ సయ్యద్ కిర్మాణీ వ్యాఖ్యానించాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా రోహిత్ శర్మ, కరుణ్ నాయర్, మురళీ విజయ్‌లకు జట్టులో చోటు కల్పించకపోవడంతో సెలక్షన్ కమిటీపై విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. జట్టు ఎంపిక విషయంలో సెలక్టర్ల నిర్ణయాన్ని తప్పు పడుతూ పలువురు సీనియర్, మాజీ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. తాజాగా ఈ విషయంపై స్పందించిన సయ్యద్ కిర్మాణీ... ‘ కోచ్‌గా రవిశాస్త్రే మెయిన్ సెలక్టర్‌గా వ్యవహరిస్తాడు. అలాగే కెప్టెన్, సీనియర్ సభ్యులతో చర్చించిన తర్వాతే సెలక్షన్ కమిటీకి తన అభిప్రాయం చెబుతాడు. అయితే ఇప్పుడున్న సెలక్షన్ కమిటీ సభ్యులకు ఆటలో శాస్త్రి, కోహ్లిలకు ఉన్నంత అనుభవం లేదు. కాబట్టి జట్టు సభ్యుల ఎంపిక విషయంలో శాస్త్రి, కోహ్లిలతో డిబేట్ చేసే అవకాశం వారికి లేదు’ అంటూ వ్యంగ్యంగా వాఖ్యానించాడు. అంతేకాకుండా జట్టులో చోటు దక్కాలంటే ప్రతిభ ఒక్కటే కొలమానం కాదని, అదృష్టం కూడా ఉండాలని అభిప్రాయపడ్డాడు. తన కెరీర్లో పీక్ టైమ్‌లో ఉన్నపుడు కూడా తనకు జట్టులో చోటు దక్కకపోవడమే ఇందుకు ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చాడు. -
‘గంగూలీ తర్వాత కోహ్లినే’
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ ఛీఫ్ సెలెక్టర్ సయ్యద్ కిర్మానీ ప్రశంసల వర్షం కురిపించారు. కోహ్లి లాంటి దూకుడు ఉన్న క్రికెటర్‌ను ఎక్కడా చూడలేదనన్నారు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తర్వాత అంతటి దూకుడును కోహ్లిలోనే చూశానని, అదే అతనికి విజయాలు తెచ్చి పెడుతుందని అభిప్రాయపడ్డాడు. ‘టీమిండియా క్రికెటర్ల బ్యాటింగ్ విధానం చూశాను. ఎవరికి వాళ్లది భిన్నమైన శైలి. కానీ జట్టు సారథి విరాట్ కోహ్లిలో మాత్రం ఆకర్షణీయమైన బ్యాటింగ్ లక్షణం ఉంది. మ్యాచ్‌ను గెలిపించాలనే తన తపన మాటల్లో చెప్పలేనిది. అంత దూకుడుగా ఉండటం తనకే సాధ్యం. మూడు ఫార్మాట్లలోనూ అసాధారణ ప్రదర్శనను కనబర్చుతున్నాడు. అన్ని రికార్డులనూ బద్దలు కొట్టగల సామర్థ్యం ఒక్క కోహ్లికి మాత్రమే సాధ్యం. నాకు తెలిసీ కోహ్లి ఎప్పుడూ రికార్డుల గురించి ఆలోచించడనుకుంటా. కానీ అతను ఏమి చేయాలో అది చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. నిజమైన నాయకత్వ లక్షణాలన్నీ కోహ్లిలో ఉన్నాయి. సౌరవ్ గంగూలీ తర్వాత అంతటి దూకుడును నేను కోహ్లిలోనే చూశాను’ అని అన్నారు. -
మాజీ క్రికెటర్ వాగ్ధానభంగం
సాక్షి, చెన్నై: నేత్రదానంపై మాజీ క్రికెటర్ సయిద్ కిర్మాణీ మనసు మార్చుకున్నారు. మతపరమైన విశ్వాసాల కారణంగా కళ్లు దానం చేసేందుకు విముఖత వ్యక్తం చేశారు. చెన్నైలో శనివారం రోటరీ రాజన్ ఐ బ్యాంక్, మద్రాస్ రోటరీ క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో కిర్మాణీ పాల్గొన్నారు. నేత్రదానం చేస్తానని ఆయన ఈ సందర్భంగా ప్రమాణం చేశారు. అయితే ఈ వాగ్దానాన్ని వెనక్కు తీసుకున్నట్టు సోమవారం ప్రకటించారు. ‘నాకు భావోద్వేగాలు, నమ్మకాలు ఎక్కువ. అవయవదానంపై డాక్టర్ మోహన్ రాజ్ చేస్తున్న చైతన్య కార్యక్రమాలు నచ్చి నేత్రదానం చేస్తానని వాగ్దానం చేశాను. మత విశ్వాసాల కారణంగా నా ప్రతిజ్ఞను నిలబెట్టుకోలేకపోతున్నాను. కానీ అందరూ కళ్లు దానం చేయాలని కోరుకుంటున్నాన’ని కిర్మాణీ పేర్కొన్నారు. భారత అంధుల క్రికెట్ జట్టుకు అనధికారిక అంబాసిడర్‌గా ఉన్న తాను ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో క్రికెటర్ల అంకితభావం ఎంతోగానో ఆకట్టుకుందని, అందుకే నేత్రదానానికి ముందుకు వచ్చానని చెప్పారు. అయితే మతవిశ్వాసాల కారణంగా మాటను నిలుపుకోలేకపోతున్నానని కిర్మాణీ వెల్లడించారు. -
అగార్కర్.. నీకంత సీన్ లేదు!
న్యూఢిల్లీ:vఇక టీ 20 ఫార్మాట్ నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వీడ్కోలు తీసుకునే సమయం ఆసన్నమైందంటూ వ్యాఖ్యానించిన అజిత్ అగార్కర్ పై మాజీ ఆటగాళ్లు మండిపడుతున్నారు. ఇప్పటికే కొంతమంది పరోక్షంగా అగార్కర్ పై విమర్శలు చేయగా, తాజాగా భారత మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. అసలు ధోనిని విమర్శించే ముందు నీ స్థాయి ఏమిటో తెలుసుకొని సలహా ఇవ్వాలంటూ కిర్మాణి ధ్వజమెత్తాడు. 'ధోని దేశానికి ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. టీమిండియాలో ధోనిలాంటి అనుభవజ్ఞుడు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకట్రెండు మ్యాచ్ ల్లో విఫలమైతే ధోని రిటైర్మెంట్ తీసుకోవాలంటూ వ్యాఖ్యానించడం ఎంతవరకూ కరెక్ట్. అసలు ధోని ముందు అగార్కర్ ఎంత. ధోనిని అగార్కర్ విమర్శించడం వెనుక కారణమేమిటో అర్ధం కావడం లేదు. ఎప్పుడు తప్పుకోవాలో ధోనికి తెలుసు. ఇకనైనా అతని గురించి మాట్లాడటం ఆపండి' అని కిర్మాణి పేర్కొన్నాడు. -
నేనూ వివక్షను ఎదుర్కొన్నా: కిర్మాణీ
♦ త్వరలోనే జీవిత చరిత్రలో బయటపెడతా బెంగళూరు: తాను క్రికెట్ ఆడే రోజుల్లో సహచర క్రికెటర్ల నుంచి వివక్షను ఎలా ఎదుర్కొన్నానో త్వరలోనే బయటపెడతానని భారత మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ అన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని విషయాలను పొందుపర్చిన తన జీవిత చరిత్రను కొద్ది రోజుల్లో విడుదల చేస్తానన్నారు. ‘నేను కూడా అహం బాధితుడినే. నాతో కలిసి ఆడినవాళ్లు సెలక్టర్లు అయ్యారు. 1986 నుంచి 1993 వరకు నేను దేశవాళీల్లో అద్భుతంగా ఆడాను. ఫిట్నెస్ సమస్యలు, వివాదాలు లేవు. కానీ తీరా చూస్తే నాకు జట్టులో మాత్రం చోటు దక్కకపోయేది. ఎందుకలా జరిగిందో నా పుస్తకంలో వివరిస్తా’ అని కిర్మాణీ పేర్కొన్నారు. 2011 ప్రపంచకప్‌కు ముందే దీన్ని విడుదల చేయాలని భావించినా.. కొన్ని కారణాల వల్ల తీసుకురాలేకపోయానని చెప్పారు. అయితే పుస్తకం పేరును ఇప్పుడు వెల్లడించలేనని, కచ్చితంగా అందర్ని ఆకట్టుకునే విధంగా ఉంటుందన్నారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) డెరైక్టర్‌గా కొనసాగించనందుకు చాలా నిరాశ కలిగిందన్నారు. ‘ఆరేళ్లు డెరైక్టర్‌గా పని చేశా. తర్వాత ఆ పదవి నుంచి తప్పించారు. నేనేమైనా తప్పు చేశానా? ఏ పద్ధతి ప్రకారం నన్ను తొలగించారు. కేవలం ఇగో వల్లే అది జరిగింది. అలా ఎవరు చేశారో నాకు తెలియదు. నన్ను తీసేయడానికి వాళ్ల అధికారం, డబ్బులు మాత్రమే పని చేశాయి’ అని ఈ మాజీ వికెట్ కీపర్ వ్యాఖ్యానించారు. ఐపీఎల్లో భారత ఆటగాళ్లను కాదని విదేశీ క్రికెటర్లను కెప్టెన్లుగా చేయడంపై కిర్మాణీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టెన్ -10 క్రికెట్ రాగం!
హైదరాబాద్:ఇప్పటికే క్రికెట్ లో ఎనో ఫార్మెట్లు చూసిన అభిమానులకు మరో సరికొత్త ఫార్మెట్ పరిచయం అయితే ఎలా ఉంటుంది?, ట్వంటీ 20 ఫార్మెట్ తరహాలోనే టెన్ -10 క్రికెట్ మనల్ని పలకరిస్తే మరింత మజా వస్తుందా? ఇదే విషయంపై టీమిండియా మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ ఆశాభావం వ్యక్తం చేశాడు. భవిష్య క్రికెట్ టెన్ -10 ఫార్మెట్ దే నంటూ తెగేసి చెప్పేశాడు. క్రికెట్ పుట్టినప్పట్నుంచి ఇప్పటివరకూ ఆ గేమ్ లో ఎన్నో మార్పులు చూశామని.. అదే క్రమంలో టెన్ 10 క్రికెట్ ను కూడా చూస్తామన్నాడు. అయితే దానికి పెద్ద సమయం కూడా అక్కర్లేదని.. అతి త్వరలోనే టెన్-10 ఫార్మెట్ తో క్రికెట్ మరింత ఆహ్లాదకరంగా మారిపోతుందని అభిప్రాయపడ్డాడు. 1975 నుంచి చూస్తే క్రికెట్ లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయన్నాడు. తొలుత వన్డేల్లో 60 ఓవర్ల నిబంధన ఉంటే.. ఆ తరువాత 50 ఓవర్లకు మారిందన్న విషయాన్ని గుర్తు చేశాడు. అలా కాలక్రమంలో ట్వంటీ 20 ఫార్మెట్ వచ్చిందని.. ఇదే దారిలో టెన్ 10 క్రికెట్ కు వస్తుందని కిర్మాణీ తెలిపాడు. ప్రస్తుతం ఉన్న మూడు ఫార్మెట్లు మరింత అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతున్న తరుణంలో.. టెన్ 10 క్రికెట్ ను కూడా మనం వీక్షించే అవకాశం తప్పకుండా దక్కుతుందన్నాడు. క్రికెట్ అనేది అత్యంత వినోదం కల్గించే క్రీడగా మారిపోవడంతో పాటు, వ్యాపార పరంగా కూడా మెరుగ్గా ఉండటమే సరికొత్త ఫార్మెట్లు రావడానికి కారణమన్నాడు. ఇలా అనేక ఫార్మెట్లతో అలరించడం క్రికెట్ కు శుభపరిణామన్నాడు.