
కిర్మాణీ (కుడి నుంచి రెండో వ్యక్తి) కి స్వాగతం పలుకుతున్న అభిమానులు
సాక్షి, విజయవాడ : భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు, 1983 ప్రపంచకప్ విజేత జట్టులోని వికెట్‌కీపర్ సయ్యద్ కిర్మాణి గన్నవరంలో సందడి చేశారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో జరగనున్న మొహరం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన బెంగళూరు నుంచి స్పైస్‌జెట్ విమానంలో మధ్యాహ్నం ఎయిర్‌పోర్టుకు విచ్చేశారు. ఆయనకు ముస్లిం మతగురువు మౌలానా గులాం మసూద్, అభిమానులు ఎం.అబ్బాస్, పాగోలు సురేష్, మహదీ అబ్బాస్, ఎస్‌కే అజాద్, శంకర్, హసనస్‌కరీ, ఎస్‌కే అజాద్, బాఖర్ అబ్బాస్, నాగరాజు తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
అనంతరం గన్నవరంలోని డాక్యుమెంట్ రైటర్ అబ్బాస్ కార్యాలయానికి వచ్చిన ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. భారత క్రికెట్ జట్టులో 15 ఏళ్ల పాటు వికెట్‌కీపర్‌గా కొనసాగిన తాను 88 టెస్టులు, 49 వన్‌డే మ్యాచ్‌లు ఆడినట్లు తెలిపారు. 1983లో కపిల్‌దేవ్ సారధ్యంలో వన్‌డే ప్రపంచ కప్‌ను గెలుచుకోవడంలో తాను కీలకపాత్ర పోషించడం జీవితంలో మరిచిపోలేని విషయంగా పేర్కొన్నారు. అంతేకాకుండా తన ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, అర్జున అవార్డులు సత్కారించిందన్నారు. ప్రస్తుతం విరాట్‌కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు అని అన్నారు. జట్టులో సమర్ధులైన, పట్టుదల, దేశభక్తి కలిగిన క్రీడాకారులు ఉన్నారని కితాబిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment