టెన్ -10 క్రికెట్ రాగం!
హైదరాబాద్:ఇప్పటికే క్రికెట్ లో ఎనో ఫార్మెట్లు చూసిన అభిమానులకు మరో సరికొత్త ఫార్మెట్ పరిచయం అయితే ఎలా ఉంటుంది?, ట్వంటీ 20 ఫార్మెట్ తరహాలోనే టెన్ -10 క్రికెట్ మనల్ని పలకరిస్తే మరింత మజా వస్తుందా? ఇదే విషయంపై టీమిండియా మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ ఆశాభావం వ్యక్తం చేశాడు. భవిష్య క్రికెట్ టెన్ -10 ఫార్మెట్ దే నంటూ తెగేసి చెప్పేశాడు. క్రికెట్ పుట్టినప్పట్నుంచి ఇప్పటివరకూ ఆ గేమ్ లో ఎన్నో మార్పులు చూశామని.. అదే క్రమంలో టెన్ 10 క్రికెట్ ను కూడా చూస్తామన్నాడు. అయితే దానికి పెద్ద సమయం కూడా అక్కర్లేదని.. అతి త్వరలోనే టెన్-10 ఫార్మెట్ తో క్రికెట్ మరింత ఆహ్లాదకరంగా మారిపోతుందని అభిప్రాయపడ్డాడు.
1975 నుంచి చూస్తే క్రికెట్ లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయన్నాడు. తొలుత వన్డేల్లో 60 ఓవర్ల నిబంధన ఉంటే.. ఆ తరువాత 50 ఓవర్లకు మారిందన్న విషయాన్ని గుర్తు చేశాడు. అలా కాలక్రమంలో ట్వంటీ 20 ఫార్మెట్ వచ్చిందని.. ఇదే దారిలో టెన్ 10 క్రికెట్ కు వస్తుందని కిర్మాణీ తెలిపాడు. ప్రస్తుతం ఉన్న మూడు ఫార్మెట్లు మరింత అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతున్న తరుణంలో.. టెన్ 10 క్రికెట్ ను కూడా మనం వీక్షించే అవకాశం తప్పకుండా దక్కుతుందన్నాడు. క్రికెట్ అనేది అత్యంత వినోదం కల్గించే క్రీడగా మారిపోవడంతో పాటు, వ్యాపార పరంగా కూడా మెరుగ్గా ఉండటమే సరికొత్త ఫార్మెట్లు రావడానికి కారణమన్నాడు. ఇలా అనేక ఫార్మెట్లతో అలరించడం క్రికెట్ కు శుభపరిణామన్నాడు.