
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ భారత జట్టులో విరాట్ కోహ్లి కచ్చితంగా ఉండాలని టీమిండియా మాజీ ఆటగాడు సయ్యద్ కిర్మాణీ అన్నాడు. ఈ మెగా టోర్నీలో కోహ్లి భారత్‌కు గేమ్ ఛేంజర్‌గా మారుతాడని కిర్మాణి అభిప్రాయపడ్డాడు. కాగా గత కొంత కాలంగా కోహ్లి పేలవ ఫామ్‌ను కనబరుస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలోను కోహ్లి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో విండీస్ టూర్‌కు కోహ్లికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చాడు. ఈ స్టార్ బ్యాటర్ మళ్లీ ఆసియా కప్‌కు తిరిగి భారత జట్టులోకి రానున్నాడు. కాగా కోహ్లి ప్రస్తుతం ఫ్యామిలీతో ప్యారిస్ టూర్‌లో బిజీగా ఉన్నాడు.
"విరాట్ కోహ్లికి చాలా అనుభవం ఉంది. అతడు టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాలి. ఒక్కసారి కోహ్లి ఫామ్‌లోకి వచ్చాడంటే అతడిని ఆపడటం ఎవ్వరితరం కాదు. అనుభవం, అద్భుతమైన స్కిల్స్ ఉన్న కోహ్లి వంటి ఆటగాడు జట్టులో ఉండడం తప్పనిసరి. ఇక భారత జట్టులో చోటు కోసం ఆటగాళ్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. కోహ్లి లాంటి గడ్డు పరిస్థితిని వేరోక ఆటగాడు ఎదుర్కొని ఉంటే.. ఇప్పటికే జట్టు నుంచి తప్పించేవాళ్లు. కోహ్లి అద్భుతమైన ఆటగాడు కాబట్టి అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి" అని దైనిక్ జాగరణ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిర్మాణి పేర్కొన్నాడు.
చదవండి: Ben Stokes ODI Retirement: వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తే.. టీ20ల నుంచి కూడా తప్పించారు! ఆ మాట అన్నందుకే ఇలా!