మిథాలీ రాజ్‌కే పగ్గాలు
♦ ఆస్ట్రేలియాలో పర్యటనకు
♦ భారత మహిళల జట్టు ఎంపిక
♦ ఆంధ్ర అమ్మాయి కల్పనకు చోటు
న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్ ఈనెలలో ఆస్ట్రేలియాలో పర్యటించే భారత మహిళల వన్డే, టి20 జట్లకు నాయకత్వం వహించనుంది. ఈనెల 26న మొదలయ్యే ఈ సిరీస్ వచ్చే నెల ఏడో తేదీతో ముగుస్తుంది. ఈ సిరీస్‌లో భారత్ మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడుతుంది. 15 మంది సభ్యుల బృందానికి పేస్ బౌలర్ జులన్ గోస్వామి వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది.
వన్డే జట్టులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, వికెట్ కీపర్ రావి కల్పనకు స్థానం లభించింది. టి20 జట్టులో కల్పన, పూనమ్ రౌత్, స్నేహ రాణే స్థానాల్లో వనిత, అనూజా పాటిల్, దీప్తి శర్మలను ఎంపిక చేశారు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జనవరి 26న (అడిలైడ్), రెండో టి20 మ్యాచ్ జనవరి 29న (మెల్‌బోర్న్), మూడో టి20 మ్యాచ్ జనవరి 31న (సిడ్నీ) జరుగుతాయి. ఫిబ్రవరి 2న తొలి వన్డే (కాన్‌బెర్రా), 5న రెండో వన్డే, 7న మూడో వన్డే (హోబర్ట్) జరుగుతాయి. చివరిసారి భారత మహిళల జట్టు 2008లో ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఐదు వన్డేల సిరీస్‌ను 0-5తో ఓడిపోయింది.
భారత మహిళల వన్డే జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), జులన్ గోస్వామి (వైస్ కెప్టెన్), స్మృతి మంధన, తిరుష్ కామిని, హర్మన్‌ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి, శిఖా పాండే, నిరంజన, సుష్మా వర్మ, రావి కల్పన, ఏక్తా బిష్త్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ రౌత్, పూనమ్ యాదవ్, స్నేహ రాణే.