'క్రిస్ గేల్‌ను ప్రపంచవ్యాప్తంగా నిషేధించండి'
బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్ సందర్భంగా టీవీ జర్నలిస్టు మెల్ మెక్‌లాలిన్‌తో అసభ్యంగా మాట్లాడిన వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్‌పై ప్రపంచవ్యాప్తంగా నిషేధం విధించాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఒక ప్రతిపాదన చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియాను కోరాడు. గేల్ ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని, దానిపై సహనంతో ఉండాల్సిన అవసరం లేదని చాపెల్ అన్నాడు. ఆస్ట్రేలియాలోని ఏ క్లబ్బూ అతడితో ఇక కాంట్రాక్టు కుదుర్చుకోకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయిస్తే తనకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని, అలాగే ఐసీసీకి ఈ మేరకు లేఖ రాసినా పర్వాలేదని తెలిపాడు. లేని పక్షంలో విడివిడిగా అన్ని దేశాలకు ఈ విషయం చెప్పాలని కోరాడు.
గేల్‌కు ఇప్పటికే రూ. 6.66 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే. బీబీఎల్ తదుపరి సీజన్‌లో తాను ఆడే అవకాశం ఉండొచ్చని గేల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. మెక్‌లాలిన్‌తో తాను కేవలం జోక్ చేశాను తప్ప అంతకంటే ఏమీ అనలేదంటూ క్షమాపణలు చెప్పాడు. అయితే.. క్రిస్‌గేల్ తరచు ఇలా చేస్తూనే ఉంటాడని, అందువల్ల అతడిపై ప్రపంచవ్యాప్త నిషేధం విధిస్తే అది యువ క్రికెటర్లకు గట్టి సందేశం పంపినట్లు అవుతుందని చాపెల్ అన్నాడు. కేవలం రూ. 6 లక్షల జరిమానాతో సరిపెడితే సరిపోదని అభిప్రాయపడ్డాడు. గేల్ గురించి తాను ఏ మహిళతో మాట్లాడినా ఒకేలాంటి సమాధానం వచ్చిందని, అందరూ అతడిపై నిషేధం విధించాలనే అడిగారని చెప్పాడు.