
'మీకు ఆడటం రాకపోతే ఇంట్లో కూర్చోండి'
సిడ్నీ: ఇటీవల ఆసీస్ జరిగిన మూడు టెస్టుల సిరీస్లో వైట్వాష్ అయిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు ఇయాన్ చాపెల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఆసీస్ పర్యటనలో ఉన్న పాకిస్తాన్ జట్టుకు ఆడటం రాకపోతే ఇంట్లోనే కూర్చుంటే మంచిదని ధ్వజమెత్తాడు.
'ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ ఇప్పటివరకూ నాలుగుసార్లు వైట్వాష్ అయ్యింది. మూడేసి మ్యాచ్లను సిరీస్లను నాలుగుసార్లు కో్ల్పోయింది. మీరు గేమ్ను మెరుగుపరుచుకోలేకపోతే, పర్యటనల్ని పక్కన పెట్టి ఇంట్లోనే కూర్చోండి. ఎప్పుడూ చెత్త ప్రదర్శన చేసేటప్పుడు పర్యటనలకు ఎందుకు. తాజా ఆసీస్ సిరీస్ లో వారి బ్యాటింగ్ తో పాటు , ఫీల్డింగ్ కూడా చాలా పేలవంగా ఉంది. ఆస్ట్రేలియాలో ఆ జట్టు సరైన క్రికెట్ ఆడటంలో ఎప్పుడూ విఫలమవుతూనే ఉంది. ప్రస్తుత పాకిస్తాన్ జట్టులో సరైన నాయకుడు లేడు. ఆ జట్టు మిస్బా నుంచి ఏ రకమైన స్ఫూర్తిని పొందినట్లు కనబడటం లేదు. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో మార్పులు అనివార్యం' అని చాపెల్ విమర్శించాడు. దాంతో పాటు ఆసీస్ జట్టుకు చాపెల్ సలహా ఇచ్చేశాడు. కనీసం పోరాడని పాకిస్తాన్ క్రికెట్ జట్టును పర్యటనలకు పిలవడం ఆపితే మంచిదంటూ చాపెల్ అభిప్రాయపడ్డాడు.