
ఆఖరి బంతికి నెగ్గిన దక్షిణాఫ్రికా
గెలిపించిన మోరిస్ ఠ 3 వికెట్లతో ఓడిన ఇంగ్లండ్
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా లక్ష్యం 135 పరుగులు... ఓ దశలో జట్టు స్కోరు 19 ఓవర్లలో 120/7.. ఇక గెలవాలంటే ఆరు బంతుల్లో 15 పరుగులు చేయాలి. ఈ దశలో టోప్లే బౌలింగ్‌లో తొలి ఐదు బంతుల్లో మోరిస్ 13 పరుగులు రాబట్టాడు. ఇక మిగిలింది ఒక బంతి... రెండు పరుగులు... ఈ సమయంలో ఆఖరి బంతిని లాంగాఫ్‌లోకి కొట్టిన మోరిస్ రెండో రన్ కోసం ప్రయత్నించాడు. అయితే ఫీల్డర్ వెంటనే స్పందించి బంతిని బౌలర్ వైపు విసిరినా.. టోప్లే దాన్ని అందుకోలేకపోయాడు. దీంతో రనౌట్ మిస్సయింది. మ్యాచ్ సఫారీల సొంతమైంది. ఫలితంగా శుక్రవారం అర్ధరాత్రి జరిగిన తొలి టి20లో ప్రొటీస్ 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది.
దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో సఫారీలు 1-0 ఆధిక్యంలో నిలిచారు. న్యూలాండ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 134 పరుగులు చేసింది. బట్లర్ (30 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు), హేల్స్ (27) రాణించారు. తాహిర్ 4, అబాట్ 2 వికెట్లు తీశారు. తర్వాత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 135 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (25), డుమిని (23), ఆమ్లా (22), రోసోవ్ (18) తలా కొన్ని పరుగులు చేశారు. జోర్డాన్ 3, మొయిన్ అలీ 2 వికెట్లు పడగొట్టారు. తాహిర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 జొహన్నెస్‌బర్గ్‌లో నేడు (ఆదివారం) జరగనుంది.