‘నిక్ నేమ్’లోనేముంది!
ఢాకా: బిజోయ్, శుభో, మిటు, మొయినా, బాతుల్, పేట్లా, మాష్, కౌశిక్, లల్లా, శిప్లు, షౌరోభ్...ఈ జాబితా ఏమిటి అనుకుంటున్నారా. వీరంతా బంగ్లాదేశ్ టి20 క్రికెట్ జట్టు సభ్యులు. అదేంటీ పేర్లన్నీ కొత్తగా, ఇంకా చెప్పాలంటే వింతగా ఉన్నాయంటారా! అవును... ఇవన్నీ బంగ్లా క్రికెటర్ల ముద్దు పేర్లు! ఆ దేశ జాతీయ జట్టులో దాదాపు ప్రతీ ఆటగాడికి ఏదో ఒక నిక్‌నేమ్ ఉంది.
కొందరికి ఆట వల్లో, శరీరాన్ని బట్టో పేర్లు పెడితే, మరి కొందరికి ఎందుకు అది పెట్టారో తెలీకుండానే వారి నిక్‌నేమ్ స్థిర పడిపోయింది. మైదానంలో ఆట సాగినంత సేపు వారు ఆ పేర్లతోనే సహచరులను పిలుచుకుంటారు. ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు మొయినా అని ముద్దు పేరు. ఇది మైనా పక్షిని దృష్టిలో ఉంచుకొని పెట్టిన పేరు. బంగ్లా జాతీయ అకాడమీలో షకీబ్ చురుకుదనం చూసి సీనియర్ నయీమ్ ఈ పేరు ఇచ్చాడు. ‘మా జట్టులో దాదాపు అందరికీ నిక్‌నేమ్‌లు ఉన్నాయి.
ఎప్పుడో ఒకసారి ఎవరో అనడం, అదే పిలవడం అలవాటైంది. కొంతమందికి ఆ నిక్‌నేమ్‌లు ఎందుకు వచ్చాయో ఎవరికీ తెలీదు’ అని షకీబ్ చెప్పాడు. బిజో (అనాముల్ హక్), శుభో (షంసుర్ రహమాన్), శిప్లు (రోబియుల్ ఇస్లామ్) ఇలాంటివే! అదే విధంగా తమీమ్ ఇక్బాల్ భారీ కాయం కారణంగా పోట్లా, ముష్ఫికర్ రహీమ్ పొట్టి సైజు కారణంగా బాతుల్ అని పేర్లు పెట్టారు. కెప్టెన్ రహీమ్‌కు ముద్దుగా ‘మిటు’ అనే పేరు కూడా ఉంది. పేసర్ మష్రాఫ్ మొర్తజా (మాష్, కౌశిక్), రజాక్ (ఆఫ్రిది అభిమానిగా లల్లా)లకు కూడా నిక్‌నేమ్‌లున్నాయి. ఇక గంగూలీ శైలిలో ఆడే మోమినుల్ హక్‌ను షౌరోభ్ అని పిలుచుకుంటారు!