డోపింగ్ స్కామ్ నేపథ్యంలో రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా రష్యాపై నిషేధం విధించాలా? వద్దా? అనే అంశంపై వారంలో
లుసానే: డోపింగ్ స్కామ్ నేపథ్యంలో రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా రష్యాపై నిషేధం విధించాలా? వద్దా? అనే అంశంపై వారంలో నిర్ణయం తీసుకుంటామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) బుధవారం స్పష్టం చేసింది. అయితే రష్యా ఆటగాళ్లు గేమ్స్‌లో పాల్గొనే అంశంపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) గురువారం తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు... న్యాయపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయానికి రావాలని భావిస్తోంది. మరోవైపు రష్యా క్రీడా మంత్రి విటాలి ముట్కోతో పాటు ఇతర మంత్రులను రియోకు రాకుండా నిషేధం విధించిన ఐఓసీ.. రష్యాలో ఎలాంటి అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేసింది. రష్యాపై నిషేధం విధించాలని ‘వాడా’ కూడా గట్టిగా కోరుకుంటోంది. అమెరికా, కెనడా, జర్మనీ, జపాన్‌లు కూడా దీనికి మద్దతుగా నిలిచాయి.
అయితే మొత్తం రష్యాపై నిషేధంపై కాకుండా డోపింగ్‌లో విఫలమైన అథ్లెట్లను రియోకు రాకుండా అడ్డుకోవాలని మరికొన్ని దేశాలు పిలుపునిస్తున్నాయి. ఓవరాల్‌గా ఒలింపిక్ చరిత్రలో రష్యా అంశంపై ఓ సంచలనాత్మక తీర్పు రావడం మాత్రం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ వివాదాలతో సంబంధం లేకుండా రష్యా 387 మంది అథ్లెట్లను రియోకు ఎంపిక చేసిం ది. ఈ భారీ బృందానికి రష్యా ఒలింపిక్ సంఘం ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోద ముద్ర వేసింది.