మళ్లీ జకార్తాలో కలుద్దాం
పక్షం రోజులపాటు జరిగిన ఆసియా క్రీడలు ముగిశాయి. దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో శనివారం ముగింపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆసియాలో మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ చైనా 342 పతకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. భారత్ 11 స్వర్ణాలు, 10 రజతాలు, 36 కాంస్యాలతో కలిపి మొత్తం 57 పతకాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. కబడ్డీలో తమకు తిరుగులేదని నిరూపిస్తూ భారత్ పురుషుల, మహిళల విభాగాల్లో మళ్లీ స్వర్ణ పతకాలు సాధించింది. ఓవరాల్‌గా ఈ ఆసియా క్రీడల్లో 14 ప్రపంచ రికార్డులు, 27 ఆసియా రికార్డులు బద్దలయ్యాయి. ఆరు డోపింగ్ కేసులు నమోదు కాగా... ఇందులో ఇద్దరు స్వర్ణ పతక విజేతలు కూడా ఉండటం గమనార్హం. ఈ ఆసియా క్రీడల ‘అత్యంత విలువైన ఆటగాడు’ పురస్కారం జపాన్ స్విమ్మర్ కొసుకె హగినోకు లభించింది. 2018 ఆసియా క్రీడలు ఇండోనేసియా రాజధాని జకార్తాలో జరుగుతాయి.