Incheon
-
ఇంచియాన్ గుణపాఠం!
అందరికీ పండగ సందర్భాలయ్యేవి మనకు పరాభవ క్షణాలుగా మిగలడం... ఎన్నేళ్లు గడిచినా పదే పదే ఇదే పునరావృతం కావడం బాధకలిగించే విషయం. పక్షం రోజులపాటు దక్షిణ కొరియాలోని ఇంచియాన్ వేదికగా సాగి దేశదేశాల్లోని క్రీడాభిమానుల్ని అలరించిన ఆసియా క్రీడా మహోత్సవం ముగిసిన తర్వాత మన ప్రతిభాపాటవాలు ఎలా ఉన్నాయని సమీక్షించుకుంటే మరోసారి నిరాశే మిగి లింది. అలాగని మన క్రీడాకారులు మెరిపించిన మెరుపులు చిన్నవేమీ కాదు. 1966 తర్వాత ఏసియాడ్‌లో మన హాకీ క్రీడాకారులు పాకిస్థాన్‌ను ఓడించడం ఇదే ప్రథమం. అంతేకాదు...వారు రియో ఒలింపిక్స్‌కు అర్హత కూడా పొందారు. టెన్నిస్‌లో సానియా, సాకేత్ మైనేని జోడి స్వర్ణం సాధించింది. షూటర్ జీతూ రాయ్ పసిడి పతకాన్ని సాధించగా డిస్కస్ త్రోలో సీమా పునియా సత్తా చాటుకుని స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. కబడ్డీ క్రీడలో పురుషులు, మహిళల విభాగాలు రెండూ హోరాహోరీ పోరాడి పసిడి పతకాలను చేజిక్కించుకున్నాయి. తన ప్రత్యర్థితో పోలిస్తే పదేళ్లు పెద్దయినా బాక్సర్ మేరీకామ్ చివరి రెండు రౌండ్లలోనూ మెరుపువేగంతో పంచ్‌లిచ్చి ఎనిమిది నిమిషాల్లోనే బంగారుపతకం గెల్చుకుంది. మహిళా బాక్సింగ్ పోటీల్లో ఏసియాడ్‌లో స్వర్ణం రావడం మనకిదే తొలిసారి. ఇలా పదకొండు స్వర్ణాలు సాధించి, వాటితోపాటు 10 రజతాలు, 36 కాంస్యాలు తీసుకొచ్చిన మన క్రీడాకారుల సామర్థ్యం ఎన్నదగినదే. సందేహం లేదు. కానీ, మొత్తంగా మన స్థానం ఎక్కడని చూసుకుంటే ప్రాణం ఉసూరు మంటుంది. నాలుగేళ్లక్రితం గ్వాంగ్జౌలో 14 స్వర్ణాలు, 17 రజతాలు, 34 కాంస్యాలు సాధించి ఆరో స్థానంలో ఉన్న మనం ఈసారి ఎనిమిదో స్థానానికి పడిపోయాం. గత ఏసియాడ్‌తో పోలిస్తే చైనాకు స్వర్ణాలు తగ్గిన మాట వాస్తవమే అయినా ఆ దేశ అథ్లెట్లు ప్రతి ఈవెంట్లోనూ తమ క్రీడా పాటవాన్ని ప్రదర్శించారు. చైనా 151 స్వర్ణాలు, మొత్తంగా 343 పతకాలు సాధించి ఎప్పటి లానే క్రీడల్లో తన ఆధిపత్యానికి ఎదురులేదని నిరూపించుకుంది. చైనాతో పోల్చుకోనవసరం లేదు... దక్షిణకొరియా, కజికిస్థాన్, ఇరాన్, ఉత్తరకొరియా వంటి చిన్న దేశాలతో పోల్చినా మనం చిన్నబోయాం. 10 స్వర్ణాలు, 18 రజతాలు, 23 కాంశ్యాలు గెల్చుకున్న తైవాన్‌తో పోల్చినా మనం తీసికట్టే. ఏదైనా క్రీడా సంబరం జరుగుతున్నదనేసరికి మన అసమర్థత, మన నిర్లిప్తత, మన నిష్క్రియాపరత్వం కొట్టొచ్చినట్టు కనబడతాయి. మన అథ్లెట్లు సాధిస్తున్న విజయాలను అవి మసకబారుస్తాయి. ఇలాంటి చేదు అనుభవాలనుంచి గుణపాఠాలు నేర్చుకుని ఈసారినుంచి అయినా జాగ్రత్తగా ఉంటారనుకున్న ప్రతిసారీ క్రీడా నిర్వాహకులు అంతకన్నా అధ్వాన్నంగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళా బాక్సర్ సరితాదేవి ఎపిసోడ్ ప్రత్యేకించి చెప్పుకోవాలి. న్యాయనిర్ణేతలుగా ఉన్నవారు విజేతను నిర్ణయించడంలో పొరపాటు చేశారని ఆ ఈవెంట్‌ను చూసిన ప్రతి ఒక్కరూ అభిప్రాయపడ్డారు. మేరీ కామ్‌పై ఓడిపోయిన క్రీడాకారిణి కూడా ఇదే మాట చెప్పింది. నిబంధనల ప్రకారం ఇలాంటి సందర్భాల్లో ఈవెంట్ పూర్తయిన అరగంటలోపు అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్‌కు 500 డాలర్లు (సుమారు రూ. 30,000) చెల్లించి అసమ్మతిని తెలపాలి. న్యాయనిర్ణేతలది ఉద్దేశపూర్వకమా, అవగాహనలోపమా అనేది పక్కన బెట్టి తనకు అన్యాయం జరిగిందని భావిస్తున్న సరితాదేవి వద్దకు హుటాహుటీన వెళ్లి ఫిర్యాదుకు అవసరమైన డబ్బు సర్దుబాటు చేయాల్సి ఉండగా... కనీసం ఓదార్చడానికి కూడా మన అధికారులు ప్రయత్నించలేదు. ఇలాంటి పరిస్థితే ఎదురైన తమ అథ్లెట్ల కోసం మంగోలియా, ఫిలిప్పీన్స్ అధికారులు అధికారులు ఎంత తపించారో చూస్తే మనవాళ్ల నిర్వాకం ఏపాటిదో అర్ధమవుతుంది. చివరకు సరితాదేవి పక్కనున్నవారివద్ద అప్పుచేసి, ఫిర్యాదు నమోదు చేయించాల్సి వచ్చింది. అవార్డు అందజేసే కార్యక్రమం పొడవునా ఆమె విలపిస్తూనే ఉన్నది. చివరకు తనకొచ్చిన కాంశ్యాన్ని ప్రత్యర్థి మెడలో వేసి వెలుపలకు వచ్చింది. సరైన సమయంలో మన అధికారులు జోక్యం చేసుకుని తాము అండగా నిలుస్తామని ఆమెకు ధైర్యం చెప్పివుంటే ఈ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేవి కాదు. ఈసారి 516మంది క్రీడాకారులతో వెళ్తున్నామని, కనీసం 70-75 పతకాలు పట్టుకొస్తామని ఇంచియాన్ వెళ్లేముందు డప్పుకొట్టుకున్న నిర్వాహకులు ఇప్పటికైనా ఎక్కడ తప్పు జరిగిందో, ఎందుకు జరిగిందో ఆత్మవిమర్శకు సిద్ధపడాలి. సమర్థులైన క్రీడాకారులను గుర్తించి, ఎంపిక చేయడంతోనే సరిపోదు. వారికి సకల సదుపాయాలూ కల్పించాలి. వారిలోని ప్రతిభాపాటవాలు మరింత రాణించేలా అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణనిప్పించాలి. మరో రెండేళ్లలో రియో ఒలింపిక్స్ జరగబోతున్నాయి. ఆలోగా ఇవన్నీ పూర్తికావాలి. ఇందులో కేంద్ర ప్రభుత్వ బాధ్యతా ఉన్నది. ఏసియాడ్ క్రీడల కోసం ఇతర దేశాలవారు తమ క్రీడాకారులను పది పదిహేనురోజుల ముందు అక్కడికి తరలిస్తే మన సర్కారు మాత్రం అయిదురోజుల ముందు వెళ్లి, ఉత్సవాలు ముగిసిన మర్నాడు రావాలని గిరి గీసింది. ఇలా అనవసర విషయాలపై అతి శ్రద్ధ చూపడాన్ని తగ్గించుకుని ఒలింపిక్ సంఘంలోని పీఠాధిపతులనుంచి క్రీడలను కాపాడటానికి ఏం చేయవచ్చునో ఆలోచించాలి. అంతర్జాతీయ క్రీడారంగంలో మనం తలెత్తుకుని నిలబడటానికి అవసరమైన చర్యలన్నీ ప్రారంభించాలి. మానవ వనరులకు, ప్రతిభాసామర్థ్యాలకు కొదవేలేని మన దేశం క్రీడల్లో చిన్న చిన్న దేశాలముందు కూడా ఎందుకని చిన్నబుచ్చుకోవాల్సివస్తున్నదో తెలుసుకోవాలి. రియో ఒలింపిక్స్ సమీపిస్తున్న తరుణంలో క్రీడారంగం సమూల ప్రక్షాళనకు నడుం బిగించాలి. ఇప్పుడు సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుంటూనే లోపాలనుంచి గుణపాఠాలు గ్రహించి అవి పునరావృతం కాకుండా చర్యలకు ఉపక్రమించాలి. -
మళ్లీ జకార్తాలో కలుద్దాం
పక్షం రోజులపాటు జరిగిన ఆసియా క్రీడలు ముగిశాయి. దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో శనివారం ముగింపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆసియాలో మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ చైనా 342 పతకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. భారత్ 11 స్వర్ణాలు, 10 రజతాలు, 36 కాంస్యాలతో కలిపి మొత్తం 57 పతకాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. కబడ్డీలో తమకు తిరుగులేదని నిరూపిస్తూ భారత్ పురుషుల, మహిళల విభాగాల్లో మళ్లీ స్వర్ణ పతకాలు సాధించింది. ఓవరాల్‌గా ఈ ఆసియా క్రీడల్లో 14 ప్రపంచ రికార్డులు, 27 ఆసియా రికార్డులు బద్దలయ్యాయి. ఆరు డోపింగ్ కేసులు నమోదు కాగా... ఇందులో ఇద్దరు స్వర్ణ పతక విజేతలు కూడా ఉండటం గమనార్హం. ఈ ఆసియా క్రీడల ‘అత్యంత విలువైన ఆటగాడు’ పురస్కారం జపాన్ స్విమ్మర్ కొసుకె హగినోకు లభించింది. 2018 ఆసియా క్రీడలు ఇండోనేసియా రాజధాని జకార్తాలో జరుగుతాయి. -
‘పసిడి’ కూతకు విజయం దూరంలో...
కబడ్డీ ఫైనల్స్‌లో భారత పురుషుల, మహిళల జట్లు ఇంచియాన్: మిగతా క్రీడాంశాల్లో ఫలితాలు ఎలా ఉన్నా.... ఆసియా క్రీడల్లో కచ్చితంగా రెండు స్వర్ణాలు గెలుస్తుందని నమ్మకం పెట్టుకున్న క్రీడాంశం కబడ్డీ. అంచనాలకు అనుగుణంగానే భారత పురుషుల, మహిళల జట్లు తమ జైత్రయాత్ర కొనసాగిస్తూ స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాయి. పురుషుల జట్టు వరుసగా ఏడో స్వర్ణంపై... మహిళల జట్టు వరుసగా రెండో స్వర్ణంపై గురి పెట్టాయి. గురువారం జరిగిన పురుషుల గ్రూప్ ‘ఎ’ సెమీఫైనల్లో భారత్ 36-25తో కొరియాపై గెలిచింది. తొలి అర్ధభాగానికి 14-12 ఆధిక్యంలో నిలిచిన భారత్ రెండో అర్ధభాగంలో మరింత దూకుడుగా ఆడి 22 పాయింట్లు సొంతం చేసుకుంది. కొరియా 13 పాయింట్లు మాత్రమే గెలవడంతో ఓటమి తప్పలేదు. తొలి భాగంలో ఏడు, రెండో భాగంలో ఒక బోనస్ పాయింట్లు గెలిచిన భారత్ రెండుసార్లు లోనాను నమోదు చేసింది. కేవలం ఐదు బోనస్ పాయింట్లతో సరిపెట్టుకున్న కొరియా ఒక్క లోనా కూడా చేయలేకపోయింది. మహిళల సెమీస్‌లో భారత్ 41-28తో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసింది. తొలి అర్ధభాగంలో రెండు జట్ల స్కోరు 14-14తో సమమైంది. అయితే రెండో అర్ధభాగంలో వ్యూహం మార్చిన భారత్ చకచకా 27 పాయింట్లను కైవసం చేసుకుంది. థాయ్ క్రీడాకారిణిలు 14 పాయింట్లతో సరిపెట్టుకున్నారు. భారత్‌కు మొత్తం 6 బోనస్ పాయింట్లతో పాటు రెండు లోనాలు లభించాయి. థాయ్ 13 బోనస్ పాయింట్లు నెగ్గినా లోనాను మాత్రం నమోదు చేయలేకపోయింది. శుక్రవారం జరిగే ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు ఇరాన్‌తో; మహిళల జట్టు కూడా ఇరాన్‌తోనే తలపడతాయి. వాలీబాల్: భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. 5-8 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ పురుషుల జట్టు 3-1తో థాయ్‌లాండ్‌పై నెగ్గింది. మహిళల టీమ్ 0-3తో హాంకాంగ్ చేతిలో ఓడి 8వ స్థానంతో సరిపెట్టుకుంది. టేబుల్ టెన్నిస్: స్టార్ ప్లేయర్ సౌమ్యజిత్ ఘోష్ ప్రిక్వార్టర్స్‌లో 1-4తో స్నిహోక్ పాక్ (కొరియా) చేతిలో; మహిళల విభాగంలో మానికా బాత్రా 0-4తో ఇషికావా కసుమీ (జపాన్) చేతిలో ఓటమిపాలయ్యారు. అంకితా దాస్ తొలి రౌండ్లో 2-4తో వింగ్ నామ్ (హాంకాంగ్) చేతిలో ఓడింది. తైక్వాండో: 63 కేజీల క్వార్టర్స్‌లో సౌరవ్ 4-5తో అబాసి అహ్మద్ (అఫ్ఘానిస్థాన్) చేతిలో; 68 కేజీల విభాగంలో శివ్ కుమార్ 7-11తో గాజి ముషాబ్బా (సౌదీ ఆరేబియా) చేతిలో ఓడారు. మహిళల 62 కేజీల విభాగంలో రేఖా రాణి 0-15తో చువాంగ్ (చైనీస్‌తైపీ) చేతిలో; 67 కేజీల కేటగిరీలో శ్రేయా సింగ్ 6-7తో వోన్జిన్ లీ (కొరియా) చేతిలో ఓటమి చెందారు. -
నిరాశపరిచిన భారత రెజ్లర్లు
ఇంచియాన్:ఫ్రీ స్టయిల్ విభాగంలో దుమ్ము భారత రెజ్లర్లు గ్రీకో రోమన్లో మాత్రం నిరాశ పరిచారు. కృష్ణకాంత్ యాదవ్ కాంస్య పతక పోరులో 0-3తో ఇరాన్ రెజ్లర్ సయూద్ చేతిలో ఓడాడు. ఇక రవీందర్ సింగ్, హర్‌ప్రీత్ సింగ్ క్వార్టర్ ఫైనల్ బౌట్లో ఓడి ఇంటిదారి పట్టారు. ఇదిలా ఉండగా టేబుల్ టెన్నిస్ పురుషుల డబుల్స్‌లో భారత జోడీలు శరత్ కమల్- ఆంథోని అమల్‌రాజ్, హర్మీత్ దేశాయ్-సౌమ్యజిత్ ఘోష్ తమ ప్రత్యర్థులపై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. మిక్స్డ్ డబుల్స్ ప్రి క్వార్టర్స్‌లో అమల్‌రాజ్-మాధురిక ద్వయుం, జపాన్ జంటపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. షూటింగ్ లో మైరాజ్ అహ్మద్ ఖాన్ స్కీట్ వ్యక్తిగత విభాగంలో కొద్దిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. సెమీఫైనల్లో తను ఐదో స్థానంలో నిలిచాడు. -
గోల్డ్ మెడల్ కు ఒక్క అడుగు దూరంలో...
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ మేరికోమ్ స్వర్ణం పతకం సాధించేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఇంచియాన్‌లో జరుగుతున్న ఏషియన్ క్రీడల్లో ఆమె మహిళల 48-51 కేజీల ఫ్లై వెయిట్ విభాగంలో ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. వియాత్నం బాక్సర్ లి థాయ్ బాంగ్ పై మేరికోమ్ 3-0 తేడాతో గెలుపొందింది. ఫైనల్స్‌లో మేరీకోమ్ విజయం సాధిస్తే భారత్‌కు మరో పసిడి పతకం దక్కనుంది. ఒకవేళ ఆమె రన్నర్‌గా నిలిచినా రజిత పతకం దక్కనుంది. క్వార్టర్ ఫైనల్లో తనకంటే 10 ఏళ్లు చిన్నదైన చైనా ప్రత్యర్థి హైజువన్ ను మేరీకోమ్ ఓడించింది. -
వైదొలిగిన ఖతార్ మహిళలు జట్టు
ఇంచియాన్: ఆసియా క్రీడలనుంచి ఖతార్ మహిళల బాస్కెట్ బాల్ జట్టు వైదొలగినట్లు నిర్వాహకులు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ‘హిజాబ్’ను అనుమతించని కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన ఈ జట్టు షెడ్యూల్ ప్రకారం శుక్రవారం తమ చివరి మ్యాచ్‌లో కజకిస్థాన్‌తో తలపడాల్సి ఉంది. నిబంధనలు మారిస్తేనే మ్యాచ్ ఆడతామన్న ఆ జట్టు...అందుకు అనుమతి దక్కకపోవడంతో స్వదేశానికి తిరిగి వెళ్లిపోయింది. శుక్రవారం ఉదయం ఆ జట్టు దోహా చేరుకుంది. ఏషియాడ్ నిర్వాహకులు తమ మతాన్ని గౌరవించలేదని ఈ సందర్భంగా జట్టు మేనేజర్ వ్యాఖ్యానించారు. అయితే ఈ నిబంధనకు, మతానికి ముడి పెట్టడం సరి కాదని అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ సంఘం (ఫిబా) స్పష్టం చేసింది. దేశవాళీల్లో ఇప్పటికే ‘హిజాబ్’ అనుమతిస్తున్నామని, భవిష్యత్తులో అంతర్జాతీయ మ్యాచుల్లోనూ అమలు చేసే విషయంలో పరిశీలనలో ఉందన్నారు. -
కాంస్యంతో సరిపెట్టుకున్న సనతోయి దేవి
ఇంచియాన్: ఆసియా గేమ్స్‌లో వుషు క్రీడాంశంలో సనోతోయిదేవి కాంస్యంతో సరిపెట్టకుంది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో ఈ మణిపూర్ క్రీడాకారిణి జాంగ్ లుయాన్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. సోమవారం మహిళల సాండా 52 కేజీల క్వార్టర్ ఫైనల్లో సనతోయి దేవి అద్భుత ప్రదర్శన చేసి సెమీ ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. మంగోలియాకు చెందిన అమ్‌గలన్ జర్గల్‌ను 2-0తో విన్ బై రౌండ్ పద్దతిన నెగ్గి సెమీస్‌కు చేరినా.. ఇక్కడ సనతోయిదేవికి నిరాశే ఎదురైంది. కాగా, ఏషియన్ గేమ్స్‌లో షూటింగ్ విభాగంలో భారత్ మరో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 100మీటర్ల పురుషుల రైఫిల్ షూటింగ్లో అభినవ్ బింద్రా, రవికుమార్, సంజీవ్ రాజ్పుట్ జట్టు పతకాన్ని సాధించింది. ఇదిలా ఉండగా స్వ్కాష్ లో ఘోషల్ రజతంతో సరిపెట్టుకున్నాడు. -
ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో కాంస్యం
ఇంచియాన్ : ఏషియన్ గేమ్స్‌లో షూటింగ్ విభాగంలో భారత్ మరో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 100మీటర్ల పురుషుల రైఫిల్ షూటింగ్లో అభినవ్ బింద్రా, రవికుమార్, సంజీవ్ రాజ్పుట్ జట్టు పతకాన్ని సాధించింది. కాగా అభినవ్ బింద్రా ట్విట్టర్ ద్వారా చేసిన వ్యాఖ్యలతో అయోమయం నెలకొల్పాడు. ప్రొఫెషనల్ షూటర్‌గా ఇదే తన చివరి రోజు అని ఈ మాజీ ఒలింపిక్ చాంపియన్ ట్వీట్ చేయడం కలకలం రేపింది. -
'నెల రోజులుగా అమ్మతో మాట్లాడలేదు'
ఇంచియూన్: దక్షిణకొరియాలోని ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియన్ గేమ్స్ లో కాంస్యం గెలిచిన జీతూ రాయ్ ఈ ఏడాదిని ఘనంగా ముగించాడు. తాజాగా 10 మీ. ఎరుుర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో కాంస్యంతో కలుపుకుని 2014లో ఏడు పతకాలు సాధించాడు. ఈ సీజన్లో విజయువంతం కావడంపై ఈ భారత షూటర్ తను చాలా సంతోషంగా ఉన్నాడు. ఇదే జోరును 2016 రియో ఒలింపిక్స్‌లోనూ కొనసాగిస్తానని ధీమాగా చెబుతున్నాడు. ఇక ఆసియూ క్రీడల్లో పతకమే లక్ష్యంగా పెట్టుకున్న జీతు తాను అనుకున్నది సాధించడం కోసం కనీసం తన తల్లితో కూడా ఫోన్లో మాట్లాడలేదట. ‘గత నెల్లో ప్రపంచ చాంపియున్‌షిప్ కోసం స్పెయిన్‌కు వెళ్లినప్పటి నుంచి అమ్మతో మాట్లాడలేదు. నేను స్వర్ణం గెలిచిన విషయుం అమ్మకు ఇంకా తెలియులేదు. ఇప్పుడు పతకం గెలిచాను కాబట్టి అమ్మతో మాట్లాడతా'అని జీతూ రాయ్ తెలిపాడు. -
జీతూ రాయ్ కు రూ.50 లక్షల నజరానా
ఇంచియాన్ : ఆసియా క్రీడల్లో తొలిస్వర్ణం సాధించిన భారత షూటర్, ఉత్తరప్రదేశ్ క్రీడాకారుడు జీతూ రాయ్ కు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షలు నజరానా ప్రకటించింది. ఇచియాన్ లో ఆరంభమైన ఆసియా క్రీడల్లో జీతూ స్వర్ణం సాదించిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నజరానాను ప్రకటించారు. దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఏషియన్ గేమ్స్‌లో ప్రపంచ ఐదో నంబర్ క్రీడాకారుడు జీతూ రాయ్ భారత్ కు తొలి స్వర్ణం అందించాడు. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ జీతూ రాయ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. చైనా రజిత, కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది. కాగా మహిళల విభాగంలో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతా చౌదరి కాంస్యాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆసియా క్రీడల్లో భారత్ రెండు పతకాలను తన ఖాతాలో జమ చేసుకుంది.బ్యాడ్మింటన్ ప్రీ క్వార్టర్స్ మహిళల విభాగంలో భారత్, మకావు బరిలో దిగనున్నాయి.. సైనా నెహ్వాల్, సింధూ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడనున్నారు. ఇక బ్యాడ్మింటన్ ప్రీక్వార్టర్స్ పురుషుల విభాగంలో భారత్, కొరియా పోటీ పడతాయి. -
ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం
ఇంచియాన్ : ఆసియా క్రీడల్లో భారత్ శుభారంభం చేసింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఏషియన్ గేమ్స్‌లో భారత్ తొలి స్వర్ణం సాధించింది. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ జీతూ రాయ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. చైనా రజిత, కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది. కాగా మహిళల విభాగంలో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతా చౌదరి కాంస్యాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆసియా క్రీడల్లో భారత్ రెండు పతకాలను తన ఖాతాలో జమ చేసుకుంది. బ్యాడ్మింటన్ ప్రీ క్వార్టర్స్ మహిళల విభాగంలో భారత్, మకావు బరిలో దిగనున్నాయి.. సైనా నెహ్వాల్, సింధూ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడనున్నారు. ఇక బ్యాడ్మింటన్ ప్రీక్వార్టర్స్ పురుషుల విభాగంలో భారత్, కొరియా పోటీ పడతాయి. -
బోణీ కొట్టిన భారత్, శ్వేతా చౌదరికి కాంస్యం
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో వైభవంగా ప్రారంభమైన ఏషియాడ్ గేమ్స్‌లో భారత క్రీడాకారిణి శ్వేతా చౌదరి తొలి పతాకాన్ని అందించింది. పది మీటర్ల ఎయిర్‌పిస్టల్ మహిళల విభాగంలో కాంస్య పతకం సాధించింది. ప్రపంచ క్రీడా చరిత్రలోనే ఒలింపిక్స్ అనంతరం రెండో అతి పెద్ద క్రీడా ఈవెంట్‌గా పేరు తెచ్చుకున్న ఈ గేమ్స్‌లో శనివారం నుంచి ఆసియా ఖండానికి చెందిన 45 దేశాల నుంచి 13 వేల మంది అథ్లెట్లు తమ ప్రావీణ్యాన్ని చూపనున్నారు. 2010లో భారత్ 35 క్రీడాంశాల్లో పోటీపడగా.. ఈసారి ఆసంఖ్య 28కి పడిపోయింది. ఇక ఇంచియాన్‌లో పలు క్రీడాంశాల్లో భారత్ నుంచి ప్రాతినిధ్యమే లేదు. మొత్తం 516 మంది క్రీడాకారులు ఆసియా క్రీడల్లో బరిలో ఉన్నారు. అలాగే 2018లో జరగబోయే ఆసియా గేమ్స్‌కు ఇండోనేసియాలోని జకర్తా ఆతిథ్యమివ్వనుంది. -
ఆసియా ఒక్కటే
ఇంచియాన్: ‘ఒక్కటే ఆసియా.. ఆసియా అంతా ఒక్కటే’ అనే నినాదంతో దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నగరంలో 17వ ఏషియాడ్ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తమ సంస్కృతి.. సంప్రదాయాలు.. కళలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు కొరియా స్థానిక ఇంచియాన్ ఏషియాడ్ ప్రధాన స్టేడియాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంది. ఆరంభంలో డిజిటల్ టెక్నాలజీ ద్వారా చూపిన దృశ్యాలు ఔరా అనిపించగా... ఫినిషింగ్ టచ్‌గా పాప్ సెన్సేషన్ సై ప్రేక్షకులతో పాటు స్టేడియంలో ఉన్న అథ్లెట్లను కూడా చిందులు వేయించాడు. ప్రపంచ క్రీడా చరిత్రలోనే ఒలింపిక్స్ అనంతరం రెండో అతి పెద్ద క్రీడా ఈవెంట్‌గా పేరు తెచ్చుకున్న ఈ గేమ్స్‌లో ఇక నేటి (శనివారం) నుంచి 45 దేశాల నుంచి 13 వేల మంది అథ్లెట్లు తమ ప్రావీణ్యాన్ని చూపనున్నారు. ముఖ్యంగా ఆరంభ వేడుకలు నాలుగు విభాగాలుగా జరిగాయి. ప్రాచీన ఆసియా, సముద్ర మార్గాల ద్వారా ఆసియాలో ప్రవేశం, ఆ కుటుంబం.. స్నేహితులుగా ఆసియా రూపాంతరం, చివరిగా ఒకే ఆసియా అనే థీమ్‌ను ప్రామాణికంగా తీసుకున్నారు. ఆసియాలో ఇంచియాన్ నగరం ప్రధాన భూమికగా ఉందనే వీడియో సందేశంతో పాటు కళ్లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులతో వేడుకలు ఆరంభమయ్యాయి. అనంతరం 45 మంది చిన్నారుల ప్రదర్శన... ఆ తర్వాత సంప్రదాయ వేషధారణలో పురాతన ఇంచియాన్ నాగరికతను గుర్తుచేసే విధంగా కళాకారుల ప్రదర్శన సాగింది. సింగర్ కో-ఉన్ ‘సాంగ్ ఫర్ ది ఏషియాడ్’ను ఆలపించాడు. ఆ తర్వాత కొరియా జానపద గాథలను చూపడంతో పాటు వారి అభివృద్ధి పరిణామ క్రమాన్ని కళ్లకు కట్టినట్టు చూపారు. వీటన్నింటినీ ప్రధాన స్టేడియంపైనే అతి పెద్ద తెరను ఏర్పాటు చేసి అందులో డిజిటల్ సహాయంతో చూపడం అబ్బురపరిచింది. ఒపెరా సింగర్స్ చుట్టూ గ్రాఫిక్స్ రూపంలో పెద్ద ఓడను సృష్టించగా దాన్ని ఒకరు తర్వాత మరొకరు నడుపుతూ ఆసియా సరికొత్త అభివృద్ధి వైపు పయనిస్తున్నట్టుగా ప్రదర్శన సాగింది. అనంతరం 45 దేశాలకు చెందిన 9,500 మంది క్రీడాకారులు ఒకరి తర్వాత మరొకరు స్టేడియంలోకి ప్రవేశించారు. భారత్ తరఫున హాకీ ఆటగాడు సర్దార్ సింగ్ జాతీయ పతాకాన్ని చేతపట్టి ముందు నడిచాడు. పురుష ఆటగాళ్లు నల్లటి బ్లేజర్ ధరించగా మహిళా అథ్లెట్స్ నీలి రంగు చీరలో మెరిశారు. అనంతరం దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్ జ్యూన్హై పోటీలను ఆరంభిస్తున్నట్టు ప్రకటించారు. {పసిద్ధ నటి లీ యంగీ ఇ ఆసియా క్రీడల జ్యోతిని వెలిగించగా ఆ వెంటనే స్టేడియం అంతా బాణాసంచా వెలుగులతో నిండిపోయింది. కార్యక్రమం చివర్లో కొరియన్ పాప్ స్టార్ సై తన పాపులర్ సాంగ్ ‘ఒప్పా గంగ్నమ్ స్టయిల్’ను పాడడంతో పాటు అక్కడున్న వారందరిచేత డ్యాన్స్ చేయించడంతో కార్యక్రమం ముగిసింది.