ఇంచియాన్: ఆసియా క్రీడలనుంచి ఖతార్ మహిళల బాస్కెట్ బాల్ జట్టు వైదొలగినట్లు నిర్వాహకులు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ‘హిజాబ్’ను అనుమతించని కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన ఈ జట్టు షెడ్యూల్ ప్రకారం శుక్రవారం తమ చివరి మ్యాచ్‌లో కజకిస్థాన్‌తో తలపడాల్సి ఉంది. నిబంధనలు మారిస్తేనే మ్యాచ్ ఆడతామన్న ఆ జట్టు...అందుకు అనుమతి దక్కకపోవడంతో స్వదేశానికి తిరిగి వెళ్లిపోయింది. శుక్రవారం ఉదయం ఆ జట్టు దోహా చేరుకుంది. ఏషియాడ్ నిర్వాహకులు తమ మతాన్ని గౌరవించలేదని ఈ సందర్భంగా జట్టు మేనేజర్ వ్యాఖ్యానించారు.
అయితే ఈ నిబంధనకు, మతానికి ముడి పెట్టడం సరి కాదని అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ సంఘం (ఫిబా) స్పష్టం చేసింది. దేశవాళీల్లో ఇప్పటికే ‘హిజాబ్’ అనుమతిస్తున్నామని, భవిష్యత్తులో అంతర్జాతీయ మ్యాచుల్లోనూ అమలు చేసే విషయంలో పరిశీలనలో ఉందన్నారు.