ఇంచియాన్ గుణపాఠం! | To qualify for the Olympics in Rio | Sakshi
Sakshi News home page

ఇంచియాన్ గుణపాఠం!

Published Sun, Oct 5 2014 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM

To qualify for the Olympics in Rio

అందరికీ పండగ సందర్భాలయ్యేవి మనకు పరాభవ క్షణాలుగా మిగలడం... ఎన్నేళ్లు గడిచినా  పదే పదే ఇదే పునరావృతం కావడం బాధకలిగించే విషయం. పక్షం రోజులపాటు దక్షిణ కొరియాలోని ఇంచియాన్ వేదికగా సాగి దేశదేశాల్లోని క్రీడాభిమానుల్ని అలరించిన ఆసియా క్రీడా మహోత్సవం ముగిసిన తర్వాత మన ప్రతిభాపాటవాలు ఎలా ఉన్నాయని సమీక్షించుకుంటే మరోసారి నిరాశే మిగి లింది. అలాగని మన క్రీడాకారులు మెరిపించిన మెరుపులు చిన్నవేమీ కాదు. 1966 తర్వాత ఏసియాడ్‌లో మన హాకీ క్రీడాకారులు పాకిస్థాన్‌ను ఓడించడం ఇదే ప్రథమం. అంతేకాదు...వారు రియో ఒలింపిక్స్‌కు అర్హత కూడా పొందారు. టెన్నిస్‌లో సానియా, సాకేత్ మైనేని జోడి స్వర్ణం సాధించింది. షూటర్ జీతూ రాయ్ పసిడి పతకాన్ని సాధించగా డిస్కస్ త్రోలో సీమా పునియా సత్తా చాటుకుని స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. కబడ్డీ క్రీడలో పురుషులు, మహిళల విభాగాలు రెండూ హోరాహోరీ పోరాడి పసిడి పతకాలను చేజిక్కించుకున్నాయి. తన ప్రత్యర్థితో పోలిస్తే పదేళ్లు పెద్దయినా బాక్సర్ మేరీకామ్ చివరి రెండు రౌండ్లలోనూ మెరుపువేగంతో పంచ్‌లిచ్చి ఎనిమిది నిమిషాల్లోనే బంగారుపతకం గెల్చుకుంది. మహిళా బాక్సింగ్ పోటీల్లో ఏసియాడ్‌లో స్వర్ణం రావడం మనకిదే తొలిసారి.

ఇలా పదకొండు స్వర్ణాలు సాధించి, వాటితోపాటు 10 రజతాలు, 36 కాంస్యాలు తీసుకొచ్చిన మన క్రీడాకారుల సామర్థ్యం ఎన్నదగినదే. సందేహం లేదు. కానీ, మొత్తంగా మన స్థానం ఎక్కడని చూసుకుంటే ప్రాణం ఉసూరు మంటుంది. నాలుగేళ్లక్రితం గ్వాంగ్‌జౌలో 14 స్వర్ణాలు, 17 రజతాలు, 34 కాంస్యాలు సాధించి ఆరో స్థానంలో ఉన్న మనం ఈసారి ఎనిమిదో స్థానానికి పడిపోయాం. గత ఏసియాడ్‌తో పోలిస్తే చైనాకు స్వర్ణాలు తగ్గిన మాట వాస్తవమే అయినా ఆ దేశ అథ్లెట్లు ప్రతి ఈవెంట్‌లోనూ తమ క్రీడా పాటవాన్ని ప్రదర్శించారు. చైనా 151 స్వర్ణాలు, మొత్తంగా 343 పతకాలు సాధించి ఎప్పటి లానే క్రీడల్లో తన ఆధిపత్యానికి ఎదురులేదని నిరూపించుకుంది. చైనాతో పోల్చుకోనవసరం లేదు... దక్షిణకొరియా, కజికిస్థాన్, ఇరాన్, ఉత్తరకొరియా వంటి చిన్న దేశాలతో పోల్చినా మనం చిన్నబోయాం. 10 స్వర్ణాలు, 18 రజతాలు, 23 కాంశ్యాలు గెల్చుకున్న తైవాన్‌తో పోల్చినా మనం తీసికట్టే. ఏదైనా క్రీడా సంబరం జరుగుతున్నదనేసరికి మన అసమర్థత, మన నిర్లిప్తత, మన నిష్క్రియాపరత్వం కొట్టొచ్చినట్టు కనబడతాయి. మన అథ్లెట్లు సాధిస్తున్న విజయాలను అవి మసకబారుస్తాయి. ఇలాంటి చేదు అనుభవాలనుంచి గుణపాఠాలు నేర్చుకుని ఈసారినుంచి అయినా జాగ్రత్తగా ఉంటారనుకున్న ప్రతిసారీ క్రీడా నిర్వాహకులు అంతకన్నా అధ్వాన్నంగా వ్యవహరిస్తున్నారు.

ఈ సందర్భంగా మహిళా బాక్సర్ సరితాదేవి ఎపిసోడ్ ప్రత్యేకించి చెప్పుకోవాలి. న్యాయనిర్ణేతలుగా ఉన్నవారు విజేతను నిర్ణయించడంలో పొరపాటు చేశారని ఆ ఈవెంట్‌ను చూసిన ప్రతి ఒక్కరూ అభిప్రాయపడ్డారు. మేరీ కామ్‌పై ఓడిపోయిన క్రీడాకారిణి కూడా ఇదే మాట చెప్పింది. నిబంధనల ప్రకారం ఇలాంటి సందర్భాల్లో ఈవెంట్ పూర్తయిన అరగంటలోపు అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్‌కు 500 డాలర్లు (సుమారు రూ. 30,000) చెల్లించి అసమ్మతిని తెలపాలి. న్యాయనిర్ణేతలది ఉద్దేశపూర్వకమా, అవగాహనలోపమా అనేది పక్కన బెట్టి తనకు అన్యాయం జరిగిందని భావిస్తున్న సరితాదేవి వద్దకు హుటాహుటీన వెళ్లి ఫిర్యాదుకు అవసరమైన డబ్బు సర్దుబాటు చేయాల్సి ఉండగా... కనీసం ఓదార్చడానికి కూడా మన అధికారులు ప్రయత్నించలేదు. ఇలాంటి పరిస్థితే ఎదురైన తమ అథ్లెట్‌ల కోసం మంగోలియా, ఫిలిప్పీన్స్ అధికారులు అధికారులు ఎంత తపించారో చూస్తే మనవాళ్ల నిర్వాకం ఏపాటిదో అర్ధమవుతుంది. చివరకు సరితాదేవి పక్కనున్నవారివద్ద అప్పుచేసి, ఫిర్యాదు నమోదు చేయించాల్సి వచ్చింది. అవార్డు అందజేసే కార్యక్రమం పొడవునా ఆమె విలపిస్తూనే ఉన్నది. చివరకు తనకొచ్చిన కాంశ్యాన్ని ప్రత్యర్థి మెడలో వేసి వెలుపలకు వచ్చింది. సరైన సమయంలో మన అధికారులు జోక్యం చేసుకుని తాము అండగా నిలుస్తామని ఆమెకు ధైర్యం చెప్పివుంటే ఈ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేవి కాదు.

ఈసారి 516మంది క్రీడాకారులతో వెళ్తున్నామని, కనీసం 70-75 పతకాలు పట్టుకొస్తామని ఇంచియాన్ వెళ్లేముందు డప్పుకొట్టుకున్న నిర్వాహకులు ఇప్పటికైనా ఎక్కడ తప్పు జరిగిందో, ఎందుకు జరిగిందో ఆత్మవిమర్శకు సిద్ధపడాలి. సమర్థులైన క్రీడాకారులను గుర్తించి, ఎంపిక చేయడంతోనే సరిపోదు. వారికి సకల సదుపాయాలూ కల్పించాలి. వారిలోని ప్రతిభాపాటవాలు మరింత రాణించేలా అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణనిప్పించాలి. మరో రెండేళ్లలో రియో ఒలింపిక్స్ జరగబోతున్నాయి. ఆలోగా ఇవన్నీ పూర్తికావాలి. ఇందులో కేంద్ర ప్రభుత్వ బాధ్యతా ఉన్నది.  ఏసియాడ్ క్రీడల కోసం ఇతర దేశాలవారు తమ క్రీడాకారులను పది పదిహేనురోజుల ముందు అక్కడికి తరలిస్తే మన సర్కారు మాత్రం అయిదురోజుల ముందు వెళ్లి, ఉత్సవాలు ముగిసిన మర్నాడు రావాలని గిరి గీసింది. ఇలా అనవసర విషయాలపై అతి శ్రద్ధ చూపడాన్ని తగ్గించుకుని ఒలింపిక్ సంఘంలోని పీఠాధిపతులనుంచి క్రీడలను కాపాడటానికి ఏం చేయవచ్చునో ఆలోచించాలి. అంతర్జాతీయ క్రీడారంగంలో మనం తలెత్తుకుని నిలబడటానికి అవసరమైన చర్యలన్నీ ప్రారంభించాలి. మానవ వనరులకు, ప్రతిభాసామర్థ్యాలకు కొదవేలేని మన దేశం క్రీడల్లో చిన్న చిన్న దేశాలముందు కూడా ఎందుకని చిన్నబుచ్చుకోవాల్సివస్తున్నదో తెలుసుకోవాలి. రియో ఒలింపిక్స్ సమీపిస్తున్న తరుణంలో క్రీడారంగం సమూల ప్రక్షాళనకు నడుం బిగించాలి. ఇప్పుడు సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుంటూనే లోపాలనుంచి గుణపాఠాలు గ్రహించి అవి పునరావృతం కాకుండా చర్యలకు ఉపక్రమించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement