ఆసియా ఒక్కటే | Asian alone | Sakshi
Sakshi News home page

ఆసియా ఒక్కటే

Sep 20 2014 1:26 AM | Updated on Sep 2 2017 1:39 PM

ఆసియా ఒక్కటే

ఆసియా ఒక్కటే

ఇంచియాన్: ‘ఒక్కటే ఆసియా.. ఆసియా అంతా ఒక్కటే’ అనే నినాదంతో దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నగరంలో 17వ ఏషియాడ్ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

ఇంచియాన్: ‘ఒక్కటే ఆసియా.. ఆసియా అంతా ఒక్కటే’ అనే నినాదంతో దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నగరంలో 17వ ఏషియాడ్ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తమ సంస్కృతి.. సంప్రదాయాలు.. కళలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు కొరియా స్థానిక ఇంచియాన్ ఏషియాడ్ ప్రధాన స్టేడియాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంది. ఆరంభంలో డిజిటల్ టెక్నాలజీ ద్వారా చూపిన దృశ్యాలు ఔరా అనిపించగా... ఫినిషింగ్ టచ్‌గా పాప్ సెన్సేషన్ సై ప్రేక్షకులతో పాటు స్టేడియంలో ఉన్న అథ్లెట్లను కూడా చిందులు వేయించాడు. ప్రపంచ క్రీడా చరిత్రలోనే ఒలింపిక్స్ అనంతరం రెండో అతి పెద్ద క్రీడా ఈవెంట్‌గా పేరు తెచ్చుకున్న ఈ గేమ్స్‌లో ఇక నేటి (శనివారం) నుంచి 45 దేశాల నుంచి 13 వేల మంది అథ్లెట్లు తమ ప్రావీణ్యాన్ని చూపనున్నారు. ముఖ్యంగా ఆరంభ వేడుకలు నాలుగు విభాగాలుగా జరిగాయి. ప్రాచీన ఆసియా, సముద్ర మార్గాల ద్వారా ఆసియాలో ప్రవేశం, ఆ కుటుంబం.. స్నేహితులుగా ఆసియా రూపాంతరం, చివరిగా ఒకే ఆసియా అనే థీమ్‌ను ప్రామాణికంగా తీసుకున్నారు.
 
     ఆసియాలో ఇంచియాన్ నగరం ప్రధాన భూమికగా ఉందనే వీడియో సందేశంతో పాటు కళ్లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులతో వేడుకలు ఆరంభమయ్యాయి.
     అనంతరం 45 మంది చిన్నారుల ప్రదర్శన... ఆ తర్వాత సంప్రదాయ వేషధారణలో పురాతన ఇంచియాన్ నాగరికతను గుర్తుచేసే విధంగా కళాకారుల ప్రదర్శన సాగింది.
     సింగర్ కో-ఉన్ ‘సాంగ్ ఫర్ ది ఏషియాడ్’ను ఆలపించాడు.
     ఆ తర్వాత కొరియా జానపద గాథలను చూపడంతో పాటు వారి అభివృద్ధి పరిణామ క్రమాన్ని కళ్లకు కట్టినట్టు చూపారు.
     వీటన్నింటినీ ప్రధాన స్టేడియంపైనే అతి పెద్ద తెరను ఏర్పాటు చేసి అందులో డిజిటల్ సహాయంతో చూపడం అబ్బురపరిచింది.
     ఒపెరా సింగర్స్ చుట్టూ గ్రాఫిక్స్ రూపంలో పెద్ద ఓడను సృష్టించగా దాన్ని ఒకరు తర్వాత మరొకరు నడుపుతూ ఆసియా సరికొత్త అభివృద్ధి వైపు పయనిస్తున్నట్టుగా ప్రదర్శన సాగింది.
     అనంతరం 45 దేశాలకు చెందిన 9,500 మంది క్రీడాకారులు ఒకరి తర్వాత మరొకరు స్టేడియంలోకి ప్రవేశించారు.
     భారత్ తరఫున హాకీ ఆటగాడు సర్దార్ సింగ్ జాతీయ పతాకాన్ని చేతపట్టి ముందు నడిచాడు. పురుష ఆటగాళ్లు నల్లటి బ్లేజర్ ధరించగా మహిళా అథ్లెట్స్ నీలి రంగు చీరలో మెరిశారు.
     అనంతరం దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్ జ్యూన్‌హై పోటీలను ఆరంభిస్తున్నట్టు ప్రకటించారు.
     {పసిద్ధ నటి లీ యంగీ ఇ ఆసియా క్రీడల జ్యోతిని వెలిగించగా ఆ వెంటనే స్టేడియం అంతా బాణాసంచా వెలుగులతో నిండిపోయింది.
     కార్యక్రమం చివర్లో కొరియన్ పాప్ స్టార్ సై తన పాపులర్ సాంగ్ ‘ఒప్పా గంగ్నమ్ స్టయిల్’ను పాడడంతో పాటు అక్కడున్న వారందరిచేత డ్యాన్స్ చేయించడంతో కార్యక్రమం ముగిసింది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement