
అతడే ఒక సైన్యం
కోహ్లికే ఎలా సాధ్యమైంది... మళ్లీ అంతే అలవోకగా, అదే ఒత్తిడిలోనూ ఎక్కడా మనసు చెదరకుండా అతను మాత్రమే ఎలా ఆడగలడు. నా బ్యాటింగ్‌లో మ్యాజిక్ లేదని కోహ్లి స్వయంగా చెప్పుకోవచ్చు గాక... కానీ ఇలాంటి ఆటను మ్యాజిక్ అనకుండా ఏం చెప్పగలం. మరో లోకంనుంచి వచ్చినట్లుగా మరెవరికీ సాధ్యం కానట్లుగా అంత సునాయాసంగా షాట్లు ఆడేస్తుంటే బౌలర్లు మాత్రం ఏం చేయగలరు, ఎలాంటి ప్రత్యర్థి అయినా తలవంచక ఏం చేస్తుంది. పూజా పునస్కారాలకు దూరం అని సరదాగా చెప్పుకోవచ్చు... కానీ మైదానంలో దిగితే దీక్ష బూనిన రుషిలా ఎంతటి పట్టుదల, ఎంతటి గాంభీర్యం, లక్ష్యం చేరే వరకు పట్టు వీడని అచంచల ఆత్మవిశ్వాసం.
సమకాలీన క్రికెట్‌లో అతనితో పోల్చేందుకు స్మిత్‌లు, రూట్‌లు, విలియమ్సన్‌ల పేర్లు ఏవేవో చెబుతున్నారు. కానీ లక్ష్యాన్ని చేర్చడంలో వారితో పోలిస్తే విరాట్ ఎక్కడో అందనంత ఎత్తులో ఉన్నాడు. ప్రశంసలు కురిపిస్తూ, అతని ఆటను పొగుడుతూ ఎంతో మంది అలసిపోతున్నారు. కానీ పరుగులు తీయడంలో మాత్రం తను అలసిపోవడం లేదు. జట్టు గెలిచిన సమయంలో అతని భావోద్వేగాలు చూస్తే ఒక విజయానికి అతను ఎంతగా ప్రాణం ఒడ్డుతాడో అర్థమవుతుంది.
బౌండరీల వర్షం...
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఆరంభంలో హాజల్‌వుడ్ బౌలింగ్‌లో వరుసగా కొట్టిన మొదటి రెండు ఫోర్లు చూస్తే ఏదో బ్యాట్ సరిచేసుకుంటూ ఆడినంత సులభంగా అనిపించాయి. పరిస్థితి చక్క బెడుతూ సింగిల్స్‌కే పరిమితమై, కొద్ది సేపటికి మరో ఫోర్, సిక్స్ తర్వాత 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తయింది. కానీ ఎలాంటి భావోద్వేగాలు లేవు. ఇంకా కర్తవ్యం పూర్తి కాలేదు. చేయాల్సిన పని మిగిలే ఉంది. అప్పుడు మొదలైంది ఫాల్క్‌నర్ ఓవర్. షార్ట్ బాల్ వేస్తే ఫోర్, యార్కర్ వేస్తే పక్కకు జరిగి ఆడి మరో బౌండరీ, ఆ వెంటనే ముందుకు దూసుకొచ్చి భారీ సిక్సర్. పాపం ఆసీస్ కెప్టెన్ స్మిత్‌కు ఏమీ పాలుపోవడం లేదు.
ఏదో అపనమ్మకంగానే కూల్టర్‌నీల్‌కు బంతి అప్పగించాడు. వరుసగా నాలుగు బంతులు... పాయింట్, ఫైన్ లెగ్, ఎక్స్‌ట్రా కవర్, కవర్స్‌లపై నాలుగు ఫోర్లు పడ్డాయి. ఏ దిక్కున వేసినా నాకు దిక్కు లేదు అన్నట్లుగా కనిపించింది బౌలర్ మొహం. అంతటితో ఆగిపోయాడా... మధ్యలో మంచింగ్‌లాగా ఇంతటి ఉత్కంఠ స్థితిలో అవతలి వైపు అన్నలాంటి ధోని అండగా ఉండగా వికెట్ల మధ్య పరుగెత్తడాన్ని చిన్నపిల్లల ఆటలా మార్చేశాడు కోహ్లి. చరిత్రలో గొప్ప క్రికెటర్ల కథలు ఎన్నో వినిపించవచ్చు. కానీ ఇలాంటి ఆటతో ఆడితే ఈతరంలో అతను ఉంటే చాలు మిగతా పది మంది లేకున్నా మ్యాచ్ ఆడేయవచ్చు అన్నట్లుగా సాగుతున్న కోహ్లి ఆటకు హ్యాట్సాఫ్
► 6 టి20ల్లో ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇది వరుసగా ఆరో విజయం
ప్రతి మ్యాచ్‌లో సవాల్ ఎదురు కావడం ఆటగాడిగా మనల్ని తీర్చి దిద్దుతుంది. ఈ ఇన్నింగ్స్ నా టాప్-3లలో ఒకటి. ఇంకా చెప్పాలంటే ది బెస్ట్ అనవచ్చు. ఎందుకంటే ఇంత ఉద్వేగానికి ఎప్పుడూ గురి కాలేదు. - విరాట్ కోహ్లి
ఈ మ్యాచ్‌తో ఆస్ట్రేలియా స్టార్ షేన్ వాట్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పాడు. బుధవారం ఢిల్లీలో జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్; గురువారం ముంబైలో జరిగే రెండో సెమీస్‌లో వెస్టిండీస్‌తో భారత్ ఆడతాయి.