రాంచీ: మూడు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికాను వైట్‌వాష్ చేసిన టీమిండియా ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆగ్రస్థానాన్ని మరింత బలపరుచుకుంది. ఇక ఈ టెస్టు సిరీస్‌లో భారత బౌలర్లు 60 వికెట్లు పడగొట్టగా అందులో పేస్ బౌలర్లే 26 వికెట్లు దక్కించుకోవడం విశేషం. అత్యధికంగా మహ్మద్ షమీ 13 వికెట్లతో భారత బౌలింగ్ దళానికి నాయకత్వం వహించాడు. ఆ తర్వాత కేవలం చివరి రెండు టెస్టుల్లోనే ఉమేశ్ యాదవ్ 11 వికెట్లు దక్కించుకోవడం విశేషం. అయితే ఈ సిరీస్‌లో భారత్‌కు లాభించిన మరో అంశం టెయిలెండర్లు బ్యాట్‌తో రాణించడం. ముఖ్యంగా రాంచీ టెస్టులో ఉమేశ్ యాదవ్ సిక్సర్ల మోతతో పాటు షమీ కూడా తన బ్యాట్‌కు పనిచెప్పడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించగలిగింది.
అయితే దీనిపై మ్యాచ్ అనంతరం మహ్మద్ షమీ మాట్లాడాడు. ‘గతంలో మేము(బౌలర్లు) బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రత్యర్థి బౌలర్ల ట్యూన్‌కు డ్యాన్స్‌లు చేసేవాళ్లం. ఇప్పుడు రోజులు మారాయి. మేము బ్యాట్‌తో కూడా సమాధానం చెప్పగలం. బౌలర్లు కూడా బ్యాటింగ్ చేయగలరని తాజా సిరీస్‌లు రుజువు చేశాయి. అంతేకాకుండా మేము బ్యాటింగ్‌లో రాణిస్తున్నప్పుడు ప్రత్యర్థి బౌలర్లు, మా టీమ్ సభ్యులు డ్యాన్స్‌లు చేయడం సంతోషంగా ఉంది’ అని షమీ పేర్కొన్నాడు.
ఇక రాంచీ టెస్టులో సిక్సర్ల మోతపై ఉమేశ్ యాదవ్ స్పందించాడు. ‘చాలా రోజుల తర్వాత మ్యాచ్ ఆడాను. ఈ సమయంలో సారథి విరాట్ కోహ్లి నాకు పూర్తి స్వేచ్చనిచ్చాడు. బంతిని బ్యాట్‌తో కసి తీరా బాదమని చెప్పాడు. రాంచీ టెస్టులో నా బ్యాటింగ్‌ను చాలా ఎంజాయ్ చేశా’ అంటూ ఉమేశ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక భారత బౌలర్ల ప్రదర్శనపై ముఖ్యంగా పేస్ విభాగంపై కోచ్ రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. స్పిన్ ట్రాక్‌లపై కూడా రాణించగలమని వారు నిరూపించారని, అదేవిధంగా ప్రత్యర్థి బౌలర్లు పూర్తిగా విఫలమైన చోట మన వాళ్లు గొప్పగా రాణించడం ఆనందంగా ఉందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment