టెస్టు, వన్డే సిరీస్‌లను భారత్ క్లీన్‌స్వీప్ చేయడంతో మిగిలిన ఏకైక టి20లోనూ సహజంగా టీమిండియానే ఫేవరెట్. ఇందులోనూ గెలిస్తే భారత్‌కు ఈ పర్యటన చిరస్మరణీయంగా నిలుస్తుంది. ఏ రకంగా చూసినా శ్రీలంక కంటే భారతే అత్యంత పటిష్టంగా ఉంది. దీనికి కొలమానం చెప్పాలంటే అడుగు కాదు ఏకంగా ఓ మైలు దూరమంత మెరుగైన స్థితిలో ఉంది భారత్. లంక మేటి జట్టునే బరిలోకి దించినా కోహ్లి సేనను ఓడించడం అంత ఆషామాషీ కాదు. గాయాలు, నిషేధాలు (తరంగ) చాలవన్నట్లు కెప్టెన్ల మార్పు లంక కొంపముంచింది. ఇలాంటి అనిశ్చితి వల్ల డ్రెస్సింగ్ రూమ్‌లో జవాబుదారీతనం ఉండదు. ఆటగాళ్ల ఆత్మస్థైర్యం, విశ్వాసం సన్నగిల్లుతాయి.
వెన్నుతట్టి ప్రోత్సహించే సమర్థ నాయకుడు లేక మైదానంలో ఒత్తిడి పెరుగుతుంది. మొత్తానికి ఈ క్లీన్‌స్వీప్ విజయాల క్రెడిట్ అంతా భారత ఆటగాళ్లదే. వాళ్లు ఏ దశలోనూ పట్టు సడలించలేదు. లంకను ఓడించేందుకు అన్ని రకాల ప్రయోగాల్లో సఫలమయ్యారు. అయితే 50 ఓవర్ల మ్యాచ్ కంటే టి20 చాలా భిన్నమైంది. కొన్ని అద్భుతమైన డెలివరీలు చాలు మ్యాచ్ చేజారడానికి... చేజిక్కించుకోడానికి! ఇక్కడ ఏదైనా వేగంగానే జరుగుతుంది. పుంజుకోవడానికి ఆస్కారమూ తక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏకైక టి20 మ్యాచ్ ఎవరిదైనా కావొచ్చు. అయితే లంక నుంచి భారత్‌కు కొత్తగా వచ్చే ఆశ్చర్యకర ఉత్పాతలేవీ లేవనే అనుకుంటున్నా.
రెండో వన్డేలో ధనంజయ మ్యాజిక్‌ను తట్టుకుని కూడా భారత్ గెలిచింది. ఆటగాళ్ల ఫామ్ అసాధారణంగా ఉంది. కోహ్లి, రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో దంచేస్తున్నారు. మిగతావారు సహాయక పాత్రను సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు బ్యాటింగ్ చేసినా... తర్వాత ఛేజింగ్‌కు దిగినా ఎలాంటి సమస్య ఉండబోదు. బౌలింగ్‌లో భువనేశ్వర్ లంకేయుల్ని కట్టడి చేసిన తీరు... స్పిన్నర్లు ఆక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లు తిప్పేసిన వైనం బాగుంది. దీంతో టెస్టులు, వన్డేల కంటే మరింత రాటుదేలిన బృందంతో టీమిండియా టి20ని ఆడబోతుంది .
- సునీల్ గావస్కర్
విజయంతో ముగిస్తే...
Published Tue, Sep 5 2017 12:28 AM | Last Updated on Tue, Sep 12 2017 1:51 AM
Advertisement
Advertisement