
భారత్ ‘ఎ’కు కఠిన పరీక్ష
♦ నేడు ఆసీస్ ‘ఎ’తో అమీతుమీ
♦ ముక్కోణపు సిరీస్
చెన్నై : ఆస్ట్రేలియా ‘ఎ’ చేతిలో అనధికార టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్ ‘ఎ’ జట్టుకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా నేడు (శుక్రవారం) జరిగే మ్యాచ్‌లో కంగారులతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. సీనియర్ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న భారత కుర్రాళ్లకు ఇది మంచి అవకాశంగా భావించొచ్చు. మనీష్ పాండే, కేదార్ జాదవ్, సంజూ శామ్సన్, కరుణ్ నాయర్, కర్ణ్ శర్మలాంటి ఆటగాళ్లు ఇందులో రాణించి సెలక్టర్ల దృష్టిలో పడాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఢిల్లీ ప్లేయర్ ఉన్ముక్త్ చంద్‌కు ఈ సిరీస్ కఠిన పరీక్షగా మారింది.
కెప్టెన్సీతో పాటు జట్టు బ్యాటింగ్ భారం కూడా తనపైనే ఆధారపడి ఉండటంతో ఎలాగైనా రాణించాలని పట్టుదలగా ఉన్నాడు. చెపాక్ వికెట్ స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దించాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. సొంతగడ్డపై ఆడుతుండటం భారత్‌కు కలిసొచ్చే అంశంకాగా.. మిస్టర్ డిపెండబుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉండటం కాస్త ఊరటనిస్తోంది. జట్టులో మంచి బ్యాట్స్‌మెన్‌కు కొదవలేదని చెప్పిన ఉన్ముక్త్ ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆసీస్ పటిష్టంగా ఉంది. టెస్టు సిరీస్ గెలవడంతో జట్టులో అత్మ విశ్వాసం కూడా బాగా పెరిగిపోయింది.
ఉ. గం. 9 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం