రాంచీ:ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. అదే ఊపును ట్వంటీ 20 సిరీస్ లో కూడా కొనసాగించడానికి సిద్ధమైంది. ఒకవైపు విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత్ జట్టుకు మరింత ఆధిక్యం సాధించాలనే పట్టుదలతో తొలి టీ 20 సన్నద్దమవుతుండగా, కనీసం తమ అదృష్టం ఇక్కడైన మారుతుందనే ఆశతో ఆస్ట్రేలియా బరిలోకి దిగుతోంది. ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ శనివారం రాత్రి గం.7.00 ని.లకు జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగనుంది.
ఆసీస్ తో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను భారత్ 4-1 తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒక్క నాల్గో వన్డేలో మినహా మిగతా వన్డేల్లో భారత్ ఘన విజయాల్ని నమోదు చేసి సిరీస్ ను చేజిక్కించుకుంది. ఈ క్రమంలో విరాట్ సేన రెట్టించిన ఉత్సాహంతో పొట్టి సిరీస్ కు సన్నద్ధమైంది. దీనిలో భాగంగా తొలి ట్వంటీ 20లోనే విజయం సాధించి ఆసీస్ ను ఆందోళనలో నెట్టేందుకు విరాట్ అండ్ గ్యాంగ్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ట్వంటీ 20ల్లో కూడా ఆసీస్ కంటే భారతే బలంగా ఉన్న నేపథ్యంలో తొలి అడుగును ఘనంగా ఆరంభించాలని భావిస్తోంది. చిన్నచిన్న మార్పులతోనే భారత్ టీ 20 పోరుకు సిద్ధమం కావడంతో పాటు కొన్ని ప్రయోగాల్ని చేస్తూ ముందుకు సాగుతుండటం ఇది మరొక ప్రయోగాల సిరీస్ గా చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకూ ఆటగాళ్లను పదే పదే మార్చి వారి ప్రతిభను అన్ని కోణాల్లో విశ్లేషించడానికి ఈ సిరీస్ ను వేదికగా చేసుకునేందుకు సిద్ధమైంది.
ఇదిలా ఉంచితే, ఇప్పటివరకూ రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఒక ట్వంటీ 20 మ్యాచ్ మాత్రమే జరిగింది. గతేడాది ఫిబ్రవరిలో శ్రీలంకతో ఇక్కడ ట్వంటీ 20 జరగ్గా అందులో భారత్ 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. ట్వంటీ 20లో యావరేజ్ స్కోరు, అత్యధిక స్కోరు 196 కాగా, అత్యల్ప స్కోరు 127. మరొకవైపు ఇక్కడ జరిగిన నాలుగు వన్డేల్లో భారత్ రెండింట విజయం సాధించగా, ఒక దాంట్లో ఓటమి పాలైంది. మరొక మ్యాచ్ లో ఫలితం రాలేదు.
వాతావరణం..
ఆకాశం మేఘావృతం అయినప్పటికీ మ్యాచ్ కు ఆటకం కల్గించకపోవచ్చు. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ గా, కనిష్టం 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉంది. కాకపోతే చల్లటి గాలులు వీచే అవకాశాలున్నాయి.
తుది జట్లు అంచనా:
భారత్: విరాట్ కోహ్లి(కెప్టెన్),రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, బూమ్రా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఆశిష్ నెహ్రా
ఆస్ట్రేలియా:స్టీవ్ స్మిత్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్, ట్రావిస్ హెడ్, మ్యాక్స్ వెల్, డాన్ క్రిస్టియన్, నాథన్ కౌల్టర్ నైల్, కమిన్స్ ,హెన్రిక్యూస్, కేన్ రిచర్డ్ సన్, ఆడమ్ జంపా
Comments
Please login to add a commentAdd a comment