ముంబై: ఈ సీజన్‌లో భారత క్రికెట్ జట్టు విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ ముగియగానే న్యూజిలాండ్ ఇక్కడికి రానుంది. న్యూజిలాండ్‌తో సిరీస్ పూర్తికాగానే శ్రీలంక జట్టు అడుగు పెట్టనుంది. ఇటీవలే శ్రీలంకలో పర్యటించి మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ సిరీస్‌ను 9–0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్... సొంతగడ్డపై మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడనుంది.
ఈ సిరీస్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం విడుదల చేసింది. నవంబర్ 16న మొదలయ్యే ఈ సిరీస్ డిసెంబర్ 24తో ముగుస్తుంది. మూడు వన్డేల్లో భాగంగా చివరిదైన మూడో వన్డేకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా నిలువనుంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీసీ–వీడీసీఏ మైదానం వేదికగా జరగనున్న ఏడో వన్డే కానుంది. ఈ మైదానంలో భారత్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం విశేషం.