మెల్బోర్న్: భారత-ఆసీస్ జట్ల మధ్య జరుగనున్న మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్ ను హిందీ భాషలో ప్రసారం చేయడానికి క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నడుంబిగించింది. సీఏ లైవ్ యాప్, క్రికెట్.కామ్ ద్వారా సిరీస్ ను హిందీ భాషలో ప్రసారం చేయనున్నారు. ఇందుకు భారత్ కు చెందిన సదరు మీడియా గ్రూప్ తో సీఏ ఒప్పందం కుదుర్చుకుంది.
దీనిపై సీఏ మీడియా ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ బెన్ అమర్ ఫియో మాట్లాడుతూ... ఇక్కడ ఉండే భారతీయ అభిమానుల్ని ఆస్ట్రేలియా క్రికెట్ కు మరింత దగ్గర చేయడంలో భాగంగానే హిందీలో ప్రసారానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. ఇది ఆస్ట్రేలియా క్రికెట్ టెలివిజన్ ప్రసారాల 80 ఏళ్ల చరిత్రలోనే తొలిసారి అని బెన్ స్పష్టం చేశారు. జనవరి 26(మంగళవారం) తొలి ట్వంటీ 20 అడిలైడ్ లో జరిగే మ్యాచ్ నుంచే ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.