
భారత్‌కు ఏడు పతకాలు
న్యూఢిల్లీ: ఆసియా రోయింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు రాణించారు. చైనాలోని బీజింగ్‌లో సోమవారం ముగిసిన ఈ ఈవెంట్‌లో భారత్‌కు ఐదు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు వచ్చాయి. కపిల్ శర్మ, జస్వీందర్ సింగ్, రాజేశ్ వర్మ, మొహమ్మద్ ఆజాద్‌లతో కూడిన భారత బృందం పురుషుల ఫోర్స్ విభాగంలో రజతం నెగ్గింది. పురుషుల సింగిల్ స్కల్ విభాగంలో దత్తూ బబన్ రజతం సాధించాడు.
లైట్ వెయిట్ పురుషుల డబుల్ స్కల్స్ విభాగంలో విక్రమ్ సింగ్, షోకిందర్ తోమర్ జంట రజతం సొంతం చేసుకుంది. పురుషుల ఎయిట్, డబుల్ స్కల్స్ ఈవెంట్స్‌లోనూ భారత్‌కు రజతాలు లభించాయి. పెయిర్స్ విభాగంలో దవిందర్ సింగ్, నవీన్ కుమార్... లైట్ వెయిట్ సింగిల్ స్కల్స్‌లో దుష్యంత్ కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. భారత రోయింగ్ జట్టు సభ్యులందరూ హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ జలాల్లో చీఫ్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఇస్మాయిల్ బేగ్ పర్యవేక్షణలో సాధన చేస్తారు.