లాంఛనం పూర్తయింది | India Beat Sri Lanka By 78 Runs In Final | Sakshi
Sakshi News home page

లాంఛనం పూర్తయింది

Published Sat, Jan 11 2020 1:31 AM | Last Updated on Sat, Jan 11 2020 10:27 AM

India Beat Sri Lanka By 78 Runs In Final  - Sakshi

ఊహించిన ఫలితమే..! దుర్బేధ్యమైన భారత జట్టు ముందు నిలవడం శ్రీలంకకు సాధ్యం కాదని మళ్లీ తేలిపోయింది. కనీస పోరాటపటిమ కూడా లేకుండా ప్రత్యర్థి చేతులెత్తేయడంతో కోహ్లి సేన ఖాతాలో మరో సిరీస్‌ విజయం చేరింది. ముందుగా బ్యాటింగ్‌లో సమష్టి ప్రదర్శనతో భారీ స్కోరు చేసి ఆపై పదునైన బౌలింగ్‌తో చెలరేగిన టీమిండియా సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గత మ్యాచ్‌లాగే చివరి టి20లోనూ పేలవంగా ఆడిన లంక భారత గడ్డపై ఓటమి లాంఛనాన్ని పూర్తి చేసుకుంది. 2008లో శ్రీలంక గడ్డపై టెస్టు సిరీస్‌ కోల్పోయిన తర్వాత లంకతో మూడు ఫార్మాట్‌లలో కలిపి 19 సిరీస్‌లతో తలపడిన భారత్‌ 17 గెలవగా, మరో 2 ‘డ్రా’ అయ్యాయి. ఓడిపోవడానికే వచ్చామన్నట్లుగా తాజా పర్యటనలో మలింగ బృందం ఆడగా, భారత్‌ ఆధిపత్యం ఎలాంటిదో స్పష్టంగా కనిపించింది.   

పుణే: కొత్త ఏడాదిని మరో సిరీస్‌ విజయంతో భారత్‌ ప్రారంభించింది. శ్రీలంకతో ముగిసిన మూడు మ్యాచ్‌ల టి20 పోరును టీమిండియా 2–0తో సొంతం చేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన చివరి టి20లో భారత్‌ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (36 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్‌), శిఖర్‌ ధావన్‌ (36 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 65 బంతుల్లోనే 97 పరుగులు జోడించడం విశేషం. చివర్లో మనీశ్‌ పాండే (18 బంతుల్లో 31 నాటౌట్‌; 4 ఫోర్లు), విరాట్‌ కోహ్లి (17 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శార్దుల్‌ ఠాకూర్‌ (8 బంతుల్లో 22 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్సర్లు) కీలక పరుగులు జోడించారు.

అనంతరం శ్రీలంక 15.5 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. ధనంజయ డిసిల్వా (36 బంతుల్లో 57; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించగా, ఏంజెలో మాథ్యూస్‌ (20 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 37 బంతుల్లో 68 పరుగులు జత చేశారు. అయితే ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ మినహా మిగతావారిలో ఒక్కరూ కనీసం రెండంకెల స్కోరు చేయలేకపోయారు. నవదీప్‌ సైనీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ పురస్కారం లభించింది.  

ధావన్‌ జోరు...
వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటూ తీవ్ర ఒత్తిడిలో ఉన్న ధావన్‌ కీలక సమయంలో ధాటైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 1 పరుగు వద్దే తను ఇచి్చన క్యాచ్‌ను షనక వదిలేయడంతో బతికిపోయిన భారత ఓపెనర్‌ ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. మలింగ ఓవర్లో రెండు ఫోర్లు బాదిన అతను, లాహిరు వేసిన తర్వాతి ఓవర్లోనూ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. హసరంగ బౌలింగ్‌లో స్లాగ్‌ స్వీప్‌తో శిఖర్‌ కొట్టిన సిక్సర్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ క్రమంలో 34 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే ఆ వెంటనే అతను మరో భారీషాట్‌కు ప్రయతి్నంచి వెనుదిరిగాడు. రాహుల్‌ ఫామ్‌ ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. మాథ్యూస్‌ ఓవర్లో రెండు ఫోర్లతో దూకుడు మొదలు పెట్టిన అతను ధనంజయ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ బాదాడు. 34 బంతుల్లోనే రాహుల్‌  కూడా హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే సందకన్‌ బౌలింగ్‌లో కుశాల్‌ స్టంపింగ్‌కు రాహుల్‌ వెనుదిరగాల్సి వచి్చంది.  

ఆకట్టుకున్న పాండే...
తొలి వికెట్‌కు భారీ భాగస్వామ్యం తర్వాత భారత్‌ 25 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. నాలుగున్నరేళ్ల తర్వాత భారత్‌ తరఫున ఆడిన సంజు సామ్సన్‌ (6) అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోగా, శ్రేయస్‌ అయ్యర్‌ (4) విఫలమయ్యాడు. ఈ దశలో పాండే తన ఆటతో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. తన బలమైన బ్యాక్‌ఫుట్‌పై నియంత్రణతో ఆడుతూ అతను ముచ్చటైన బౌండరీలు కొట్టాడు. ఆరో స్థానంలో బరిలోకి దిగిన కోహ్లి కూడా తనదైన శైలిలో వేగంగా పరుగులు జోడించాడు. వీరిద్దరు 28 బంతుల్లో 42 పరుగులు జోడించిన అనంతరం కోహ్లి రనౌటయ్యాడు. సుందర్‌ (0) తొలి బంతికే అవుట్‌ కాగా, చివర్లో శార్దుల్‌ మెరుపు బ్యాటింగ్‌తో భారత్‌ స్కోరు 200 పరుగులు దాటింది. కుమార వేసిన ఆఖరి ఓవర్లోనే భారత్‌కు 20 పరుగులు వచ్చాయి. పాండే, శార్దుల్‌ 14 బంతుల్లోనే అభేద్యంగా 37 పరుగులు జత చేశారు.  

ఇద్దరు మినహా...
భారీ లక్ష్యఛేదనలో ఎప్పటిలాగే శ్రీలంక తడబడింది. పవర్‌ప్లే ముగిసేలోపే జట్టు నాలుగు వికెట్లు చేజార్చుకుంది. తొలి ఓవర్లోనే గుణతిలక (1)ను బుమ్రా అవుట్‌ చేయగా, శార్దుల్‌ వేసిన తర్వాతి ఓవర్లో అవిష్క (9) వెనుదిరిగాడు. పాండే చక్కటి ఫీల్డింగ్‌కు ఒషాడా (2) రనౌట్‌ కాగా...సైనీ అద్భుత యార్కర్‌తో కుశాల్‌ పెరీరా (7) స్టంప్స్‌ను పడగొట్టాడు. ఈ స్థితిలో మాథ్యూస్, ధనంజయ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత టి20 బరిలోకి దిగిన సీనియర్‌ మాథ్యూస్‌ కొన్ని చూడచక్కటి షాట్లు బాదాడు. ముఖ్యంగా సుందర్‌ ఓవర్లో మాథ్యూస్‌ రెండు భారీ సిక్సర్లు, ఫోర్‌ బాదడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి.

అయితే సుందర్‌ తర్వాతి ఓవర్లో మరో సిక్స్‌ కొట్టిన అనంతరం భారీ షాట్‌కు ప్రయతి్నంచి మాథ్యూస్‌ అవుటయ్యాడు. మరోవైపు ధనంజయ ఎదురుదాడి బ్యాటింగ్‌ కూడా ఆకట్టుకుంది. సైనీ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను చహల్‌ బౌలింగ్‌లో లాంగాఫ్‌ మీదుగా బాదిన సిక్సర్‌ లంక ఇన్నింగ్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా కనిపించింది. 31 బంతుల్లోనే ధనంజయ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 29 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయి శ్రీలంక ఓటమిని ఆహ్వానించింది.  

*భారత కెప్టెన్‌గా మూడు ఫార్మాట్‌లలో కలిపి కోహ్లి 11 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. పాంటింగ్‌ (252)ను అధిగమించి అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో (196) ఈ ఘనత సాధించిన కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు.  

*భారత్‌ తరఫున టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా (53) నిలిచాడు. అశ్విన్‌ (52), చహల్‌ (52) ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్నారు.  

*భారత్‌  ఇప్పటివరకు కనీసం మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లు 15 ఆడింది. 13 గెలిచింది. ఒక దానిని ‘డ్రా’ చేసుకుంది. ఒకే ఒక్క సిరీస్‌ను (2019లో కివీస్‌ చేతిలో) కోల్పోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement