ఉత్కంఠ పోరులో టీమిండియాదే గెలుపు
కటక్:మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా చెమటోడ్చి నెగ్గింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో భారత్ చివరి వరకూ పోరాడి గెలిచింది. భారత్ విసిరిన 382 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ గెలుపు అంచుల వరకూ వచ్చి ఓటమి పాలైంది. ఇంగ్లండ్ 366 పరుగులకే పరిమితమై 15 పరుగుల తేడాతో పరాజయం చెందింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ ఉండగానే భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఆద్యంతం భారత్ కు దీటుగా బదులిచ్చిన ఇంగ్లండ్ తన పోరాటాన్ని కడవరకూ కొనసాగించింది.
ఇంగ్లండ్ ఆటగాళ్లలో జాసన్ రాయ్(82), రూట్(54), మొయిన్ అలీ(55), ఇయాన్ మోర్గాన్(102) లు రాణించినా జట్టును ఓటమి నుంచి రక్షించలేకపోయారు. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు సాధించగా, బూమ్రా కు రెండు, భువనేశ్వర్ కుమార్, జడేజాలకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 381 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్(5), కోహ్లి(8),శిఖర్ ధవన్(11)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరి తీవ్రంగా నిరాశపరిచినా.. యువరాజ్ సింగ్-మహేంద్ర సింగ్ ధోనిల జోడి ఆదుకుంది. ఒకవైపు బాధ్యత, మరొకవైపు ఫుల్ జోష్తో చెలరేగిపో్యిన ఈ జోడి 256 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని సాధించారు. ఇది నాల్గో వికెట్ కు ఇంగ్లండ్ అత్యధిక భాగస్వామ్యంగా నమోదైంది. ఈ క్రమంలోనే యువరాజ్ (150), ధోని(134)లు శతకాలతో మెరిశారు.
తొలి హాఫ్ సెంచరీ చేయడానికి 56 బంతులను ఎదుర్కొన్న యువీ.. రెండో హాఫ్ సెంచరీ చేయడానికి 42 బంతులను తీసుకున్నాడు. అయితే మూడో అర్థ శతకాన్ని మాత్రం యువీ 29 బంతుల్లోనే పూర్తి చేసి నిష్క్రమించాడు. ఇది యువరాజ్ కెరీర్లో 14వ వన్డే సెంచరీ. మరొకవైపు యువరాజ్ కు ధోని చక్కటి సహకారం అందిస్తూ శతకం సాధించాడు. ప్రత్యేకంగా హెలికాప్టర్ షాట్లతో ధోని అలరించాడు. తొలి హాఫ్ సెంచరీ చేయడానికి 68 బంతులను ఎదుర్కొన్న ధోని.. రెండో హాఫ్ సెంచరీ చేయడానికి 38 బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు. ఇది ధోని కెరీర్లో 10వ వన్డే సెంచరీ. ఇక చివర్లో కేదర్ జాదవ్(22),హార్దిక్ పాండ్యా(19 నాటౌట్), జడేజా(16) స్కోరు బోర్డును వేగంగా కదిలించారు. దాంతో భారత్ 382 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ కు నిర్దేశించింది.
ధోని సరికొత్త రికార్డు
టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని మరో ఘనత సాధించాడు. వన్డేల్లో 200 సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా ఇప్పటికే కొనసాగుతున్న మహి తన రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. ఈ మ్యాచ్ లో వన్డేల్లో 10వ సెంచరీ సాధించి ‘మిస్టర్ కూల్’ సత్తా చాటాడు. 122 బంతుల్లో 6 సిక్సర్లు, 10 ఫోర్లతో 134 పరుగులు సాధించాడు. స్వదేశంలో 4 వేల పరుగులు పూర్తి చేసిన ఘనత కూడా ధోని దక్కించుకున్నాడు. సచిన్ తర్వాత స్వదేశంలో 4 వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్ గా ధోని నిలిచాడు.
మోర్గాన్ కెప్టెన్ ఇన్నింగ్స్
భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ ఏ దశలోనూ వెనుకంజ వేయలేదు. ఒకవైపు వికెట్లు పడుతున్నా రన్ రేట్ ను కాపాడుకుండూ బ్యాటింగ్ కొనసాగిచింది. ప్రత్యేకంగా ఇంగ్లండ్ కెప్టెన ఇయాన్ మోర్గాన్ కడవరకూ క్రీజ్లో ఉండి జట్టును గెలిపించే యత్నం చేశాడు. 81 బంతుల్లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 102 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో భాగంగా 48 ఓవర్ మూడో బంతికి నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న మోర్గాన్ పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. మోర్గాన్ ను బూమ్రా రనౌట్ చేయడంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చింది.