న్యూఢిల్లీ: భారత జూనియర్ హాకీ అమ్మాయిలు ఐర్లాండ్ పర్యటనను ఘనంగా ముగించారు. మంగళవారం ముగిసిన కాంటర్ ఫ్రిట్జ్‌గెరాల్డ్ అండర్–21 అంతర్జాతీయ నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన భారత అమ్మాయిలు... ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధించారు. లాల్‌రిండికా, ఇషికా చౌదరీ, ముంతాజ్ తలా ఓ గోల్ సాధించడంతో భారత్ 3–1తో ఐర్లాండ్‌పై గెలుపొందింది. తొలి క్వార్టర్‌లో ఇరు జట్లు అటాకింగ్ బదులుగా డిఫెన్స్‌కే ప్రాధాన్యత ఇవ్వడంతో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. రెండో క్వార్టర్‌లో జోరు పెంచిన భారత్ అందివచ్చిన పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకుంది. లాల్‌రిండికా పెనాల్టీని గోల్‌గా మలచడంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఇదే క్వార్టర్‌లో లభించిన మరో పెనాల్టీ కార్నర్‌ను ఇషికా చౌదరీ గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. ఈ దశలో పెద్ద ఎత్తున వచ్చిన వర్షం వల్ల ఆటకు ఆటంకం కలిగింది. విరామం తర్వాత పుంజుకున్న ఐర్లాండ్ దూకుడుగా ఆడింది. అయితే నిమిషాల వ్యవధిలో లభించిన రెండు పెనాల్టీ కార్నర్ అవకాశాలను ఐర్లాండ్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. భారత గోల్ కీపర్ ఖుష్బూ వారి ప్రయత్నాలను విఫలం చేసింది. తర్వాత లభించిన మరో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచిన ఐర్లాండ్ గోల్ ఖాతా తెరిచింది. కానీ వెంటనే ముంతాజ్ చేసిన గోల్‌తో భారత్ పటిష్ట స్థితిలో నిలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment