ఫుణే : న్యూజిలాండ్ తో తొలి వన్డేలో ఎదురైన ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఇక్కడ జరిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో కివీస్ పై విరాట్ సేన ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 231 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలుండగానే చేరుకుంది. అంతకుమందు టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లాడి 9 వికెట్లు నష్టపోయి 230 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ(7) సిరీస్ లో మరోసారి విఫలమైనా.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (84 బంతుల్లో 68: 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ ప్రమోషన్ పొందిన దినేశ్ కార్తీక్ (64 నాటౌట్) లు హాఫ్ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ కోహ్లీ(29 బంతుల్లో 29: 3 ఫోర్లు, 1 సిక్స్) ఔటయ్యాక క్రీజులోకొచ్చిన హార్ధిక్ పాండ్యా (30) పరవాలేదనిపించాడు. ధోని (18)తో కలిసి దినేశ్ కార్తీక్ భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు. కివీస్ బౌలర్లలో సౌధీ, మిల్నే, శాంట్నర్, డి గ్రాండ్ హోమ్మీ తలో వికెట్ తీశారు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్:
నిర్ణీత ఓవర్లాడిన కివీస్ 9 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. ఓపెనర్లు గప్టిల్ (11), మున్రో (10) లను భారత పేసర్ భువీ ఔట్ చేశాడు. గత మ్యాచ్ లో భారీ ఇన్నింగ్స్ లు ఆడిన లాథమ్(38), రాస్ టేలర్ (21) లు ఈ వన్డేలో త్వరగా ఔట్ కావడంతో కివీస్ స్వల్ఫ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లు ఈ మ్యాచ్ లో సమష్టిగా రాణించి కివీస్ ను భారీ స్కోరు చేయకుండా సక్సెస్ అయ్యారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (3) సిరీస్ లో మరోసారి నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ ను సరిదిద్దాలని ఆచితూచి ఆడిన లాథమ్(38) ను అక్సర్ పటేల్ బౌల్డ్ చేయగా, మరో కీలక ఆటగాడు రాస్ టేలర్ (21) పాండ్యా చేతికి చిక్కాడు.
భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆదినుంచి పరుగుల కోసం కివీస్ చెమటోడ్చింది. నికోల్స్ (62 బంతుల్లో 42), డి గ్రాండ్ హోమ్మి(40 బంతుల్లో 41: 5 ఫోర్లు, 1 సిక్స్) క్రీజును అంటిపెట్టుకుని ఉండటంతో కివీస్ రెండొందల మార్కుకు చేరువైంది. చివర్లో టీమ్ సాధీ (22 బంతుల్లో 25 నాటౌట్) బ్యాట్ కు పని చెప్పడంతో కివీస్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. బౌలర బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, చహల్ చెరో రెండు వికెట్లు తీయగా, అక్సర్ పటేల్, హార్దిక్ పాండ్యాలకు ఒక్కో వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment