టీమిండియా ఎట్ టాప్
సిడ్నీ:అంతర్జాతీయ ట్వంటీ 20 ర్యాంకింగ్స్ లో టీమిండియా టాప్ కు చేరుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ 20 గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ధోని సేన ఎనిమిదో స్థానం నుంచి ఒక్కసారిగా పైకి ఎగబాకి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టీమిండియా 120 పాయింట్లతో ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా, ఆస్ట్రేలియా 110 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఇదిలా ఉండగా విండీస్ రెండో స్థానంలో, శ్రీలంక మూడో స్థానంలో, ఇంగ్లండ్ నాల్గో స్థానంలో కొనసాగుతున్నాయి. మరోవైపు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ లు వరుసగా ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో నిలిచాయి. ఆస్ట్రేలియా తరువాతి స్థానాల్లో ఆప్ఘానిస్తాన్, స్కాట్లాండ్లు ఉన్నాయి.
ఆదివారం జరిగిన చివరి టీ 20 మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆసీస్ విసిరిన 198 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి ఛేదించిన టీమిండియా సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఆసీస్ పై వన్డేల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.