అవే తప్పులు | India bowlers need to curb mistakes under pressure | Sakshi
Sakshi News home page

అవే తప్పులు

Published Wed, Jan 29 2014 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM

అవే తప్పులు

అవే తప్పులు

చేసిన తప్పులను సరిదిద్దుకోకపోతే ఫలితాల్లో పెద్దగా మార్పు ఉండదు... భారత క్రికెట్ జట్టు ఈ విషయాన్ని గుర్తించలేకపోయింది. వరుసగా రెండు వన్డేల్లో ఓడి... మూడో మ్యాచ్‌లో చావుతప్పి కన్నులొట్టబోయినట్లుగా టై చేసుకున్నా... అటు బ్యాట్స్‌మెన్, ఇటు బౌలర్లు ఎవరూ మారలేదు. ఫలితంగా నాలుగో వన్డేలోనూ ధోనిసేన చిత్తయింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-0తో న్యూజిలాండ్ వశమయింది.
 
 హామిల్టన్: ‘కీలక సమయంలో వికెట్లను చేజార్చుకోవడం, ఎక్కడ బంతులు వేయాలో బౌలర్లు తెలుసుకోకపోవడం... సిరీస్‌లో ఈ రెండూ మా తప్పులు. వీటిని పునరావృతం చేయడమే నాలుగో వన్డేలోనూ మా కొంపముంచింది’... సిరీస్ ఓటమి తర్వాత ధోని వ్యాఖ్య ఇది. కెప్టెన్ మాటలు పూర్తిగా వాస్తవం. భారత్ ఆల్‌రౌండ్ వైఫ్యల్యంతో... మంగళవారం జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకుంది.
 
 టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 278 పరుగులు చేసింది. రోహిత్ (94 బంతుల్లో 79; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), ధోని (73 బంతుల్లో 79 నాటౌట్, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), జడేజా (54 బంతుల్లో 62 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా... రాయుడు (58 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపిం చాడు.
 
  తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో 3 వికెట్లకు 280 పరుగులు చేసి గెలిచింది. టేలర్ (127 బంతుల్లో 112; 15 ఫోర్లు) సెంచరీ చేయగా.. విలియమ్సన్ (82 బంతుల్లో 60; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రెండన్ మెకల్లమ్ (36 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుగ్గా ఆడారు. టేలర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆఖరి వన్డే శుక్రవారం వెల్లింగ్టన్‌లో జరుగుతుంది.
 
  రో‘హిట్’
 ఈ మ్యాచ్ కోసం భారత్ ధావన్, రైనాల స్థానంలో బిన్నీ, రాయుడులను తెచ్చింది. దీంతో రోహిత్‌తో కలిసి కోహ్లి ఓపెనర్‌గా వచ్చాడు. కోహ్లి (2), రహానే (3) విఫలం కావడంతో భారత్ 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రాయుడు, రోహిత్ మూడో వికెట్‌కు 79 పరుగులు జోడించి ఆదుకున్నారు. నాణ్యమైన క్రికెట్‌తో ఆకట్టుకున్న రాయుడు... బంతి బౌన్స్‌ను అంచనా వేయడంలో విఫలమై అవుటయ్యాడు. రోహిత్ ఓ చెత్త షాట్‌తో వెనుదిరిగాడు. అశ్విన్ కూడా వెంటనే అవుటయ్యాడు. దీంతో భారత్ 151 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. ధోని, జడేజా కొద్దిసేపు జాగ్రత్తగా ఆడి స్లాగ్ ఓవర్లలో చెలరేగారు. దీంతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు లభించింది. చివరి 10 ఓవర్లలో ధోని, జడేజా 100 పరుగులు సాధించడం విశేషం. న్యూజిలాండ్ బౌలర్లలో సౌతీ 2 వికెట్లు తీశాడు.
 
 టేలర్ నిలకడ
 న్యూజిలాండ్ ఓపెనర్లు గుప్టిల్ (27 బంతుల్లో 35; 6 ఫోర్లు, 1 సిక్సర్), రైడర్ (18 బంతుల్లో 19; 4 ఫోర్లు) వేగంగా ఆడి భారత్‌పై ఒత్తిడి పెంచారు. అయితే నాలుగు పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరూ పెవిలియన్‌కు చేరారు. కానీ ఫామ్‌లో ఉన్న విలియమ్సన్, టేలర్ కలిసి మూడో వికెట్‌కు 130 పరుగులు జోడించి భారత్ ఆశలపై నీళ్లు జల్లారు. సిరీస్‌లో వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ అర్ధసెంచరీ చేసిన విలియమ్సన్ అవుటైనా... కెప్టెన్ మెకల్లమ్, టేలర్ కలిసి లాంఛనాన్ని పూర్తి చేశారు. కెరీర్‌లో 9వ సెంచరీ చేసిన టేలర్ కెప్టెన్ మెకల్లమ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు అజేయంగా 92 పరుగులు జోడించాడు.
 
  స్కోరు వివరాలు
 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రోంచీ (బి) విలియమ్సన్ 79; కోహ్లి (సి) నీషమ్ (బి) సౌతీ 2; రహనే (సి) సౌతీ (బి) మిల్స్ 3; రాయుడు (సి) రోంచీ (బి) బిన్నెట్ 37; ధోని నాటౌట్ 79; అశ్విన్ (సి) బిన్నెట్ (బి) సౌతీ 5; జడేజా నాటౌట్ 62; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం: (50 ఓవర్లలో 5 వికెట్లకు) 278.
 
 
 వికెట్ల పతనం: 1-5; 2-22; 3-101; 4-142; 5-151
 బౌలింగ్: మిల్స్ 10-2-42-1; సౌతీ 10-1-36-2; బిన్నెట్ 9-0-67-1; నీషమ్ 8-0-59-0; నాథన్ మెకల్లమ్ 10-0-44-0; విలియమ్సన్ 3-0-26-1
 న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గుప్టిల్ ఎల్బీడబ్ల్యు (బి) షమీ 35; రైడర్ (బి) ఆరోన్ 19; విలియమ్సన్ రనౌట్ 60; టేలర్ నాటౌట్ 112; బి.మెకల్లమ్ నాటౌట్ 49; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (48.1 ఓవర్లలో 3 వికెట్లకు) 280.
 వికెట్ల పతనం: 1-54; 2-58; 3-188
 బౌలింగ్: భువనేశ్వర్ 10-0-62-0; షమీ 8-0-61-1; ఆరోన్ 6.1-0-51-1; జడేజా 10-2-33-0; అశ్విన్ 10-0-41-0; బిన్నీ 1-0-8-0; రాయుడు 3-0-23-0.
 
  బౌలర్లు బుర్ర వాడాలి: ధోని
 ‘వన్డేల్లో కొత్త నిబంధనలను బౌలర్లకు శాపమే. కానీ ఈ పర్యటనలో మేం దానివల్ల ఓడిపోలేదు. చెత్త బౌలింగ్ కొంప ముంచింది. సిరీస్ అంతటా షార్ట్, వైడ్ బంతులే వేశారు. మా బౌలర్లు కాస్త బుర్ర కూడా వాడితే బాగుంటుంది’.
 
 1 12 ఏళ్ల తర్వాత భారత్‌పై సిరీస్ గెలవడం న్యూజిలాండ్‌కు ఇదే తొలిసారి
 
 1 మరొక్క పరుగు చేస్తే ధోని వన్డేల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement