
మైసూర్: ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ పట్టు బిగించింది. ఇరు జట్ల బౌలర్లు శాసించిన రెండో రోజు ఆటలో భారత్ ‘ఎ’కు భారీ ఆధిక్యం లభించింది. గురువారం ఆటలో 17 వికెట్లు కూలాయి. మొదట 282/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 392 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్ (46; 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. జాక్ చాపెల్ 4, బ్రిగ్స్ 3 వికెట్లు తీశారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ లయన్స్ 48.4 ఓవర్లలోనే 140 పరుగులకే కుప్పకూలింది.
ఒలీ పోప్ (25; 2 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగతావారంతా విఫలమయ్యారు. సైనీ, నదీమ్ చెరో 3 వికెట్లు, జలజ్ సక్సేనా, ఆరోన్ చెరో 2 వికెట్లు తీశారు. దీంతో భారత్‌కు 252 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఫాలోఆన్‌లో పడిన లయన్స్ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించగా... ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. హోల్డన్ (5 బ్యాటింగ్), డకెట్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆ జట్టు మరో 228 పరుగులు వెనుకబడి ఉంది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచే అవకాశాలున్నాయి.