ఎన్నాళ్లకెన్నాళ్లకు... | India breeze into ICC World T20 2014 semi-finals with 8-wicket win over Bangladesh | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లకెన్నాళ్లకు...

Mar 29 2014 3:08 AM | Updated on Sep 2 2017 5:18 AM

ఎన్నాళ్లకెన్నాళ్లకు...

ఎన్నాళ్లకెన్నాళ్లకు...

వరుసగా మూడు ప్రపంచకప్‌లలో నాకౌట్ దశకు అర్హత సాధించడంలో విఫలమై తీవ్రంగా నిరాశపరిచిన భారత జట్టు ఈసారి అందరికంటే ముందుగా సెమీస్‌కు చేరింది. బంగ్లాదేశ్‌పై గెలుపుతో గ్రూప్‌లో వరుసగా మూడు విజయాలతో...

టి20 ప్రపంచకప్ సెమీస్‌లో భారత్
 బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల విజయం  కొనసాగిన బౌలర్ల నిలకడ
 రోహిత్, కోహ్లి అర్ధసెంచరీలు
 
 వరుసగా మూడు ప్రపంచకప్‌లలో నాకౌట్ దశకు అర్హత సాధించడంలో విఫలమై తీవ్రంగా నిరాశపరిచిన భారత జట్టు ఈసారి అందరికంటే ముందుగా సెమీస్‌కు చేరింది. బంగ్లాదేశ్‌పై గెలుపుతో గ్రూప్‌లో వరుసగా మూడు విజయాలతో... ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ బెర్త్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే ఖరారు చేసుకుంది. 2007లో తొలి టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన తర్వాత.. మళ్లీ ఇంతకాలానికి ధోనిసేన సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది.
 
 ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
 స్వదేశంలోజరుగుతున్న క్రికెట్ బోర్డు వ్యవహారాల ప్రభావం తమపై ఏ మాత్రం లేదని భారత క్రికెటర్లు నిరూపించారు. అటు, బౌలర్లు, ఇటు బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించి టి20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయం సాధించారు. స్పిన్నర్లు అమిత్ మిశ్రా, అశ్విన్ కలిసి 8 ఓవర్లలో 5 వికెట్లు తీయడం... రోహిత్, కోహ్లిల అద్భుత భాగస్వామ్యంతో... షేరే బంగ్లా స్టేడియంలో శుక్రవారం జరిగిన సూపర్-10 గ్రూప్ ‘2’ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచింది.
 
 వరుసగా మూడో మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన ధోని బౌలింగ్ ఎంచుకోగా....బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అనాముల్ హక్ (43 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ముష్ఫికర్ రహీమ్ (21 బంతుల్లో 24; 4 ఫోర్లు) రాణించారు. చివర్లో మహ్మదుల్లా (23 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్సర్) ఎదురుదాడికి దిగి వేగంగా ఆడటంతో బంగ్లాకు గౌరవప్రదమైన స్కోరు లభించింది. అమిత్ మిశ్రా మూడు, అశ్విన్ రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్, షమీ ఒక్కో వికెట్ పడగొట్టారు.
 
 భారత జట్టు 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 141 పరుగులు చేసి గెలిచింది. ధావన్ (1) విఫలమైనా... రోహిత్ శర్మ (44 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్సర్) ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లి (50 బంతుల్లో 57 నాటౌట్;3 ఫోర్లు, 1 సిక్సర్) కూడా ఫామ్‌ని కొనసాగించాడు. రోహిత్, విరాట్ రెండో వికెట్‌కు 75 బంతుల్లో 100 పరుగులు జోడించారు. చివర్లో ధోని (12 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) చకచకా పరుగులు చేసి విజయాన్ని తొందరగా పూర్తి చేశాడు. బంగ్లా బౌలర్లలో మొర్తజా, అల్ అమీన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
 
 ఆరంభంలోనే పట్టు
 ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే అశ్విన్ రెండు వికెట్లు వరుస బంతుల్లో తీయడం, ఆ తర్వాతి ఓవ ర్లో భువనేశ్వర్ బౌలింగ్‌లో షకీబ్ అవుట్ కావడంతో... పవర్ ప్లే ఆరు ఓవర్లలో బంగ్లాదేశ్ మూడు వికెట్లకు 27 పరుగులు మాత్రమే చేసింది.
 
  దీంతో భారత్‌కు పట్టు దొరికింది.ఓపెనర్ అనాముల్, కెప్టెన్ ముష్ఫికర్ ఎదురుదాడికి దిగినా... భారత బౌలర్లు రెండు ఓవర్ల వ్యవధిలో ఇద్దరినీ అవుట్ చేశారు. మహ్మదుల్లా, నాసిర్ హొస్సేన్ (15) కలిసి పోరాడటంతో బంగ్లాదేశ్ కాస్త గౌరవప్రదమైన స్కోరు సాధించింది. చివరి ఓవర్లో అమిత్ మిశ్రా వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయడం విశేషం.
 
 ఆడుతూ పాడుతూ...
 ఆరంభంలోనే ధావన్ అవుటైనా... ఫామ్‌లో ఉన్న రోహిత్, కోహ్లి కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ముఖ్యంగా రోహిత్ అద్భుతమైన షాట్లతో అలరించాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాక ఇద్దరూ బ్యాట్ ఝళిపించారు.
 
 రోహిత్ 39 బంతుల్లో, కోహ్లి 41 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నారు. వంద పరుగుల సుదీర్ఘ భాగస్వామ్యం తర్వాత రోహిత్ అవుటయ్యాడు. అనూహ్యంగా యువరాజ్ రాకుండా ధోని బ్యాటింగ్‌కు వచ్చాడు. తన ఫామ్‌తో పాటు బ్యాట్‌లను కూడా పరీక్షించుకున్న కెప్టెన్ ధోని... కోహ్లితో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు.
 
 స్కోరు వివరాలు
 బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (సి) రైనా (బి) అశ్విన్ 6; అనాముల్ (బి) అమిత్ మిశ్రా 44; షంషుర్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 0; షకీబ్ (బి) భువనేశ్వర్ 1; ముష్ఫికర్ (సి) కోహ్లి (బి) షమీ 24; నాసిర్ (స్టం) ధోని (బి) అమిత్ మిశ్రా 16; మహ్మదుల్లా నాటౌట్ 33; జియావుర్ (సి) జడేజా (బి) అమిత్ మిశ్రా 0; మొర్తజా నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు  8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 138.
 
 వికెట్ల పతనం: 1-20; 2-20; 3-21; 4-67; 5-82; 6-131; 7-131.
 బౌలింగ్: భువనేశ్వర్ 3-0-21-1; అశ్విన్ 4-0-15-2; షమీ 3-0-29-1; జడేజా 4-0-30-0; రైనా 2-0-11-0; అమిత్ మిశ్రా 4-0-26-3.
 
 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) నాసిర్ (బి) మొర్తజా 56; ధావన్ (బి) అల్ అమిన్ 1; కోహ్లి నాటౌట్ 57; ధోని నాటౌట్ 22; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.3 ఓవర్లలో రెండు వికెట్లకు) 141.
 వికెట్ల పతనం: 1-13; 2-113.
 
 బౌలింగ్: మొర్తజా 4-0-23-1; సోహాబ్ 3-0-21-0; అల్ అమిన్ 4-0-38-1; షకీబ్ 4-0-26-0; జియావుర్ 2.3-0-26-0; మహ్మదుల్లా 1-0-7-0.
 
 ప్రస్తుతం భారత్ ఖాతాలో మూడు విజయాలతో ఆరు పాయింట్లు ఉన్నాయి. ఆరు పాయింట్లు సాధించగలిగే అవకాశం ఈ గ్రూప్‌లో ఇక వెస్టిండీస్, పాకిస్థాన్‌లలో ఏదో ఒక జట్టుకు మాత్రమే ఉంది. కాబట్టి వేరే సమీకరణాలతో సబంధం లేకుండా భారత్ సెమీస్‌కు చేరినట్లే. వెస్టిండీస్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఆడుతుంది. ఈలోగా పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్‌తో ఒక మ్యాచ్ ఆడాలి. ఒకవేళ బంగ్లాదేశ్ గనక పాకిస్థాన్‌ను ఓడిస్తే... ఆస్ట్రేలియాకు కూడా అవకాశం ఉంటుంది. లేదంటే పాక్, వెస్టిండీస్‌లలో ఒక జట్టు భారత్‌తో పాటు సెమీస్‌కు చేరుతుంది.
 
 నంబర్‌వన్‌గా భారత్
 బంగ్లాదేశ్‌పై విజయంతో ప్రపంచకప్ సెమీస్‌లోకి అడుగు పెట్టిన భారత్‌కు మరో బోనస్ కూడా లభించింది. ఈ మ్యాచ్ అనంతరం ఐసీసీ తాజా టి20 టీమ్ ర్యాంకింగ్స్‌లో ధోని నాయకత్వంలోని భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. మొత్తం 129 రేటింగ్ పాయింట్లతో టీమిండియా నంబర్‌వన్‌గా నిలిచింది. ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న శ్రీలంక (128 రేటింగ్ పాయింట్లు) రెండో స్థానానికి దిగజారింది. పాకిస్థాన్ మూడో స్థానంలో కొనసాగుతోంది.
 
 ఇప్పటిదాకా మా ప్రదర్శన బాగుంది. కానీ ఇంకా మెరుగుపడటానికి కూడా స్కోప్ ఉంది. నాకు కూడా మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం అనే బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చాను. జడేజా, అశ్విన్ తప్ప అందరికీ ప్రాక్టీస్ దొరికింది. సెమీస్‌కు చేరాలనే లక్ష్యం ఏమీ లేదు. ప్రతి మ్యాచ్‌లోనూ బాగా ఆడాలనే వచ్చాం. డ్రెస్సింగ్ రూమ్‌లో మంచి వాతావరణం ఉంది. ఒకరి విజయాన్ని మరొకరు ఆస్వాదిస్తారు. భారత జట్టుకు ఆడేటప్పుడు శక్తిమేరా రాణించడం క్రికెటర్ బాధ్యత. అందుకే బయట ఏం జరిగినా ఆ ప్రభావం మా ఆటపై ఉండదు’     
 - ధోని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement