
భారత్ జింబాబ్వే సిరీస్ రద్దు!
న్యూఢిల్లీ: వచ్చే నెలలో భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటన రద్దయింది. ఈ మేరకు సోమవారం బీసీసీఐ సోమవారం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బీసీసీఐకు క్రికెట్ ప్రచారక బ్రాడ్ కాస్టింగ్ సంస్థ టెన్ స్పోర్ట్స్, జింబాబ్వే బ్రాడ్ కాస్టింగ్ సంస్థకు మధ్య కొన్ని వివాదాలు నెలకొన్న నేపథ్యంలో వాటిని పరిష్కరించుకున్నాకే తుది నిర్ణయం వెలువరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రచార హక్కులకు సంబంధించి ఒప్పందాల విషయంలో తేడా వచ్చిందని, వాటికి ఇంకా పరిష్కారం లభించనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
అయితే, బంగ్లాదేశ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో మరో మ్యాచ్ ఉండగానే భారత్ బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఆటలో భారత క్రికెటర్లు ఫేలవమైన ప్రదర్శన చేసినందున మరోసారి వారిని గాడిలో పెట్టాలని, మరోసారి హితబోధ చేసిన అనంతరమే మరో మ్యాచ్కోసం పంపించాలనే అభిప్రాయం బీసీసీఐకు ఉన్నట్లు సమాచారం. వచ్చే నెల జూలై 10 నుంచి భారత్ జింబాబ్వేలో వన్డే మ్యాచ్తోపాటు టీ ట్వంటీ కూడా ఆడాల్సి ఉంది. బ్రాడ్ కాస్టింగ్ వివాదం త్వరగా పరిష్కారం కాకుంటే వచ్చే ఏడాదికి ఈ మ్యాచ్లను వాయిదా వేయాలని కూడా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.