
టీమిండియా కొత్త చరిత్ర
చెన్నై:ఇంగ్లండ్ తో జరుగుతున్న సుదీర్ఘ టెస్టు సిరీస్లో టీమిండియా కొత్త చరిత్ర సృష్టించింది. భారత తన టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులను రికార్డును సొంతం చేసుకుంది. గత అత్యధిక పరుగుల రికార్డును ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ అధిగమించింది. 2009లో ముంబైలో జరిగిన టెస్టులో శ్రీలంకపై భారత్ 726 పరుగులే భారత్ కు ఇప్పటివరకూ టాప్ స్కోర్.
దీన్ని భారత్ తాజాగా అధిగమించింది. కరుణ్ నాయర్ అత్యద్భుతమైన ఆట తీరుతో భారత్ ఆ మార్కును బద్ధలు కొట్టింది.ఇప్పటివరకూ భారత్ నాలుగుసార్లు మాత్రమే ఏడొందల మార్కును చేరింది. గత 12 ఏళ్లలోనే ఏడొందలకు పైగా పరుగులను టీమిండియా నాలుగుసార్లు సాధించడం విశేషం. 2004లో సిడ్నీలో ఆస్ట్రేలియాపై తొలిసారి ఏడొందల పరుగులకు పైగా చేసిన భారత్.. ఆ తరువాత 2009లో శ్రీలంకపై ముంబైలో, 2010లో శ్రీలంకపై కొలంబోలో ఈ మార్కును భారత్ సాధించింది.
ఇదిలా ఉంచితే, ఒక సిరీస్లో టీమిండియా నాలుగుసార్లు టాస్ కోల్పోయిన తరువాత నాలుగొందలకు పైగా పరుగులను సాధించడం నాల్గోసారి.ఇంతవరకూ ఏ జట్టూ ఈ తరహాలో టాస్ కోల్పోయి నాలుగుసార్లు నాలుగొందల మార్కును చేరుకోలేదు.