సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా 622/7 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 303/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు శుక్రవారం ఆట ప్రారంభించిన భారత్ మరో 3 వికెట్లు కోల్పోయి 319 పరుగులు జోడించింది. రిషబ్ పంత్ సెంచరీ, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు సాధించారు.
తొలి రోజు సెంచరీ చేసిన వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా(193) ఏడు పరుగుల తేడాతో డబుల్ సెంచరీ కోల్పోయాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హనుమ విహారి(42) ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు అమూల్యమైన 101 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేశారు. యువ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌తో కలిసి ఆరో వికెట్‌కు 89 పరుగుల జత చేసిన పుజారా ఆరో వికెట్‌గా అవుటయ్యాడు.
చివర్లో పంత్, జడేజా జోడి చెలరేగడటంతో టీమిండియా స్కోరు 600 పరుగులు దాటింది. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 204 పరుగులు జోడించారు. సెంచరీ దిశగా సాగుతున్న జడేజాను లయన్ అవుట్ చేయడంతో టీమిండియా కెప్టెన్ కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. జడేజా 114 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 81 పరుగులు చేశాడు. 189 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్‌తో 159 పరుగులు చేసి పంత్ అజేయంగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో లయన్ 4, హాజిల్‌వుడ్ 2 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment