‘గాలి’ పోయింది | India defeat in first test | Sakshi
Sakshi News home page

‘గాలి’ పోయింది

Published Sun, Aug 16 2015 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM

‘గాలి’ పోయింది

‘గాలి’ పోయింది

♦ తొలి టెస్టులో భారత్ ఓటమి
♦ 112 పరుగులకే కుప్పకూలిన కోహ్లి సేన
♦ హెరాత్ సంచలన బౌలింగ్
♦ సిరీస్‌లో శ్రీలంకకు 1-0 ఆధిక్యం
 
 గతంలో ఎన్నడూ లేని విధంగా భారత ఆటగాళ్లు విదేశంలోని ఓ మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చేసుకున్నారు. జెండా ఎగరేశారు. జాతీయ గీతం పాడారు. కానీ ఆ స్ఫూర్తితో మైదానంలో పోరాడలేకపోయారు. కేవలం 176 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. 112 పరుగులకే కుప్పకూలిన కోహ్లి సేన జాతీయ పండగరోజు భారత పరువు తీసింది.
 
 గాలె : భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున మన క్రికెట్ జట్టు మరచిపోలేని పరాభవాన్ని మూటగట్టుకుంది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 63 పరుగులతో ఓడిపోయింది. ఆటన్నాక గెలుపోటములు సహజం. కానీ మూడు రోజులు ఆధిపత్యం చూపించిన టెస్టులో కేవలం 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓడిపోవడాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. గాలె అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు శనివారం భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 49.5 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌటయింది.

అజింక్య రహానే (76 బంతుల్లో 36; 4 ఫోర్లు), శిఖర్ ధావన్ (83 బంతుల్లో 28; 3 ఫోర్లు) మినహా ఒక్క బ్యాట్స్‌మన్ కూడా కొద్దిసేపైనా నిలబడలేదు. శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ హెరాత్ (7/48) ధాటికి భారత బ్యాట్స్‌మెన్ పోటీ పడుతూ పెవిలియన్‌కు క్యూ కట్టారు. మరో స్పిన్నర్ కౌశల్ మూడు వికెట్లు తీసుకున్నాడు. చండీమల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మూడు టెస్టుల సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యం సాధించింది. రెండో టెస్టు 20 నుంచి కొలంబోని సారా ఓవల్ మైదానంలో జరుగుతుంది.

 ఒకరి వెనుక ఒకరు...
 ఓవర్‌నైట్ స్కోరు 23/1తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన భారత్ మరో 153 పరుగులు చేస్తే గెలిచేది. అయితే ధావన్ పరుగు తీయడానికే ఓ ఎండ్‌లో ఇబ్బంది పడితే మరో ఎండ్‌లో హెరాత్ ధాటికి నైట్ వాచ్‌మన్ ఇషాంత్‌తో పాటు రోహిత్ పెవిలియన్‌కు చేరాడు. కోహ్లి, ధావన్‌లను కౌశల్ అవుట్ చేశాడు. దీంతో భారత్ 60 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రహానే ఒక ఎండ్‌లో నిలబడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా... రెండో ఎండ్‌లో హెరాత్ నాలుగు ఓవర్ల వ్యవధిలో మూడు వికెట్లు తీశాడు. దీంతో భారత్ 81 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అమిత్ మిశ్రా (15) కాసేపు రహానేకు అండగా నిలబడ్డాడు. అయితే హెరాత్ స్పిన్ ధాటికి రహానే కూడా పెవిలియన్‌కు చేరాడు. కౌశల్ బౌలింగ్‌లో మిశ్రా అవుట్ కావడంతో భారత్ ఓటమి లాంఛనం ముగిసింది.

 స్కోరు వివరాలు
 శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : 183 ; భారత్ తొలి ఇన్నింగ్స్: 375
 శ్రీలంక రెండో ఇన్నింగ్స్ : 367
 భారత్ రెండో ఇన్నింగ్స్ : లోకేశ్ రాహుల్ ఎల్బీడబ్ల్యు (బి) హెరాత్ 5; ధావన్ (సి) అండ్ (బి) కౌశల్ 28; ఇషాంత్ ఎల్బీడబ్ల్యు (బి) హెరాత్ 10; రోహిత్ (బి) హెరాత్ 4; కోహ్లి (సి) సిల్వ (బి) కౌశల్ 3; రహానే (సి) మ్యాథ్యూస్ (బి) హెరాత్ 36; సాహా (స్టం) చండీమల్ (బి) హెరాత్ 2; హర్భజన్ (సి) సిల్వ (బి) హెరాత్ 1; అశ్విన్ (సి) ప్రసాద్ (బి) హెరాత్ 3; అమిత్ మిశ్రా (సి) కరుణరత్నె (బి) కౌశల్ 15; ఆరోన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 112.
 వికెట్ల పతనం : 1-12; 2-30; 3-34; 4-45; 5-60; 6-65; 7-67; 8-81; 9-102; 10-112.
 బౌలింగ్ : ప్రసాద్ 4-2-4-0; హెరాత్ 21-6-48-7; కౌశల్ 17.5-1-47-3; ప్రదీప్ 6-3-8-0; మ్యాథ్యూస్ 1-0-3-0.
 
 ‘ఈ ఓటమికి మమ్మల్ని మేమే నిందించుకోవాలి. ఒత్తిడిని జయించడమే సాధారణ జట్టుకు, పెద్ద జట్టుకు తేడా. ఈ మ్యాచ్ ద్వారా తెలుసుకోవాల్సింది అదే. చండీమల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ప్రపంచస్థాయి బౌలర్ హెరాత్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. మేం బ్యాటింగ్ సరిగా చేయక ఈ మ్యాచ్‌లో ఓడిపోయాం. కాబట్టి డీఆర్‌ఎస్ లేకపోవడాన్ని ఇప్పుడు ప్రస్తావించడం అనవసరం. డీఆర్‌ఎస్ గురించి సిరీస్ అయిపోయాక ఆలోచిస్తాం.’              
-భారత కెప్టెన్ కోహ్లి
 
 18    200 లోపు లక్ష్యాన్ని ఛేదించలేక భారత్ విఫలం కావడం 18 ఏళ్ల తర్వాత ఇప్పుడే. చివరిసారిగా 1997లో వెస్టిండీస్‌పై 120 పరుగులు ఛేదించలేక ఓడింది.
 112    టెస్టుల్లో భారత్‌కు శ్రీలంకపై ఇదే అత్యల్ప స్కోరు
 22    టెస్టుల్లో హెరాత్ ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే వికెట్లు తీయడం ఇది 22వ సారి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement