
భారత్ 314.. న్యూజిలాండ్ 314; మూడో వన్డే టై
న్యూజిలాండ్తో ఐదు వన్డేల సిరీస్లో టీమిండియా పుంజుకుంది. వరుసగా తొలి రెండు మ్యాచ్లో ఓటమి చవిచూసిన ధోనీసేన మూడో వన్డేలో సత్తాచాటింది. ఓ దశలో ఓటమి అంచులకు వరకు వెళ్లినా జడేజా, అశ్విన్, ధోనీ పోరాట పటిమతో మ్యాచ్ను టైగా ముగించింది. తద్వారా సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. విజయానికి పరుగు దూరంలో భారత్ ఆగిపోయినా మ్యాచ్ మాత్రం అభిమానులకు అసలైన వన్డే క్రికెట్ మజా అందించింది. తొలి రెండు వన్డేల్లో కివీస్ గెలుపొందిన సంగతి తెలిసిందే. మరో రెండు వన్డేలు జరగాల్సివుంది.
315 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 46వ ఓవర్లో 275/8తో ఓటమి అంచున నిలిచింది. అలాంటి పరిస్థితి నుంచి జడేజా టీమిండియాను విజయం దిశగా నడిపించాడు. కాగా టీమిండియా నిర్ణీత ఓవర్లలో 314 పరుగులే చేసింది. ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సివుండగా, జడేజా పరుగే చేశాడు. కాగా ఈ ఓవర్లో జడేజా రెండు ఫోర్లు, సిక్సర్తో చెలరేగడంతో ఓటమి తప్పింది.
రోహిత్ శర్మ 39 (38 బంతుల్లో), శిఖర్ ధావన్ 28 (25 బంతుల్లో) మొదట్లో కాస్త పర్వాలేదనిపించారు. తర్వాత విరాట్ కోహ్లీ 6 పరుగులకే వెనుదిరగడం, అజింక్య రహానే కూడా 3 పరుగులతో నిరాశపరిచాడు. ఆ స్థితిలో సురేష్ రైనా, కెప్టెన్ ధోనీ కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ధోనీ నిదానంగా ఆడుతూ వికెట్ పడకుండా జాగ్రత్తగా 60 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకుని ఆండర్సన్ బౌలింగులో సౌతీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత వచ్చిన అశ్విన్, జడేజా దుమ్ము దులిపారు. అశ్విన్ 46 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఒకవైపు సహచరులు భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ తక్కువ పరుగులకే ఔటయినా, జడేజా మాత్రం చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో 45 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు.
అంతకుముందు న్యూజిలాండ్ బ్యాట్స్మన్ విశ్వరూపం చూపించారు. 315 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందుంచారు. ఓపెనింగ్ బ్యాట్స్మన్గా వచ్చిన గుప్తిల్ సెంచరీ చేసి దుమ్ము దులిపాడు. మిగిలిన వాళ్లలో విలియంసన్ ఒక్కడూ 65 పరుగులు చేసి కాస్త పర్వాలేదనిపించాడు. ఐదో ఓవర్లోనే రైడర్ను భువనేశ్వర్ కుమార్ క్లీన్బౌల్డ్ చేసి భారత శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. అయితే ఆ ఆశలు కాస్తా కాసేపటికే నీరుగారిపోయాయి. న్యూజిలాండ్ జట్టు స్కోరు 36 పరుగుల వద్ద ఉన్నప్పుడు 20 పరుగులు చేసిన రైడర్ భువనేశ్వర్ కుమార్కు అడ్డంగా దొరికిపోయాడు. కానీ ఆ తర్వాత రెండో వికెట్ కోసం దాదాపు 28 ఓవర్లు వేచి చూడాల్సి వచ్చింది. గుప్తిల్ వీర విజృంభణకు తోడు ఫస్ట్ డౌన్లో వచ్చిన విలియం సన్ కూడా తోడవ్వడంతో భారత బౌలర్ల వికెట్ల ఆకలి ఏమాత్రం తీరలేదు. చివరకు ఈ భాగస్వామ్యాన్ని షమీ విడగొట్టాడు. షమీ బౌలింగ్లో విలియంసన్ (65) కూడా క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఇతడి స్కోరులో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. తర్వాత కొద్ది సేపటికే ఆండర్సన్ను అశ్విన్ 8 పరుగులకే ఇంటికి పంపించాడు. జడేజా బౌలింగులో స్లాగ్ స్వీప్ కోసం ప్రయత్నించిన గుప్తిల్.. డీప్ మిడ్ వికెట్లో రహానేకు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా ఔటయ్యాడు. 123 బంతులలో 11 ఫోర్లు, ఒక సిక్సర్తో సెంచరీ చేసిన గుప్తిల్.. మరో్ 11 పరుగులు మాత్రం పూర్తి చేసి పెవిలియన్ బాట పట్టాడు. మిగిలిన బ్యాట్స్మన్ రోంచి (38), సౌతీ (27) మినహా మిగిలిన ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.
ఇషాంత్ శర్మను తప్పించి, ఆ స్థానంలో వరుణ్ ఆరోన్ను తీసుకున్నా, ఆ మార్పు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఏడు ఓవర్లు వేసి 52 పరుగులు సమర్పించుకున్న ఆరోన్.. మెకల్లం వికెట్ మాత్రమే తీయగలిగాడు. మిగిలినవారిలో షమీ, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్, ఆరోన్, అశ్విన్లకు ఒక్కో వికెట్ దక్కింది. అయితే.. జడేజా, అశ్విన్ మాత్రం పొదుపుగా బౌలింగ్ చేశారు. పదేసి ఓవర్లు వేసిన వీరిద్దరూ కేవలం 47 చొప్పున మాత్రమే పరుగులిచ్చారు. భువనేశ్వర్ కుమార్ కూడా 9 ఓవర్లలో 48 పరుగులిచ్చి పర్వాలేదనిపించాడు. మిగిలినవాళ్లను మాత్రం కివీస్ బ్యాట్స్మన్ ఆడుకున్నారు. మొదటి వన్డేలో తడబడి, రెండో వన్డేలో డక్వర్త్ లూయిస్ పద్ధతి కారణంగా ఓడిపోయిన టీమిండియా.. పరువు దక్కించుకుని సిరీస్ ఓటమి ఎదురుకాకుండా ఉండాలంటే ఈ వన్డేలో తప్పనిసరిగా గెలిచి నిలవాలి. ఇండియన్ బ్యాట్స్మన్ ఏం చేస్తారో చూడాలి మరి.