భలే భలే గెలిచారోయ్! | India end South Africa's resistance for 3-0 Test series win | Sakshi
Sakshi News home page

భలే భలే గెలిచారోయ్!

Published Tue, Dec 8 2015 2:09 AM | Last Updated on Sun, Sep 3 2017 1:38 PM

భలే భలే గెలిచారోయ్!

భలే భలే గెలిచారోయ్!

ఓ వైపు గోడలా నిలబడ్డ డివిలియర్స్... మరోవైపు ముంచుకొస్తున్న సాయం సమయం... ఓవర్లకు ఓవర్లు తరిగిపోతున్నాయి... వికెట్లు మాత్రం పడటం లేదు... ఎలా..? దక్షిణాఫ్రికా గోడను బద్దలు కొట్టేదెలా..? భారత్ నాలుగో టెస్టులో గెలిచేదెలా..?... చివరి టెస్టు ఐదో రోజు టీ విరామానికి వెళుతున్న సమయంలో భారత శిబిరంలో ఆందోళన ఇది.
 
టీ విరామంలో ఏం జరిగిందోగానీ... భారత జట్టు మ్యాజిక్ చేసింది. నాలుగు సెషన్ల పాటు  చెమటోడిస్తే ఐదు వికెట్లు దక్కిన పిచ్‌పై... కేవలం 27 బంతుల వ్యవధిలో ఆఖరి ఐదు వికెట్లు తీసింది. ఓ వైపు ఉమేశ్ రివర్స్ స్వింగ్... మరోవైపు అశ్విన్ నిలకడ... వెరసి సఫారీలకు షాక్. డ్రా కోసం సర్వశక్తులూ ఒడ్డిన దక్షిణాఫ్రికా భారత బౌలర్ల పట్టుదల ముందు చేతులెత్తేసింది.

 
నాగ్‌పూర్‌లోనే టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న కోహ్లిసేన... ఢిల్లీలో విజయంతో సిరీస్‌ను 3-0తో నెగ్గి ఫ్రీడం ట్రోఫీని సగర్వంగా అందుకుంది. నంబర్‌వన్ జట్టును కట్టిపడేసి ఐసీసీ ర్యాంక్‌ల్లో రెండో స్థానానికి ఎగబాకింది.

 
* చివరి టెస్టులో భారత్‌కు
* 337 పరుగుల విజయం
* డివిలియర్స్ పోరాటం వృథా
* అశ్విన్‌కు 5 వికెట్లు, రాణించిన ఉమేశ్

న్యూఢిల్లీ: సొంతగడ్డపై టి20, వన్డే సిరీస్‌లను కోల్పోయిన భారత్ టెస్టుల్లో తమ పదును చూపించింది. సఫారీలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా టెస్టు సిరీస్‌ను ఏకపక్షంగా మార్చేసింది. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌నుంచి ప్రతిఘటన ఎదురైనా...దానిని అధిగమించి మరో ఘన విజయాన్ని అందుకుంది.

సోమవారం ఇక్కడ ముగిసిన చివరి టెస్టులో భారత్ 337 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. ఫలితంగా 4 టెస్టుల సిరీస్‌ను 3-0తో సొంతం చేసుకుంది. 72/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 143.1 ఓవర్లలో 143 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకునే ప్రయత్నంలో ముగ్గురు ప్రధాన బ్యాట్స్‌మెన్ పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమైనా ఆ జట్టును ఓటమినుంచి కాపాడటానికి సరిపోలేదు.

డివిలియర్స్ (297 బంతుల్లో 43; 6 ఫోర్లు), ఆమ్లా (244 బంతుల్లో 25; 3 ఫోర్లు), డు ప్లెసిస్ (97 బంతుల్లో 10; 1 ఫోర్) తీవ్రంగా పోరాడారు. టీ విరామ సమయానికి 136/5 స్కోరుతో టెస్టును కాపాడుకునేటట్లు కనిపించిన సఫారీ జట్టు చివరి సెషన్‌లో 27 బంతుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన రహానే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవగా... సిరీస్‌లో 31 వికెట్లు తీసిన అశ్విన్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.
 
స్కోరు వివరాలు:-
భారత్ తొలి ఇన్నింగ్స్: 334; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 121; భారత్ రెండో ఇన్నింగ్స్: 267/5 డిక్లేర్డ్; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: ఎల్గర్ (సి) రహానే (బి) అశ్విన్ 4; బవుమా (బి) అశ్విన్ 34; ఆమ్లా (బి) జడేజా 25; డివిలియర్స్ (సి) జడేజా (బి) అశ్విన్ 43; డు ప్లెసిస్ (ఎల్బీ) (బి) జడేజా 10; డుమిని (ఎల్బీ) (బి) అశ్విన్ 0; విలాస్ (బి) ఉమేశ్ 13; అబాట్ (బి) ఉమేశ్ 0; పీడిట్ (సి) సాహా (బి) ఉమేశ్ 1; మోర్కెల్ (బి) అశ్విన్ 2; తాహిర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (143.1 ఓవర్లలో ఆలౌట్) 143.
 
వికెట్ల పతనం: 1-5; 2-49; 3-76; 4-111; 5-112; 6-136; 7-136; 8-140; 9-143; 10-143.
 
బౌలింగ్: ఇషాంత్ 20-12-23-0; అశ్విన్ 49.1-26-61-5; జడేజా 46-33-26-2; ఉమేశ్ 21-16-9-3; ధావన్ 3-1-9-0; విజయ్ 2-0-2-0; కోహ్లి 1-1-0-0; పుజారా 1-0-2-0.
 
తొలి సెషన్: ఆమ్లా అవుట్
మ్యాచ్ చివరి రోజు కూడా అదే పట్టుదలతో ఆమ్లా, డివిలియర్స్ తమ పోరాటాన్ని కొనసాగించారు. పరుగులు చేయకుండా మళ్లీ డిఫెన్స్‌కే కట్టుబడ్డారు. అయితే 13వ ఓవర్లో జడేజా భారత్‌కు కావాల్సిన బ్రేక్ అందించాడు. జడేజా బంతిని అంచనా వేయడంలో ఆమ్లా విఫలమై బౌల్డయ్యాడు. అయితే ఏబీకి డు ప్లెసిస్ అండగా నిలిచి వెంటనే వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డాడు.
 ఓవర్లు: 35, పరుగులు: 22, వికెట్లు: 1
 
రెండో సెషన్: చెక్కుచెదరని ఏకాగ్రత
సిరీస్ ఆసాంతం విఫలమైన డు ప్లెసిస్... ఆమ్లా, డివిలియర్స్‌లను తలదన్నే డిఫెన్స్ చూపించాడు. తాను ఎదుర్కొన్న 53వ బంతికి గానీ అతను మొదటి పరుగు తీయలేదు. మరో వైపు ఉమేశ్ బౌలింగ్‌లో కొన్ని బంతులు అనూహ్యంగా బౌన్స్ అయి డివిలియర్స్‌ను గాయపర్చినా అతను తొణకకుండా అడ్డుగోడలా నిలబడ్డాడు. అయితే చివరకు జడేజా బౌలింగ్‌లోనే ప్లెసిస్  వికెట్ల ముందు దొరికిపోవడంతో 35.1 ఓవర్ల భాగస్వామ్యానికి తెరపడింది. కొద్దిసేపటికే డుమిని (0)ని కూడా అశ్విన్ ఎల్బీగా పెవిలియన్ పంపించడంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది.
ఓవర్లు: 29, పరుగులు: 42, వికెట్లు: 2
 
మూడో సెషన్: ‘రివర్స్’ చేసిన ఉమేశ్
విరామం తర్వాత కనీసం 24 ఓవర్లు వేసేందుకు అవకాశం ఉన్న స్థితిలో మూడో సెషన్ మొదలైంది. డివిలియర్స్ క్రీజ్‌లో ఉండటంతో సఫారీలు మ్యాచ్ ‘డ్రా’ చేసుకోగలిగే అవకాశం కూడా కనిపించింది. అయితే ఉమేశ్ యాదవ్ తన రివర్స్ స్వింగ్‌తో మ్యాచ్ గమనాన్ని మార్చాడు.

విలాస్ (13), అబాట్ (0)లను బౌల్డ్ చేశాడు. అయితే ఈ రెండు వికెట్ల మధ్య భారత్ కోరుకున్న వికెట్ లభించింది. దాదాపు ఆరు గంటల పాటు క్రీజ్‌లో పోరాడిన డివిలియర్స్ చివరకు అశ్విన్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడబోయి లెగ్‌స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. పీడిట్ (1)ను ఉమేశ్ అవుట్ చేయగా, మోర్కెల్ (2)ను బౌల్డ్ చేసి అశ్విన్ సిరీస్‌కు అద్భుత ముగింపునిచ్చాడు.
ఓవర్లు: 5.1, పరుగులు: 7, వికెట్లు: 5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement